Oct 14,2023 00:13

- నాటకీయ పరిణామాల్లో సస్పెన్షన్‌
- జిల్లా దేవాదాయ శాఖ అధికారుల్లో కరువైన స్పందన
- అధికారులే ఈఒకు కొమ్ము కాస్తున్నారనే అనుమానాలు
ప్రజాశక్తి - బాపట్ల
అనేక అవినీతి ఆరోపణలపై మండలంలోని అప్పికట్లలో దేవాదాయ శాఖ ఈఒగా వ్యవహరిస్తున్న వీరారెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. 15రోజుల క్రితం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా గ్రామస్తుల నుండి విరాళాలు సేకరించి వాటి వినియోగంలో ఇస్టారీతిగా వ్యవహరించాడనే ఆరోపణల నేపథ్యంలో అప్పికట్ల గ్రూపు దేవాలయాల విఒ వీరారెడ్డిని సస్పెండ్ చేస్తూ దేవదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. రెండు వారాలు గడిచినప్పటికీ ఇంకా విధుల్లో కొనసాగడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. దేవాదాయ శాఖలో జిల్లా స్థాయి అధికారులకు తెలియకుండా ఈ తంతు జరుగుతుందా అని విమర్శలు వస్తున్నాయి. ఉన్నతాధికారుల అనుమతి లేకుండా అప్పికట్ల వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం కోసం స్థానికులతో కలిసి ఈఒ వీరారెడ్డి రూ.కోటికిపైగా విరాళాలు వసూలు చేశాడని చెబుతున్నారు. 12అంశాలకు సంబంధించి అవకతవకలకు పాల్పడ్డాడని దేవాదాయ కమిషనర్ ముఖ్య కార్యదర్శి, సిఎంకు స్థానికులు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ జరిపిన దేవాదాయ శాఖ డీసీ చంద్రశేఖరరెడ్డి ఈఓపై వచ్చిన ఆరోపణలు నిర్ధారిస్తూ ఈఓ వీరారెడ్డిని సస్పెండ్ చేస్తూ గత నెల 27న ఉత్తర్వులు ఇచ్చారు. అయినప్పటికీ గ్రూప్ దేవాలయాల ఈఒగా వీరారెడ్డి కొనసాగడంపై  విస్మయానికి గురిచేస్తోంది. ఆయన పర్యవేక్షణలో ఉన్న కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయానికి 45ఎకరాలు భూములు ఉన్నా భక్తులకు కనీసం సౌకర్యాలు కల్పించడం లేదని గ్రామస్తుల ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం వలివేరు, ఇంటూరు, వెదుళ్ళపల్లి గ్రూపు దేవాలయాల ఈఓగా పనిచేస్తున్నారు. వీరారెడ్డి సస్పెండ్ కావడంతో ఈ నాలుగు గ్రూపు ఆలయాల బాధ్యతలను దేవదాయ శాఖ ఇన్ స్పెక్టర్ శ్యామలకు అప్పగించాలని కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.
అయితే బాపట్ల దేవాదాయ శాఖ ఇన్ స్పెక్టర్ శ్యామలకు సస్పెండ్ అయిన ఈఒ  బాధ్యతలను బాపట్ల తూర్పు సత్రంలోని ఇన్ స్పె క్టర్ కార్యాలయానికి వచ్చి అప్పగించాలని, గ్రూప్ ఆలయాల దస్తావేజులు అందజేయాలని సస్పెండైన వీరారెడ్డిని ఆదేశించినప్పటికీ ఉత్తరులను బేఖాతరు చేసి బాధ్యతలను అప్పగించలేదు. దస్త్రాలు అందజేయలేదు. దీంతో అతనిపై శాఖా పరమైన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను కోరినట్లు  తెలిసింది. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల అండలతోపాటు ఉన్నతాధికారులు కొమ్ము కాయడంతో దేవాదాయ కమిషనర్ ఆదేశాలనుసైతం ఈఒ వీరారెడ్డి అడ్డుకున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి. సస్పెన్షన్ అమలు కాకుండా విధుల్లో ఉండటం ఏమిటని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. అయితే బాపట్ల జిల్లా దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ దీనిపై స్పందించకపోవడం సర్వత్ర విమర్శలకు దారితీస్తోంది.