దేవనకొండ మండలంలో 'యువగళం'
- రైతులతో లోకేష్ ముఖాముఖి
- సమస్యలు విన్నవించిన పలువురు
ప్రజాశక్తి- దేవనకొండ
టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం యాత్ర సోమవారం ఆలూరు నియోజకవర్గం దేవనకొండ మండలంలో సాగింది. ఎంకే కొట్టాల నుండి గుండ్లకొండ, గుడిమిరాళ్ల, బుర్రకుంట, వెంకటాపురం గ్రామాల మీదుగా సాగింది. ఆయా గ్రామాల్లో నారా లోకేష్ యువగలం పాదయాత్రకు జననీరాజనం పట్టారు. టిడిపి నాయకులు నీలకంఠం, రాందాస్ గౌడ్ ఆధ్వర్యంలో క్రేన్ సాయంతో గజమాలను లోకేష్, కోట్ల సుజాతమ్మకు వేశారు. గుడిమిరాళ్ల గ్రామస్తులు హంద్రీనీవా ప్రధాన కాలువ ద్వారా పి కోటకొండ వరకు పిల్ల కాలువల నిర్మాణాలను చేపట్టి సాగు నీరు ఇవ్వాలని వినతి పత్రం రమణారెడ్డి ఆధ్వర్యంలో సమర్పించారు. సబ్సిడీ ద్వారా గొర్రెల పెంపక దారులకు గొర్రెల యూనిట్లు, మందులు పంపిణీ చేయాలని విజ్ఞప్తి చేశారు. అందుకు స్పందించిన నారా లోకేష్ టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వస్తే చేస్తామన్నారు. బుర్రకుంట సమీపంలో ఆలూరు నియోజకవర్గం పరిధిలోని రైతులతో ముఖాముఖి నిర్వహించారు. వివిధ మండలాల రైతులు రైతాంగ సమస్యలను విన్నవించారు. ఆస్పరి, దేవనకొండ ప్రాంతాల రైతులు అధిక విస్తీర్ణంలో టమోటా పంటను సాగు చేస్తారని జ్యూస్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తే రైతులకు గిట్టుబాటు ధర లభిస్తుందని విన్నవించారు. అందుకు స్పందించిన ఆయన జ్యూస్ ఫ్యాక్టరీ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు చేయడానికి తమ వంతు కృషి చేస్తామన్నారు. తెర్నేకల్ గ్రామ రైతు ఆంజనేయులు మాట్లాడుతూ ఉపాధి హామీ పథకం ద్వారా కూలీలకు చెల్లిస్తున్న వేతనాల్లో కోత విధించారని, హంద్రీనీవా పంట కాలువల అసంపూర్తిగా ఉన్నాయని తక్షణమే వాటిని పూర్తి చేయించాలన్నారు. పరిశ్రమలు ఏర్పాటు చేయకపోవడంతో నిరుద్యోగులకు ఉపాధి లేక అవస్థలు పడుతున్నారన్నారు. పొట్లపాడు రైతు లక్ష్మన్న మాట్లాడుతూ ఉల్లి పంటకు గిట్టుబాటు ధర గత రెండేళ్లుగా లేకపోవడంతో రైతుల తీవ్ర అవస్థలు పడుతున్నారని దీంతో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి నెలకొందన్నారు. కర్నూలు జిల్లాకు పరిశ్రమలు పెట్టడానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వ్యాపార వర్గాల నుండి తెప్పిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. ఉపాధి హామీ ద్వారా వ్యవసాయ రంగాన్ని అనుసంధానం చేసి పండ్ల తోటల పెంపకాన్ని రైతులతో చేపట్టి వారి అబివృద్ధికి కృషి చేస్తామన్నారు. రాష్ట్రంలో టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తక్షణమే జిల్లాలో పశ్చిమ ప్రాంతంలో పెండింగ్లో ఉన్న వేదవతి, నగర డోనా, హంద్రీనీవా, ఎల్‌ఎల్‌సి, ఆర్డీఎస్ సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి రైతులను ఆదుకుంటామన్నారు. కార్యక్రమంలో టిడిపి పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి, ఆలూరు, మంత్రాలయం, ఆత్మకూర్ టిడిపి ఇన్చార్జిలు కోట్ల సుజాతమ్మ, తిక్కా రెడ్డి, ఏరాసు ప్రతాపరెడ్డి, ఆలూరు టిడిపి మాజీ ఇంచార్జీలు వీరభద్ర గౌడ్, వైకుంఠ మల్లికార్జున చౌదరి, టిడిపి పారిశ్రామికవేత్త మాజీ ఇంచార్జ్ వైకుంఠం శివప్రసాద్ ఆయన భార్య జ్యోతి, మసాలా పద్మజ, ఆస్పరి మాజీ జెడ్పిటిసి కప్పట్రాళ్ల బోజ్జమ్మ,, మాజీ ఎంపీపీ రామచంద్ర నాయుడు, మండల టిడిపి కన్వీనర్ విజయభాస్కర్ గౌడ్, నాయకులు బడి గింజల రంగన్న, రామారావు నాయుడు, మల్లికార్జున గౌడ్, వెంకట స్వామి గౌడ్, రాజశేఖర్ గౌడ్, బండ్లయ్య, మాలిక్ బాషా, రాజా సాబ్, సర్పంచులు శేషి రెడ్డి, భాస్కర్, వెంకటేశ్వర్ రెడ్డి, పాల్గొన్నారు.










