Nov 04,2023 21:00

నిరసన తెలుపుతున్న కౌలు రైతు సంఘం నాయకులు, కౌలు రైతులు

ప్రజాశక్తి- గజపతినగరం : మండలంలోని పాత శ్రీరంగరాజపురం గ్రామంలోని సీతారామస్వామి దేవస్థానానికి సంబంధించిన భూములను వేలం పాట వేయకుండా ఆపాలని కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాకోటి రాములు కోరారు. శనివారం స్థానిక తహశీల్దార్‌ కార్యాలయం వద్ద కౌలు రైతులతో కలిసి ఆయన నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేవస్థానం భూముల్లో గత 60 సంవత్సరాలుగా కౌలు రైతులు పంటలను పండించుకుని జీవిస్తున్నారన్నారు. అటువంటి భూముల్లో మూడు రోజులు క్రితం దేవస్థానం అధికారులు వచ్చి వరి పంట కోత తరువాత రెండో పంట వేయవద్దని, ఆ భూములను వేలం పాట వేస్తామని బెదిరించి వెళ్లిపోయారన్నారు. కౌలు రైతులు అక్కడ దేవస్థానానికి వేలాది రూపాయలు చెల్లిస్తున్నారని వెంటనే వేలం పాట ఆపి కౌలు రైతులను కొనసాగించాలని డిమాండ్‌ చేశారు. అనంతరం వినతి పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో కౌలు రైతులు తదితరులు పాల్గొన్నారు.