Sep 22,2023 22:49

సమావేశంలో మాట్లాడుతున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు

ప్రజాశక్తి - మంగళగిరి : రాష్ట్రానికి బిజెపి తీవ్రమైన నష్టం చేసిందని, ఆ పార్టీని దేశవ్యాప్తంగా ఓడించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అనానరు. స్థానిక రత్నాల చెరువులోని సింహాద్రి శివారెడ్డి భవనంలో సిపిఎం మంగళగిరి నియోజకవర్గం విస్తృత సమావేశం సీనియర్‌ నాయకులు జెవి రాఘవులు అధ్యక్షతన జరిగింది. శ్రీనివాసరావు మాట్లాడుతూ బిజెపికి రాష్ట్రంలోని అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి అంటకాగుతున్నాయని, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఏ విధానాలను తెచ్చినా వైసిపి, టిడిపి మద్దతిస్తున్నాయని విమర్శించారు. ఈ రెండు పార్టీలూ బిజెపికి భయపడుతున్నాయని, ఆ పార్టీని ఎదిరించడానికి ముందుకే రావడం లేదని ఎద్దేవ చేశారు. కార్పొరేట్‌ ప్రయోజనాల కోసమే జమిలి ఎన్నికలన్నారు. ప్రజాస్వామ్యం ఉండదని, నియంతృత్వం పెరుగుతుందని ఆందోళన వెలిబుచ్చారు. కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం అన్ని అవకాశాలను మతంతో ముడిపెడుతోందని, చంద్రయాన్‌-3కి కూడా మతం రంగు పులిమారని విమర్శించారు. బిజెపి విధానాలకు దేశవ్యాప్తంగా ప్రజా వ్యతిరేకత పెరగడంతో తొమ్మిదేళ్ల తర్వాత ఎన్‌డిఎ సమావేశం నిర్వహిం చారని గుర్తు చేశారు. రాష్ట్రంలో విద్యుత్‌ చార్జీలు పెరుగుతున్నాయని, ఎస్సీ, ఎస్టీలకు ఇవ్వాల్సిన రాయితీలను రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదని అన్నారు. మంగళగిరి నియోజకవర్గం కమ్యూనిస్టుల కోటని, గతంలో ఇక్కడ నుండి నాలుగుసార్లు కమ్యూనిస్టులు విజయం సాధించారని గుర్తు చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ సిపిఎం కేంద్రీకరించి పనిచేస్తుందన్నారు.
సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్‌.బాబూరావు మట్లాడుతూ రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో దేశంలో బిజెపి ఓడిపోతుందనే భయం ప్రధాని మోడీకి పట్టుకుందని, ప్రతిపక్ష పార్టీలతో ఏర్పాటైన 'ఇండియా' వేదికను చూసి మోడీ భయపడుతున్నారని విమర్శించారు. మణిపూర్‌లో మహిళలను నానా హింసలు పెట్టిన బిజెపి ఇప్పుడు మహిళా ఓటర్లను ఆకట్టుకోవడానికి మహిళా రిజర్వేషన్‌ బిల్లును తెచ్చిందని, పైగా ఇది 2029లో అమలవుతుందని చెప్పడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. పాకిస్తాన్‌తో యుద్ధం అనో, మతాల పేరుతో చిచ్చుపెట్టో ఎన్నికల్లో లబ్ధిపొందడానికి బిజెపి యత్నిస్తోందని, దానికి రాష్ట్రంలోని అధికార ప్రతిపక్షాలు వంత పాడుతున్నాయని మండిపడ్డారు. సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు మాట్లాడుతూ మంగళగిరి నియోజకవర్గంలో మొట్టమొదటి నుండీ కమ్యూనిస్టులు ప్రభావం ఎక్కువగా ఉందన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కారానికి ప్రజా ఉద్యమాలను ఉధతం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సమావేశంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు వై.నేతాజీ, ఇ.అప్పారావు, ఎం.రవి, ఎస్‌ఎస్‌.చెంగయ్య, సీనియర్‌ నాయకులు జొన్న శివశంకరరావు పాల్గొన్నారు.
3వ తేదీ నుండి నియోజకవర్గంలో పాదయాత్ర
ఇదిలా ఉండగా మంగళగిరి నియోజకవర్గంలో సిపిఎం ఆధ్వర్యంలో ప్రజా చైతన్య పాదయాత్ర అక్టోబర్‌ 3వ తేదీ నుండి ప్రారంభించాలని సమావేశంలో నిర్ణయించారు. యాత్ర తొలిరోజు ఉండవల్లి సెంటర్లో ప్రారంభమవుతుంది. అక్కడనుండి పెనుమాక, ఎర్రబాలెం, కృష్ణ నగర్‌, 4న ముగ్గురోడ్డు, కృష్ణుడి గుడి రోడ్డు, బోసు బొమ్మ సెంటర్‌, కెఎల్‌ రావు కాలనీ, సీతానగరం, మహానాడు, సుందరయ్య నగర్‌, 5న క్రిస్టియన్‌ పేట, అమరా రెడ్డి కాలనీ, మదర్‌ థెరిస్సా కాలనీ, కుంచనపల్లి, ప్రాతూరు, గుండె మెడ గ్రామాల్లో పర్యటిస్తుంది. 6న చిర్రావూరు, నూతక్కి, మెల్లెంపూడి, వడ్డేశ్వరం, కొలనుకొండ, 7న ఇప్పటం, ఆత్మకూరు, పెదవడ్లపూడి, రేవేంద్రపాడు, శృంగారపురం, పెదపాలెం, చిన్నపాలెం, 8న పేరకలపూడి, ఈమని, దుగ్గిరాల, మంచికలపూడి, 9వ తేదీన తుమ్మపూడి, చిలువూరు, కాజా, చిన్న కాకాని, రత్నాల చెరువు ప్రాంతాల్లో పర్యటిస్తుంది. 10న పాత మంగళగిరి, మెయిన్‌ రోడ్‌, పార్టీ ఆఫీసు, 11వ తేదీన కొండ ప్రాంతం, మూడో వార్డు, నవులూరు, 12వ తేదీన బేతపూడి, కురగల్లు, నిడమర్రులో ముగింపు సభ జరుగుతుంది. అక్టోబర్‌ 16వ తేదీన మంగళగిరి కార్పొరేషన్‌ ఆలయం వద్ద ప్రజా సమస్యల పరిష్కారానికి ధర్నా నిర్వహిస్తారు.పాదయాత్రలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి బృందం దృష్టికి తీసుకురావాలని సమావేశం పేర్కొంది.