Feb 25,2023 21:41

            ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా స్థానిక సంస్థల ఎంఎల్‌సి నామినేషన్ల ప్రక్రియ పరిశీలన దశ దాటింది. ఉపసంహరణ ప్రక్రియ సాగుతోంది. ఏదేమైనా సోమవారం సాయంత్రం నాటికి ఎన్నికలు జరుగుతాయా లేక ఏకగ్రీవమా అనేది తేలిపోనుంది. అయితే అభ్యర్థిత్వాల ఖరారులో వైసిపి అధిష్టానం అనుసరించిన వ్యూహాం, ప్రధాన ప్రతిపక్షం టిడిపి తనకేమీ పట్టనట్లు వ్యవహరించడం చర్చనీయాంశాలుగా మారాయి.
స్థానిక సంస్థల కోటాలో పాలకొల్లు నుంచి ఒకరికి అవకాశం దక్కుతుందని మొదటి నుంచి వైసిపి నేతలు అంతా భావించారు. ఎంఎల్‌సి రేసులో మేకా శేషుబాబు, గుణ్ణం నాగబాబు ఉండటంతో నాగబాబుకే అవకాశం దక్కుతుందని అంతా ఊహించారు. అయితే అనుహ్యంగా జెడ్‌పి ఛైర్మన్‌, పాలకొల్లు నియోజకవర్గ ఇన్‌ఛార్జి కవురు శ్రీనివాస్‌ అభ్యర్థిత్వాన్ని అధిష్టానం ఖరారు చేయడంతో అంతా ఆశ్చర్యచకితులయ్యారు. వచ్చే ఎన్నికల్లో ఎంఎల్‌ఎ అభ్యర్థిగా ప్రచారంలో ఉన్న కవురు శ్రీనివాస్‌కు ఎంఎల్‌సిగా అవకాశం ఇవ్వడం అధిష్టానం వ్యూహమేనని తెలుస్తోంది. పాలకొల్లు నియోజకవర్గంలో కాపుల ఓటింగ్‌ ఎక్కువ. ఆ రీత్యా అక్కడ టిడిపి నుంచి సిట్టింగ్‌ ఎంఎల్‌ఎ నిమ్మల రామానాయుడును ధీటుగా ఎదుర్కోవాలంటే అనివార్యంగా అదే సామాజిక తరగతికి చెందిన వారికి టిక్కెట్‌ ఇవ్వాలని అధినేతల ఆలోచనగా తెలుస్తోంది. ఆ రీత్యా కవురు శ్రీనివాస్‌కు ఎంఎల్‌సిగా అవకాశం ఇచ్చి ఎంఎల్‌ఎ అభ్యర్థిత్వం నుంచి పక్కన పెట్టేందుకు వ్యూహరచన చేసినట్లు తెలుస్తోంది. అదే సమయంలో నాగబాబుకు ఎంఎల్‌సిగా అవకాశం ఇస్తే మేకా శేషుబాబు ఇండిపెండెంట్‌గా రంగంలోకి దిగే సూచనలు కన్పించాయి. దీంతో మధ్యేమార్గంగా కవురును ఎంఎల్‌సిగా పంపడం ద్వారా శేషుబాబుకు తాత్కాలికంగా బ్రేక్‌ వేయడం, ఎంఎల్‌ఎ అభ్యర్థి రేసు నుంచి కవురును తప్పించి నాగబాబుకు అవకాశం ఇవ్వడం ఒకే దెబ్బకు రెండు పిట్టలు చందంగా అధిష్టానం వ్యవహరించిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే రెండు ఎంఎల్‌సి పదవులు పశ్చిమగోదావరి పరిధిలోని వారికే ఇవ్వడం ఇటు ఏలూరు జిల్లాలోని నేతలను నిరాశకు గురి చేసింది. ఇప్పటికే ఏలూరు జిల్లా నుంచి మంత్రులు కాదుకదా. కనీసం రాష్ట్ర స్థాయి క్యాబినెట్‌ హోదా కలిగిన పదవులు కూడా లేవు. ఈ క్రమంలో కచ్ఛితంగా ఈసారి ఎంఎల్‌సి పదవి ఏలూరు జిల్లాకు కేటాయిస్తారని అంతా ఆశించారు. స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి అవకాశం ఇవ్వకపోయినా కనీసం ఎంఎల్‌ఎ కోటాలో ఇస్తారనుకుంటే అదీ ఇటీవల ఏలూరు జిల్లాలో విలీనమైన కొల్లేరు ప్రాంత వ్యక్తికీ, అదీ టిడిపి నుంచి వచ్చిన జయమంగళ వెంకటరమణకు పదవి కట్టబెట్టడం ఏలూరు జిల్లాలోని వైసిపి శ్రేణులను మరింత కుంగదీసింది. ఈ క్రమంలో కనీసం జెడ్‌పి ఛైర్మన్‌ పదవైనా ఏలూరు జిల్లా పరిధిలో వారికి కట్టబెడతారా.. లేక అదీ గతంలో మాదిరి డెల్టా ప్రాంతవాసికి కట్టబెడతారా అనే చర్చ వైసిపి శ్రేణుల్లో పెద్దఎత్తున సాగుతోంది.
నేతలంతా ఎంఎల్‌సి ఎన్నికల హడావుడిలో ఉంటే రైతులు సాగునీటి కోసం నానావస్థలు పడుతున్నారు. దాళ్వా సాగుకు ఎటువంటి ఇబ్బందీ లేకుండా ప్రతి ఎకరాకూ నీరందిస్తామని చెప్పిన మంత్రులు సాగునీటి సమస్యపై నోరు మెదపకపోవడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. వంతులవారీ విధానం కూడా సత్ఫలితాలు ఇవ్వకపోవడంతో పొలాలన్నీ ఎండిపోతున్నాయి. దీంతో రైతులు ఆయిల్‌ ఇంజిన్లు ఏర్పాటు చేసుకుని నీటిని తోడి వరిపైరును రక్షించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటం సమస్యను మరింత జఠిలం చేస్తోంది. ప్రధానంగా సాగునీరు పంపిణీలో అధికార పార్టీ పెద్దల జోక్యం, నీటి మళ్లింపు కారణంగానే సమస్య తీవ్రతకు కారణమని రైతులు చెబుతున్నారు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రైతులందరికీ అవసరమైన సాగునీరందేలా చర్యలు చేపట్టాలి. లేనిపక్షంలో నీరందక దిగుబడి తగ్గి రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది.
-విఎస్‌ఎస్‌వి.ప్రసాద్‌