ప్రజాశక్తి -గుంటూరు జిల్లాప్రతినిధి : జిల్లాలో ఖరీఫ్ సాగు కొంత మేరకు ఊపందుకుంది. పల్నాడు జిల్లా కంటే గుంటూరు జిల్లాలో వర్షాలు ఆశాజనకంగా ఉండటం, కాల్వలకు అవసరం మేరకు నీరు రావడం వల్ల వరినాట్లు ఊపందుకున్నాయి. జిల్లాలో 3.25 లక్షల ఎకరాల్లో పంటలు వేయాలని లక్ష్యంగా నిర్ణయించుకోగా ఇప్పటివరకు 1.85 లక్షల ఎకారాల్లో వివిధ రకాల పైర్లు వేశారు. 1.66 లక్షల ఎకరాల్లో వరి సాగు అవుతుందని అంచనా వేయగా ఇప్పటివరకు 1.25 లక్షల ఎకరాల్లో సాగైంది. ఇందులో దాదాపు 95 వేల ఎకరాల్లో వెదపద్ధతిలో సాగు చేయగా 30 వేల ఎకరాల్లోనే సాధారణ నాట్లు పద్ధతిలో సాగు చేశారు. ఇంకా 40 వేల ఎకరాల్లో వరి సాగుచేయాల్సి ఉందని అధికారవర్గాలు తెలిపాయి. పత్తి సాగు 76 వేల ఎకరాలకు గాను 42 వేల ఎకరాలు, మిర్చి 40 వేల ఎకరాలకుగాను 10 వేల ఎకరాల్లో సాగు చేశారు. మరో 8 వేల ఎకరాల్లో ఇతర పంటలు సాగు చేశారు.
తాడికొండ, పెదనందిపాడు, మేడికొండూరు, ఫిరంగిపురం, కాకుమాను, వట్టిచెరుకూరు తదితర మండలాల్లో చాలినంత వర్షాలు లేకపోవడంతో మిర్చి, పత్తిసాగు ఇంకా ఊపందుకోలేదు. సాగర్ ఆయకట్టు పరిధిలో ఈఏడాది నీరు విడుదల చేస్తారని హామీ లేకపోవడంపై మిర్చి సాగు అంశంలో రైతులు తటపటాయిస్తున్నారు. డెల్టాకు పట్టిసీమ నుంచి నీరు వస్తుండటంతో కొంత మేరకు పరిస్థితి ఆశాజనకంగా ఉంది. దీంతో రైతులు వరి సాగుకు సమాయత్తం అయ్యారు. డెల్టాకు మాత్రమే ఉపయోగపడే పులిచింతల జలాశయంలో కూడానీటి నిల్వ గణనీయంగా తగ్గిపోయింది. పులిచింతల గరిష్ట నీటి నిల్వ 45.77 టిఎంసిలు కాగా ఆదివారం నాటికి 23.09 టిఎంసిల నిల్వ ఉంది. అయితే గతేడాది ఆగస్టు 27 నాటికి 39.22 టిఎంసిల నీరు నిల్వ ఉన్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజి నుంచి పశ్చిమ డెల్టాకు 4513 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. గుంటూరు ఛానల్‌కు 64 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్టు అధికారులు తెలిపారు.
డెల్టాకు ప్రస్తుతానికి నీటి ఎద్దడి లేకున్నా వరి పైరు పొట్టదశకు వచ్చే సమయానికి వర్షాలు లేకపోతే పులిచింతల నుంచి నీరు విడుదల చేయాల్సి ఉంటుంది. అప్పటికి ఎగువనుంచి వరద ప్రవాహం రాకపోతే కొంత ఇబ్బంది రావచ్చునని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం పట్టిసీమ నుంచి గోదావరి జలాలు రావడంవల్ల ఈఏడాది కృష్ణాడెల్టాలో వరి సాగుకు ఇబ్బంది లేకుండా ఉంది. జిల్లాలో గత నెల రోజుల్లో ఎక్కువ మండలాల్లో ఆశాజనకమైన వర్షాలు కురిశాయి. నిర్ణీత వర్షపాతం కన్నా ఎక్కువగా వర్షాలు కురిసిన మండలాల్లో తెనాలి, చేబ్రోలు, దుగ్గిరాల, గుంటూరు ఈస్టు, వెస్టు, కాకుమాను, కొల్లిపర, పొన్నూరు, ప్రత్తిపాడు మండలాల్లో 90 శాతంకుపైగా వర్షపాతం నమోదైంది. మిగతా మండలాల్లో 50శాతం లోపు మాత్రమే వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో జూన్ నెలలో 97.1 మిల్లీమీటర్లకు గాను 105.8మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు అయింది. జులైలో 164.9 మిల్లీ మీటర్లకు గాను 255.2 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా ఆగస్టులో 164.7 మిల్లీ మీటర్లకు గాను 27వ తేదీవరకు సగటున 112.7 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది.










