Jul 27,2021 22:25

ప్రజాశక్తి - మైలవరం, కంచికచర్ల : మాజీ మంత్రి, టిడిపి సీనియర్‌ నేత దేవినేని ఉమామహేశ్వరరావుపై మంగళవారం రాళ్లదాడి జరిగింది. కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి అటవీ ప్రాంతంలో అక్రమమైనింగ్‌ చేస్తున్నారనే ఆరోపణలపై దేవినేని ఉమా పరిశీలనకు వెళ్లారు. తిరిగి వస్తుండగా జి.కొండూరు మండలం గడ్డమణుగ గ్రామం వద్ద కొందరు దుండగులు వాహనాన్ని చుట్టుముట్టి దాడికి దిగారు. రాళ్లదాడిలో కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. వైసిపి కార్యకర్తలే దాడికి పాల్పడ్డారని దేవినేని ఉమా ఆరోపించారు. కొండపల్లి రిజర్వ్‌ ఫారెస్ట్‌లో లక్షల టన్నుల గ్రావెల్‌ దోపిడీ జరిగిందన్నారు. నిర్వాసితుల పక్షాన మాట్లాడుతున్నానని తనపై కక్షగట్టారన్నారు. తన అంతు చూస్తామని బెదిరించారని తెలిపారు. ఘటనాస్థలం నుండి ఉమా నేరుగా జి.కొండూరు పోలీసుస్టేషన్‌కు చేరుకుని నిరసనకు దిగారు. పోలీసులు ఉద్దేశపూర్వకంగానే ఆలస్యంగా వచ్చారని, దాడికి పాల్పడిన, వారిని

దేవినేని ఉమాపై రాళ్లదాడి- జి.కొండూరు పోలీసుస్టేషన్‌ వద్ద ఉద్రిక్తత

ప్రోత్సహించిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదుపై కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని పట్టుబట్టారు. మరోవైపు స్థానిక వైసిపి ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాదు కూడా పోలీసుస్టేషన్‌కు బయలుదేరారు. టిడిపి, వైసిపి కార్యకర్తలు చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసులు ఇరువైపుల వారిని చెదరగొట్టారు.
ఉమాపై దాడిని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్రంగా ఖండించారు. మాజీమంత్రికే రక్షణ లేకపోతే ఎలా అని డిజిపికి లేఖ రాశారు. దాడి జరిగిందని సమాచారం చెప్పినా సరైన సమయంలో పోలీసులు అక్కడకు చేరుకోలేదని, దీనివెనుక ఉమాను హత్య చేయాలనే కుట్ర దాగుందని లేఖలో పేర్కొన్నారు. టిడిపి రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, పిఎసి ఛైర్మన్‌ పయ్యావుల కేశవ్‌ దాడిని తీవ్రంగా ఖండించారు.