ప్రజాశక్తి - పర్చూరు
నియోజకవర్గంలో ఆక్రమణలకు గురైన 1774ఎకరాల దేవాదాయ భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంటామని దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ పానకాలరావు చెప్పారు. రైతులకు నోటీసులు జారీ చేసి వారం రోజుల్లో స్వాధీనం చేసుకొనున్నట్లు తెలిపారు. స్థానిక దేవాదాయ శాఖ కార్యాలయంలో ఆయన విలేఖరులతో శుక్రవారం మాట్లాడారు. నియోజకవర్గంలో 8196 ఎకరాల మాన్యం భూమి ఉందని అన్నారు. దానితో పాటు ఆక్రమణకు గురైన భూమిని స్వాధీనం చేసుకొని మొత్తం భూమికి వేలం పాట నిర్వహిస్తామని తెలిపారు. తమ రికార్డుల్లో నమోదుకాని మాన్యం భూమి గురించి సమాచారాన్ని తమకు ఇవ్వాల్సిందిగా ఆయన ప్రజలను కోరారు. దయచేసి రైతులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఎండోమెంట్ కార్యదర్శులు ఎం శ్రీనివాసరావు, పి శ్రీనివాసరావు, ఎం నాగయ్య, కోటిరెడ్డి, రవికుమార్ పాల్గొన్నారు.