ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్ పేదలు వేసుకున్న గుడిసెలను రియల్ ఎస్టేట్ వ్యాపారులతో చేతులు కలిపి తొలగింప జేసి పేదలను రోడ్ల పాలు చేసిన అనంతపురం జిల్లా దేవాదాయ శాక సహాయ కమిషనర్ ఆదిశేషునాయుడుపై చర్యలు తీసుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వి.రాంభూపాల్, జిల్లా నాయకులు తరిమెల నాగరాజులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం విజవాడలోని దేవాదయ శాఖ రాష్ట్ర కమిషనర్ సత్యనారాయణను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గార్లదిన్నె మండలం, కల్లూరు గ్రామంలో దేవాదాయ భూముల్లో పేదలు గుడిసెలు ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు.ఆ భూమిని కబ్జా చేయాలని రియల్ ఎస్టేట్ వ్యాపారులు కుట్రలు చేస్తున్నారని, ఇది వరకే 1.30 ఎకరాల భూమిని ప్లాట్లు వేసి విక్రయించారని తెలిపారు. పేదలు వేసుకున్న స్థలంలోనే కొందరు అధికార బలం ఉన్న వారు 8 సెంట్ల స్థలంలో ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్నారని తెలిపారు. వారందరికి దేవాదాయ చట్టం అమలు చేయకుండా పేదల గుడిసెలపై ఒక్కటే సహాయ కమిషనర్ ఆదిశేషునాయుడు అమలు చేసి పేదలను రోడ్లు పాలు చేశారని వివరించారు. గ్రామంలో 57 ఎకరాల 36 సెంట్ల దేవాదాయ భూమి కొందరు ఆక్రమించుకుని ప్లాట్ల వ్యాపారం చేస్తున్న స్పందించని సహాయ కమిషనర్ పేదలు వేసుకున్న 150 గుడిసెలకు నోటీసులు ఇవ్వకుండా, హై కోర్టు ఆదేశాల్ని ఖాతర్ చేయకుండా కూల్చి వేయడం వెనక కోట్ల రూపాయల లావాదేవీలు ఉన్నాయని ఆరోపించారు. 165 సర్వే నెంబర్లు మూడు ఎకరాల 43 సెంట్లు స్థలం ఉండగా అందులో ఎకరా 43 సెంట్లు ఒక ప్రైవేటు వ్యక్తి ప్లాట్లు వేసి ఇళ్ల నిర్మాణం చేస్తున్నప్పటికీ వాటిని ఆపకుండా కేవలం రెండు ఎకరాల్లోని పేదలను మాత్రమే ఖాళీ చేయించడం పై విచారణ జరిపించాలని కోరారు. ఏసి అవినీతిని ప్రశ్నిస్తామనే భయంతో పది రోజులుగా ఆఫీసుకు రాకుండా తప్పించుకుంటున్నారని తెలిపారు. అధికార పార్టీకి సంబంధించిన కొద్దిమంది నేతలతో ఈయనకు ఉన్న వ్యక్తిగత లావాదేవీలే ఈ కూల్చివేతకు ప్రధాన కారణాలని తెలిపారు. మొత్తం దేవుని మన్యం భూములు ఏ రకంగా ఆక్రమణ గురవుతున్నాయో సర్వే నెంబర్ల వారిగా రాష్ట్ర కమిషనర్ వివరించారు. కమిషనర్ స్పందించి అసిస్టెంట్ కమిషనర్‌కు ఫోన్ చేసి పేదల గుడిసెలు మాత్రమే తొలగించి పెద్దలను ఎందుకు మినహాయించారని, వారికి నోటీసులు ఇచ్చినప్పుడు పేదలకు కూడా నోటీసులు ఇవ్వాలి కదా అని నిలదీశారు. నివాసాలు కోల్పోయి వీధుల్లో పడిన పేదలకు జిల్లా అధికారులతో మాట్లాడి తగు న్యాయం చేస్తానని కమీషనర్ సత్యనారాయణ హామీ ఇచ్చినట్లు సిపిఎం నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం గార్లదిన్నె మండల కార్యదర్శి చెన్నారెడ్డి, నాయకులు శంకర్, రవి, కల్లూరు నిరాశ్రయులు పాల్గొన్నారు.