May 04,2023 00:34

రాజేష్‌ అదానీ, కరణ్‌ అదానీలతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి

ప్రజాశక్తి- గ్రేటర్‌ విశాఖ బ్యూరో : విశాఖపట్నం డేటా కేంద్రం దేశానికి తలమానికం కానుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి వెల్లడించారు. మధురవాడలోని హిల్‌ నంబర్‌ 4లో 190 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్‌ డేటా సెంటర్‌, టెక్నాలజీ బిజినెస్‌ పార్క్‌, అదానీ ఎంటర్‌ ప్రైజస్‌ లిమిటెడ్‌ చైర్మన్‌ రాజేష్‌ అదానీ, కరణ్‌ అదానీలతో కలిసి ముఖ్యమంత్రి బుధవారం శంకుస్థాపన చేశారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విశాఖపట్నంలో 300 మెగా వాట్ల ఇంటిగ్రేటెడ్‌ డేటా సెంటర్‌, టెక్నాలజీ బిజినెస్‌ పార్క్‌ శంకుస్థాపన చేయడం గొప్ప శుభపరిణామమన్నారు. సింగపూర్‌ నుంచి సబ్‌ మెరైన్‌ కేబుల్‌ను విశాఖపట్నం తీసుకువచ్చే కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. సబ్‌ మెరైన్‌ కేబుల్‌ రావడం డేటా సెంటర్‌ను విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం వల్ల ఇంటర్నెట్‌ డౌన్‌లోడ్‌ స్పీడ్‌ చాలా వేగాన్ని అందుకోవడం డౌన్‌ లోడ్‌ అవడం ఇక్కడ ఉన్న పరిశ్రమలకు మరియు ప్రజలకు గొప్ప వరం అవుతుందని వివరించారు. అదానీ గ్రూపు ఈ ప్రాంతంలో రూ.22 వేల కోట్ల పెట్టుబడి పెట్టి ఐటి అభివృద్ధికి గట్టిగా ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రులు బూడి ముత్యాలనాయుడు, బొత్స సత్యనారాయణ, విడదల రజని, గుడివాడ అమర్‌నాథ్‌, టిటిడి చైర్మన్‌ వైవి.సుబ్బారెడ్డి, మేయర్‌ గొలగాని హరి వెంకట కుమారి, జెడ్‌పి చైర్‌పర్సన్‌ జె.సుభద్ర, విశాఖ ఎంపీ ఎంవివి.సత్యనారాయణ, ఐటి పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికల్‌ వలవన్‌, ఐటి శాఖ కార్యదర్శి కోన శశిధర్‌, ఐటి, పరిశ్రమల శాఖ కమిషనర్‌ ప్రవీణ్‌ కుమార్‌, జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.మల్లికార్జున, జివిఎంసి కమిషనర్‌ సాయికాంత్‌ వర్మ తదితరులు పాల్గొన్నారు.