Dec 14,2022 21:28

ఎక్సాఫ్లూయిన్స్‌ సంస్థ సీఈఓ రవికిరణ్‌ వెల్లడి

డేటాసైన్స్‌తోనే భావి యువతకు భవిష్యత్‌


ప్రజాశక్తి-తిరుపతి(మంగళం)/ తిరుపతి సిటి
మారుతున్న కాలానుగుణంగా సాఫ్ట్వేర్‌ సేవలను విస్తరించడానికి తనదైన శైలిలో దూసుకెళ్తున్న ఎక్సా ఫ్లూయిన్స్‌ సాఫ్ట్వేర్‌ సంస్థ నూతన ఆలోచనలతో యువతకు డేటా సైన్స్‌ రంగంలో మంచి ఉపాధి అవకాశాలు పొందేలా శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు డేటా సైన్స్‌ లో ఎంఎస్‌, పిజి డిప్లోమా కోర్సులను ప్రవేశపెడుతోందని ఎక్సా ఫ్లూయిన్స్‌ సంస్థ వ్యవస్థాపకులు, సీఈవో రవికిరణ్‌ తెలిపారు. బుధవారం తిరుపతి-కరకంబాడి మార్గంలోని ఉపాధ్యాయ నగర్‌ లో గల ఎక్సా ఫ్లూయిన్స్‌ సంస్థ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ప్రవాసి భారతీయ సమ్మాన్‌ అవార్డు గ్రహీత డాక్టర్‌ కిరణ్‌ సి.పటేల్‌ ముఖ్య అతిధిగా, ఎస్వీయూ విసి రాజారెడ్డి సమక్షంలో నూతన కోర్సులను ప్రారంభించనున్నామన్నారు. ఈ కోర్సు ద్వారా విద్యార్థులు డేటా ఎనలిస్టులుగా బ్యాంకింగ్‌ రంగంలో, పరిశ్రమల రంగాల్లో రాణించడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. రెండేళ్ల కాల పరిమితితో ఉండే ఈ కోర్సులు ద్వారా సాఫ్ట్వేర్‌ సేవలను ఇతర రంగాలకు అందించడానికి ఉపయుక్తమవుతుందని, ఆదిశగా నైపుణ్యతను పెంపొందించుకున్న అభ్యర్థులకు ఎక్సా ఫ్లూయిన్స్‌ సంస్థలొనే ఉపాధి అవకాశాలను ఇవ్వనున్నామన్నారు. ప్రపంచవ్యాప్తంగా తమ ఎక్సా ఫ్లూయిన్స్‌ సంస్థ ద్వారా సాఫ్ట్వేర్‌ సేవలతో పాటుగా హెల్త్‌ కేర్‌, భీమా, బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌, సైబర్‌ సెక్యురిటీ, ఇండిస్టీ 4.0, ఐఓటి, సప్లై చైన్‌ ఇలా అనేక సేవలను అందిస్తున్నామన్నారు. ఈ నూతన కోర్సుల నిర్వహణ, మూల్యాంకనం మొత్తం వర్సిటీ వారి పర్యవేక్షణలోనే జరుగుతుందని రూసా సీఈవో వంశీకష్ణ రాయల్‌ తెలిపారు. ఈ కోర్సుల్లో బోధన ఆన్‌ లైన్‌, ఆఫ్‌ లైన్‌ లో జరుగుతుందని, ఆఫ్‌ లైన్‌ క్లాసులకు 30 పరిమితితో ఉంటుందని, ఆన్లైన్‌ క్లాసులకు అభ్యర్థులను బట్టి నిర్ణయాలు తీసుకుంటామన్నారు. డేటా సైన్స్‌ రంగంలో రాణించాలనుకునేవారు ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఎక్సా ఫ్లూయిన్స్‌ చీఫ్‌ ఆపరేషన్‌ ఆఫీసర్‌ టీఎన్‌ శ్రీనివాస్‌, సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.