Jul 20,2023 22:58

ఇటీవల వర్షాల సందర్భంగా తెనాలి ఐతానగర్‌-నేలపాడు రోడ్డులో పొలాల్లోకి చేరిన వర్షపు నీరు

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమై 40 రోజులు దాటినా నీటిపారుదల శాఖ అధికారులు మరమ్మతు పనులు ఇంకా పూర్తి చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలీచాలని వర్షాలతో కాల్వలకు వచ్చిన అరకొర నీటితోనే వెదపద్ధతిలో వరి సాగు చేసిన రైతులను ఆదిలోనే కష్టాలు వెంటాడుతున్నాయి. కాల్వల ద్వారా పారాల్సిన నీరు చిన్నపాటి వర్షాలకే పొలాల్లోకి చేరి పైరును దెబ్బతిస్తోంది.
మరోవైపు కృష్ణా పశ్చిమ డెల్టాకు ప్రస్తుతం 1100 క్యూసెక్కులునీరు విడుదల చేస్తున్నారు. పూర్తిస్థాయిలో ఒకేసారి 5 వేల క్యూసెక్కుల నీరువిడుదల చేస్తే ఏగట్టు ఎక్కడ తెగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. దుగ్గిరాల ప్రాంతంలో మురుగు కాల్వలు, పంట కాల్వలు, పిల్ల కాల్వలో పూడిక తీయకపోవడంతో ఈ ప్రాంత రైతులు తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. మురుగు కాల్వల స్వరూపం మారి పంట కాల్వలు, పిల్ల కాల్వలకు రెండింటికీ పెద్ద వ్యత్యాసం లేకుండా తయారైంది. కొల్లిపర మండలం అత్తోటవద్ద పూడిక పనులు, ఒ అండ్‌ ఎం పనులు చేయకపోవడంతో రైతులే ఒక్కొక్కరు రూ.500 చందాలు వేసుకుని మరమ్మతులు చేసుకుంటున్నారు. మరమ్మతులకు ప్రభుత్వం నిధులను సకాలంలో మంజూరు చేయకపోవడం, గతంలో చేసిన పనులకు నిధులు రాకపోవడం, సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పనులు చేస్తే సొమ్ము వస్తుందో రాదో తెలియని అయోమయంలో కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో తదితర కారణాల వల్ల పనులు చేపట్టడంతో జాప్యమైనట్లు తెలిసింది.
కృష్ణా పశ్చిమ డెల్టా పరిధిలో 1.84 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. గుంటూరు ఛానల్‌ ద్వారా 27 వేల ఎకరాలు, చెరువుల ద్వారా 3,795 ఎకరాలు సాగు చేస్తారు. ప్రతి ఏటా డెల్టాలో వరిసాగుకు 26.34 టీఎంసీల నీరు అవసరం అవుతుంది. ఇందులో కృష్ణా పశ్చిమ డెల్టాకు 22.24, గుంటూరు ఛానల్‌ ద్వారా నాలుగు టీఎంసీలపే కాల్వల ద్వారా రైతులు వినియోగించుకుంటారు. మంగళగిరి, పొన్నూరు, ప్రత్తిపాడు, పొన్నూరు, తెనాలి, తాడికొండ నియోజకవర్గాల్లోని 2,14,985 ఎకరాల్లో మొదటి పంటగా వరిసాగు చేస్తారు. ఖరీఫ్‌ సీజన్‌లో సాగు కోసం గతనెల 7న మంత్రి అంబటి రాంబాబు ప్రకాశం బ్యారేజి నుంచి కాల్వలకు నీరు విడుదల చేశారు. అయితే నీటి విడుదలకు ముందే కాల్వల మరమ్మతులు చేయాల్సిన అధికారులు ఇప్పటికీ పూర్తిచేయలేకపోయారు.
ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ (ఒ అండ్‌ ఎం) కింద ఐదు నియోజకవర్గాల పరిధిలో రూ.8.32 కోట్లతో మొత్తం 86 పనులకు ఆమోదం తెలిపారు. ఇప్పటి వరకు 30 పనులనుమాత్రమే ప్రారంభించారు. వీటిల్లో 20 వరకు పూర్తయ్యాయి. ఇంకా 56 పనులు ప్రారంభించాల్సి ఉందని ఇటీవల జరిగిన డిఆర్‌సి సమావేశంలో అధికారులు ప్రకటించారు. గతనాలుగు రోజులుగా వర్షాలు ప్రారంభం కావడంతో పనులు ఎప్పటికి పూర్తవుతాయన్నదీ ప్రశ్నార్థకంగా మారింది. కాల్వల్లో చెత్తాచెదారం, తూటుకాడ, గుర్రుపు డెక్క తొలగింపు పనులు వేసవిలోనే పూర్తి చేయాల్సి ఉండగా జులైలో ఈ పనులు ప్రారంభించడంతో ప్రజా ప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు చేబ్రోలు మండలం వడ్లమూడి, శ్రీరంగపురం డ్రెయిన్‌, కొండూరు డ్రెయిన్‌, పెదకాకాని మండలం నంబూరు, వడ్డిముక్కల వద్ద పొలిమేర డొంక, పొన్నూరు మండలం నిడుబ్రోలు, తెనాలి మండలం కొలకలూరు మైనర్‌ డ్రెయిన్లలో పూడిక పనులు పూర్తి చేసినా మిగతావి అసంపూర్తిగా ఉన్నాయి.