ప్రజాశక్తి-పర్చూరు: మండలంలోని దేవరపల్లి దళితుల భూములకు సంబంధించి తమపై అక్రమంగా పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని సిపిఎం రాష్ట్ర నాయకులు పి మధు డిమాండ్ చేశారు. దేవరపల్లి దళితుల భూములకు సంబంధించిన కేసులో బాపట్ల జిల్లా పర్చూరు కోర్టుకు ఆయన మంగళవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన విలేకర్లతో మాట్లాడారు. టిడిపి ప్రభుత్వ కాలంలో నీరు-చెట్టు కింద దేవరపల్లిలోని క్రిష్ణరాజుకుంటలోని దళితుల సాగు భూముల ను బలవంతంగా తవ్వారని చెప్పారు. దీనిని అడ్డుకున్న తమపై అప్పటి ప్రభుత్వం అక్రమంగా 8కేసులు బనాయించారని ఆరోపించారు. తమపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలని ప్రభుత్వాన్ని డిమాండు చేశారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి దిగజారిందని అన్నారు. నిత్యావసర సరుకుల ధరలు ఆకా శాన్ని అంటాయని అన్నా రు. సామాన్యులు బ్రతికే పరిస్థితి లేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెరిగిన ధరలను వెంటనే తగ్గించాలని కోరారు. ఈ ప్రభుత్వ విధానాలతో రైతులు నష్టపోతున్నారని అన్నారు. రైతులకు మద్దతు ధర ప్రకటించాలని అన్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. అక్రమ కేసులు ఎత్తివేసేందుకు వైసిపి ప్రభుత్వం గతంలో సానుకూలంగా స్పందించినట్లు సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పూనాటి ఆంజనేయులు గుర్తు చేశారు. కార్యక్రమంలో సిపిఎం నాయకులు వై వెంకటేశ్వరరావు, పెంట్యాల హనుమంతరావు, ఎం వసంతరావు, కంకణాల ఆంజనేయులు, పి కొండయ్య, ప్రజానాట్య మండలి రాష్ట్ర కార్యదర్శి ఎస్ అనిల్‌కుమార్, కెవిపిఎస్ నాయకులు బి రఘురాం, ఎన్ బాబురావు, ఎన్ వెంకట్రావు, ఎ బాలకోటయ్య, జయంతిబాబు, జి ప్రతాప్‌కుమార్ పాల్గొన్నారు.










