Nov 10,2023 23:56

డెల్టాకు పొంచి ఉన్న నీటి ఎద్దడి

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : కృష్ణా డెల్టాకు నీటి ఎద్దడి మరింత పెరగనుంది. ఇటీవల రెండ్రోజులపాటు కురిసిన వర్షాలతో వరి పైరు కొంతవరకు నిలదొక్కుకున్నా మరో తడికి నీరు కావాలంటే కాల్వలకు విడుదల చేస్తారో చేయరో తెలియడం లేదు. ప్రధానంగా పులిచింతల జలాశయంలో నీటి నిల్వ భారీగా తగ్గిపోయింది.
పులిచింతల జలాశయం గరిష్టనీటి నిల్వ 45.77 టిఎంసిలు కాగా శుక్రవారం సాయంత్రంకు 15.06 టిఎంసిల నీటి నిల్వ ఉంది. ప్రస్తుతం ఇన్‌ఫ్లో 800 క్యూసెక్కులు ఉండగా అవుట్‌ఫ్లో 3200 క్యూసెక్కులే విడుదల చేస్తున్నారు. ఇంకా 5 టిఎంసిల వరకు వరి సాగుకు నీరు ఇవ్వాల్సి ఉందని, మిగతా 10 టిఎంసిలు రానున్న ఆరు నెలల్లో తాగునీటి అవసరాలకు వినియోగించుకోవాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు. ఖరీఫ్‌ తరువాత రబీ సాగుకు నీటిని ఇవ్వలేమని అధికారులు ముందే చెబుతున్న నేపథ్యంలో ఇప్పటి వరకు ఏ పంటలు వేయని దాదాపు 95 వేల ఎకరాల్లో రబీ పంటలు వేయడానికి కూడా రైతులు సాహసం చేయడం లేదు. గత నెల రోజుల్లో కేవలం 3 వేల ఎకరాల్లోనే అపరాల సాగైనట్లు అధికారులు తెలిపారు.
గతేడాది పులిచింతలలో ఇదే సమయానికి 38 టిఎంసిల నీరు నిల్వ ఉండగా ఈ ఏడాది ఎగువ నుంచి ప్రవాహం లేకపోవడం వల్ల పూర్తి తగ్గింది. అంతేగాక సాగర్‌, శ్రీశైలంలో కూడా నీటి నిల్వ పెరగడం లేదు. సాగర్‌ జలాశయంలో గరిష్టనీటి నిల్వ 312.04 టిఎంసిలు కాగా 157 టిఎంసిల నిల్వ ఉంది. సాగర్‌లో గతేడాది ఇదేరోజుకు 300 టిసిఎంల నీరు నిల్వ ఉండగా ఈ ఏడాది సగానికి తగ్గిపోయింది. ఈ ఏడాది తీవ్ర వర్షాభావం వల్ల కృష్ణా డెల్టాలో ఏర్పడిన సాగునీటి సంక్షోభం నుంచి కొంత ఉపశమనం పొందేందుకు ఒకవైపు పులిచింతల, మరోవైపు పట్టిసీమ పథకాలను ఉపయోగించుకున్నారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజి నుంచి 9 వేల క్యూసెక్కులు తూర్పు,పశ్చిమ డెల్టాకు విడుదల చేస్తున్నారు. పట్టిసీమ నుంచి దాదాపు ఆరువేల క్యూసెక్కులు వస్తున్నాయి. పులిచింతలలో నీటి నిల్వ పూర్తిగా తగ్గడం, వర్షాభావం వల్ల రబీ పంటలకు సాగు నీరు లభ్యమయ్యే పరిస్థితి లేదని అధికారులు చెబుతున్నారు.
పశ్చిమ డెల్టా పరిధిలో నాలుగు లక్షల ఎకరాల్లో వరి సాగవగా రెండో పంటగా రబీ పంటలైన జొన్న, మొక్కజొన్న సాగుకు రైతులు సమాయత్తం అయ్యేందుకు నీటి సరఫరాపై అయోమయ పరిస్థితులు నెలకొన్నాయి. గుంటూరు, బాపట్ల జిల్లాల్లో 4 లక్షల ఎకరాల్లో వరి సాగవగా ఇందులో చివరి భూములకు నీరందక రెండు లక్షల ఎకరాల్లో వరిపైరు బెట్టకు వచ్చిన పరిస్థితిలో ఇటీవల కురిసిన వర్షాలతో కొంత మేరకు తాత్కాలిక ఉపశమనం కలిగింది. అయితే ఇటీవల ఉపరితల ధ్రోణి వల్ల రెండు రోజులపాటు ఒక మోస్తరు నుంచి భారీ వర్షం కురిసినా ఆగస్టు, సెప్టెంబరులో సాగు చేసిన వారికి ప్రస్తుతం నీటి అవసరం పెరుగుతోంది. మరో పక్షం రోజులు వర్షం కురవకపోతే తిరిగి కొన్ని ప్రాంతాల్లో వరికి ఇబ్బంది తప్పదు.