Feb 02,2022 21:40

ప్రజాశక్తి - ఏలూరు కల్చరల్‌
        దెందులూరు నియోజకవర్గ మాజీ ఎంఎల్‌ఎ, టిడిపి సీనియర్‌ నేత గారపాటి సాంబరావు బుధవారం పెదపాడు మండలం నాయుడుగూడెంలోని తన స్వగృహంలో కన్నుమూశారు. గత కొన్నిరోజులుగా అనారోగ్యం, వయోభారంతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించి మృతిచెందారు. 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పటి నుంచి గారపాటి సాంబశివరావు పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించారు. పార్టీ వ్యవస్థాపకులు ఎన్‌టి.రామారావుకు అత్యంత సన్నిహితులుగా ఉండేవారు. ఆయన ఎమ్మెల్యేగా నాలుగుసార్లు విజయం సాధించారు. పార్టీకి విధేయుడిగా వ్యవహరించిన సాంబశివరావు మంత్రిగా బాధ్యతలు చేపట్టి సమర్థవంతంగా నిర్వహించారు. రాజకీయాల్లో తనకంటూ సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న సాంబశివరావు మరణవార్త పార్టీ నేతలను దిగ్భ్రాంతికి గురిచేసింది. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ప్రజాసేవకే జీవితాన్ని అంకితం చేసిన సాంబశివరావు మరణం పార్టీకి, ప్రజలకు తీరని లోటు అని టిడిపి ఏలూరు నియోజకవర్గ కన్వీనర్‌ బడేటి రాధాకృష్ణయ్య (చంటి) అన్నారు. మరణవార్త తెలియగానే బడేటి చంటి, టిడిపి నాయకులు పాలి ప్రసాద్‌, కొక్కిరగడ్డ జయరాజు, చోడే వెంకటరత్నం ఆయన స్వగృహానికి వెళ్లి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.