Jul 06,2023 00:13

సమావేశంలో మాట్లాడుతున్న ఐటిడిఎ పిఒ సూరజ్‌ గనోరే

ఐటిడిఎ పిఒ ఆదేశం
ప్రజాశక్తి-చింతూరు

వర్షా కాలంలో వచ్చే మలేరియా, డెంగీ తదితర జ్వరాలపై దృష్టి సారించాలని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సిబ్బందిని ఐటిడిఎ పిఒ సూరజ్‌ గనోరే ఆదేశించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైధ్యాధికారులు, సబ్‌ యూనిట్‌ ఆఫీసర్లు, హెల్త్‌ అసిస్టెంట్లతో బుధవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ హెల్త్‌ అసిస్టెంట్లు క్షేత్రస్థాయిలో తప్పనిసరిగా గృహ సందర్శన చేయాలని, మలేరియా పాజిటివ్‌ కేసులు నమోదైతే అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సూచించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. క్షేత్రస్తాయి సిబ్బంది, ల్యాబ్‌ టెక్నీషియన్ల పని తీరును రెగ్యులర్‌గా పరిశీలించాలని ఏరియా హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌ని, వైద్యాధికారులను ఆదేశించారు. మలేరియా, డెంగీ నివారణకు సంబందించిన అన్ని రకాల కెమికల్స్‌, మందులు, ఇంజెక్షన్లు అందుబాటులో ఉంచాలని మలేరియా డిస్ట్రిక్ట్‌ కన్సల్టెంట్‌ చంటిబాబుని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా ఉప వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్‌ పుల్లయ్య, ఏరియా హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కోటిరెడ్డి పాల్గొన్నారు.