
ప్రజాశక్తి - ఒంగోలు సబర్బన్ : విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్‌లో పనిచేస్తూ అనారోగ్యంతో మృతిచెందిన ఎపి మున్సిపల్ వర్కర్స్, ఎంప్లాయీస్ ఫెడరేషన్ (సిఐటియు) రాష్ట్ర నాయకులు ఎం. డేవిడ్ మరణం మున్సిపల్ ఉద్యమాలకు తీరనిలోటని పలువురు యూనియన్ నేతలు పేర్కొన్నారు. నగరంలోని ఒకటో పారిశుధ్య డివిజన్‌లో డేవిడ్ చిత్రపటానికి కార్మికులు, కార్మిక నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా కార్యదర్శి కొర్నెపాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ డేవిడ్ పోరాట స్ఫూర్తితో కార్మిక ఉద్యమాలను బలోపేతం చేయాలన్నారు. ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. మున్సిపల్ ఉద్యమాలలో డేవిడ్ చురుగ్గా పాల్గొనేవారని స్మరించుకున్నారు. నివాళులర్పించిన వారిలో సిఐటియు నగర కార్యదర్శి టి.మహేష్, నగర ఉపాధ్యక్షుడు తంబి శ్రీనివాసులు, మున్సిపల్ యూనియన్ నాయకులు టి. విజయ, అక్కేశ్వరరావు, దుర్గారావు, ఇట్లా మరియమ్మ, తిరుపతమ్మ తదితరులు పాల్గొన్నారు.