
ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : కృష్ణా పశ్చిమ డెల్టాకు సాగునీటి ఎద్దడి ఏర్పడింది. పులిచింతల నుంచి పూర్తిస్థాయిలో నీరు విడుదల చేయకపోవడంతో వరి పైరుకు నీరందక రైతులు ఆందోళనకు గురవుతున్నారు. పులిచింతలలో 32.75 టీఎంసీల నీరు నిల్వ ఉండగా దిగువకు 3 వేల క్యూసెక్కులే విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజి నుంచి పశ్చిమ డెల్టా ప్రధాన కాల్వలకు నీటి విడుదల పరిమాణాన్ని గణనీయంగా తగ్గించారు. బుధవారం పశ్చిమ డెల్టా కాల్వలకు 3007 క్యూసెక్కులే విడుదల చేశారు. గతనెలలో ఐదు వేల క్యూసెక్కుల వరకు ఇచ్చారు.
డెల్టా ప్రాంతంలో వరిపైరు వివిధ దశల్లో ఉంది. ఎక్కువ ప్రాంతాల్లో పొట్టదశలో ఉండగా ఆలస్యంగా సాగు చేసిన ప్రాంతాల్లో ఎదుగుదల దశలో ఉంది. దీంతో ప్రస్తుతం నీటి అవసరం పెరిగింది. 10 రోజులుగా వర్షాల్లేవు. వేడిగాలులు పెరిగాయి. అక్టోబరులో ఇప్పటి వరకు వర్షపాతం ఆశాజనకంగా లేదు. ఈనెలలో 129.4 మిల్లీ మీటర్ల వర్షం కురవాల్సి ఉండగా ఇప్పటివరకు 14.5 మిల్లీ మీటర్లే నమోదైంది. అన్ని కాల్వలకూ కలిపి కనీసం ఆరువేల క్యూసెక్కుల నిరివ్వాల్సి ఉండగా 3 వేల క్యూసెక్కులే ఇస్తున్నారని రైతులు చెబుతున్నారు. ప్రకాశం బ్యారేజికి ఎగువ నుంచి 7,095 క్యూసెక్కులు వస్తోంది. పట్టిసీమ, పులిచింతల వస్తున్న 7,095 క్యూసెక్కుల్లో తూర్పు, పశ్చిమ డెల్టాలకు కలిపి 6,079 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
తెనాలి, పెదనందిపాడు మండలాల్లో నీటి ఎద్దడి ఎక్కువగా ఉందని, కృష్ణా డెల్టాలో నీరు సరిపడా లేక పంటలు ఎండిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టామని, కనీసం నెలరోజుల పాటు నీటి అవసరం ఉందని రైతులు తెలిపారు. తెనాలి, వేమూరు నియోజకవర్గాల్లో కాల్వల్లో నీరు సరిగా విడుదల చేయని కారణంగా పంటలు ఎండిపోతున్నాయని రైతులు బుధవారం నీటిపారుదల శాఖ అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. మాజీ మంత్రులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, నక్కా ఆనంద్‌బాబు ఆధ్వర్యంలో రైతులు అధికారుల ఎదుట తమ గోడు వెళ్లబోసుకున్నారు. నీటి యాజమాన్యం, నిర్వహణ సరిగాలేదన్నారు.
గుంటూరు జిల్లాలో 3.25 లక్షల ఎకరాలకుగాను 2.35 లక్షల ఎకరాల్లోనే పంటలు సాగు చేశారు. ఇంకా 90 వేల ఎకరాల్లో ఏ పంటలూ వేయలేదు. 1.65 లక్షల ఎకరాల్లో వరి సాగు చేయాల్సి ఉండగా 1.40 లక్షల ఎకరాల్లో వరి వేశారు. 70 శాతం మంది రైతులు వెదపద్ధతిలో సాగు చేయగా 30 శాతం మంది సంప్రదాయ నాట్లు పద్ధతిలో సాగు చేశారు. జిల్లాలో 77 వేల ఎకరాల్లో పత్తిసాగు చేస్తారని అధికారులు ప్రకటించగా 44 వేల ఎకరాల్లోనే సాగైంది. 45 వేల ఎకరాల్లో మిర్చిసాగు చేయాల్సి ఉండగా 24 వేల ఎకరాల్లోనే సాగు చేశారు. 20 వేల ఎకరాల్లో ఇతర పంటలు వేశారు. ఇప్పటివరకు ఏ పంటలూ వేయని వారు రబీ సాగుకు సమాయత్తం అవుతున్నారు. ప్రధానంగా జొన్న, మొక్కజొన్న, మినుము,పెసర వేసేందుకు రైతులు ప్రయత్నిస్తున్నారు.