ప్రజాశక్తి-బాపట్ల: రాష్ట్రంలోనే కాక దేశవ్యాప్తంగా బాపట్ల జిల్లాకు ఒక ప్రత్యేక స్థానం ఉందని బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి అన్నారు. మంగళవారం బాపట్ల రైస్ మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో ఫోరం ఫర్ బెటర్ బాపట్ల, సెర్చ్ సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన బాపట్ల ఆవిర్భావ తొలి వసంతోత్సవ వేడుకలకు రఘుపతి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కోన మాట్లాడుతూ చారిత్రకంగా బాపట్లకు ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. పద్యం పుట్టిన గడ్డగా, భారతాన్ని గట్టెక్కించిన సీమగా బాపట్ల కీర్తి అజరామరమైందన్నారు. బౌద్ధానికి ఆయువు పట్టుగా, ఎఱ్ఱాప్రగడ, శ్రీనాథుడు వంటి మహౌన్నతులు నడయాడిన నేలగా బాపట్ల జిల్లా ప్రసిద్ధిగాంచింది. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ బాపట్ల కొత్త జిల్లా అయినప్పటికీ సౌకర్యాల కల్పనలో మేటిగా నిలిచిందని చెప్పారు. ఎన్నో బాలరిష్టాలను అధిగమించి సంవత్సర కాలంలోనే పూర్తి స్థాయి జిల్లా గా ఎదిగిందన్నారు. సభకు బాపట్ల ఆర్స్ట్ అండ్ సన్స్ కళాశాల విశ్రాంత ప్రిన్సిపల్ డబ్ల్యూజికే మూర్తి అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో ఫోరం కార్యదర్శి పిసి సాయిబాబు, జిల్లా రైస్ మిల్లర్స్ అధ్యక్షులు అసోసియేషన్ అధ్యక్షులు బివి రత్నగుప్తా, సెర్చ్ సంస్థ కార్యదర్శి సిహెచ్ పార్థసారథి, బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ అధ్యక్షులు ముప్పలనేని శ్రీనివాసరావు, వైసిపి నాయకులు సిహెచ్ నారాయణరెడ్డి, శిరీష, కె శివరాం ప్రసాద్, జ్యోతి, చంద్రమౌళి, నందిరాజు విజరు కుమార్ పాల్గొన్నారు.
బాపట్ల సర్వతోముఖాభివృద్ధికి విశేష కృషి
బాపట్ల జిల్లాగా రూపుదిద్దుకున్న ఏడాదిలోనే బాపట్ల సర్వతో ముఖాభివృద్ధికి ఎంతో కృషి చేశామమని బాపట్ల శాసనసభ్యులు కోన రఘుపతి అన్నారు. బాపట్ల పట్టణంలో ఫైర్ స్టేషన్ నుంచి తహశీల్దారు కార్యాలయం వరకు రూ.కోటి 32 లక్షల 80 వేలతో నూతనంగా నిర్మించిన సిమెంటు రోడ్డును మంగళవారం కోన అధికారులు వైసిపి నాయకులతో కలిసి కోన రఘుపతి ప్రారంభించారు. పట్టణంలో ఈ అంతర్గత రహదారికి చీరాల-పేరాల ఉద్యమ నాయకులు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య మార్గ్‌గా నామకరణం చేశారు. ఈ సందర్భంగా రఘుపతి మాట్లాడుతూ బాపట్ల జిల్లా ఆవిర్భావ వసంత తొలి వసంతోత్సవం సందర్భంగా కోన రఘుపతి మాట్లాడుతూ పట్టణంలో ఉప్పరపాలెం, అక్బర్ పేట వైపు నుంచి తహశీల్దారు కార్యాలయం, పోలీస్ స్టేషన్, సబ్ రిజిస్టర్ కార్యాలయాలకు వచ్చే ప్రజలకు ఈ రహదారితో ఎంతో ప్రయోజనం కలుగుతుంద న్నారు. ఇదేగాక పట్టణంలో పట్టణాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది ప్రజలకు ట్రాఫిక్ సమస్య నియంత్రించేందుకు అన్ని రహదారుల విస్తరణకు కోట్లాది రూపాయలు వెచ్చించామన్నారు. ప్రధానంగా బాపట్ల రైల్వే స్టేషన్ రోడ్డు, శివాలయం, కాలేజీ రోడ్డు, బాపట్ల ఇంజనీరింగ్ కళాశాల నుండి మార్కెట్ కమిటీ యార్డ్ వరకు జాతీయ రహదారిని సైతం విస్తరణ చేశామన్నారు. రహదారుల విస్తరణ బాపట్లలో కోన మార్కుగా నిలుస్తుంద నడంలో సందేహం లేదన్నారు. కార్యక్రమంలో తహశీల్దారు కవిత, మునిసిపల్ కమిషనర్ భాను ప్రతాప్, మున్సిపల్ డిఈ శ్రీనివాసులు, డిఎస్‌పి శ్రీనివాసరావు, పట్టణ సీఐ కృష్ణయ్య, రూరల్ ఎస్‌ఐ వెంకటప్రసాద్, వైసిపి నాయకులు సయ్యద్ పీర్, చేజర్ల నారాయణరెడ్డి, మాల్యాద్రి, బుల్లెట్ బుల్లిరెడ్డి, జోగి రాజా వైసిపి నాయకులు పాల్గొన్నారు.










