ప్రజాశక్తి - అద్దంకి
దేశ ప్రజలకు ఇచ్చిన ఒక్కహామీ కూడా నెరవేర్చకుండా దేశాన్ని అప్పులు పాలుజేసిన ఏకైక ప్రధాని నరేంద్ర మోడీ అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ అన్నారు. రాష్ట్రాన్ని కాపాడండి - దేశాన్ని రక్షించండి అనే నినాదంతో సిపిఐ చేపట్టిన బస్సుయాత్ర సోమవారం అద్దంకి వచ్చింది. స్థానిక పాతబస్టాండ్ కూడలిలో సిపిఐ జిల్లా కార్యదర్శి సింగరకొండ అధ్యక్షతన జరిగిన సభలో రామకృష్ణ మాట్లాడుతూ రాష్ట్రం, దేశం బాగుండాలంటే ప్రజలు చైతన్య వంతంగా ఉండాలని అన్నారు. తద్వారా అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రజల మధ్య మతాలు, కులాల చిచ్చుపెట్టి విద్వేషాలను రెచ్చగొట్టి తమ వైపల్యాలను, వ్యతిరేకత నుండి ప్రజలద్రుష్టి మల్లించి రాజకీయ లబ్ది కోసం కుట్రలు చేస్తుందని ఆరోపించారు. అభివృద్ధిలో కీలకమైన ప్రభుత్వరంగంలోని విశాఖ ఉక్కును మోడీ మిత్రులైన అదాని, అంబానీలకు కారు చౌకగా కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తుందని అన్నారు. ఉత్తరాంధ్రలో ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి కాకపోవడంతో ప్రజలు తీవ్ర ఆందోళనలో ఉన్నారని అన్నారు. రాష్ట్ర ప్రజల జీవనాడి పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నిధులు ఇవ్వడంలేదన్నారు. ఎత్తు తగ్గించి రాష్ట్రానికి తీవ్ర ద్రోహం చేస్తుందన్నారు. అయినప్పటికీ అత్యధిక మంది ఎంపీలు, 151మంది ఎమ్మెల్యేలున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రశ్నించ లేకపోవడం దుర్మార్గం అన్నారు. గ్రామాల్లో రైతులు, కౌలు రైతులు వ్యవసాయానికి దూరమవుతున్నారని అన్నారు. పిల్లల్ని చదివించుకున్నా ఉద్యోగం లభించడం లేదని అన్నారు. ఉపాధి లేక వ్యవసాయం గిట్టుబాటు కాక ఆత్మహత్యలకు పాల్పడుతున్న రైతులను ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెలుగొండ ప్రాజెక్టు సకాలంలో పూర్తి చేయకపోవడంతో వాయిదాల ప్రాజెక్టుగా మారిందని అన్నారు. కేంద్ర విధానాలను పాటిస్తూ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని అన్నారు. ఖజానా ఖాళీ చేసి ఉద్యోగుల జీతాలకు సైతం నెలనెలా అప్పులు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న ప్రధాని గడిచిన తొమ్మిదేళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే 2022నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్న మోడీ వ్యవసాయాన్ని నష్టాల్లోకి నెట్టారని అన్నారు. బ్లాక్ మనీ తీసుకొస్తామని చెప్పి నోట్లు రద్దు చేసిన మోడీ ఒక్క రూపాయి కూడా బయటికి తీయలేకపోయారని విమర్శించారు. 77ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో కేంద్ర ప్రభుత్వం రూ.125లక్షల కోట్లు అప్పు చేస్తే అందులో గడిచిన తొమ్మిది ఏళ్లలో మోడీ రూ.100లక్షల కోట్లు అప్పు చేశారన్నారు. ప్రభుత్వ సంస్థలను అంబానీలకు దోచిపెడుతున్నారని అన్నారు. అంబానీల ఆస్తులు వందల రెట్లు పెంచుతూ నిత్యం శ్రమించే రైతులు, కార్మికులు, వ్యవసాయ కూలీలు, ఉద్యోగులు, వ్యాపారులను నష్టాల ఊబిలో నెట్టారని అన్నారు. ఈ ప్రభుత్వాలకు బుద్దిచెబితేనే రాష్ట్రం, దేశం బాగుంటుందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్, కెఎల్డి ప్రసాద్, ప్రజానాట్య మండలి కళాకారులు పాల్గొన్నారు. బస్సు యాత్ర ప్రారంభానికి ముందు భవాని సెంటర్ నుండి మోటార్ బైక్ ర్యాలీ నిర్వహించారు.










