Aug 05,2021 19:43

ఇస్లామాబాద్‌ : వ్యాక్సిన్‌ వేయించుకోకపోతే షెల్‌ఫోన్‌లను బ్లాక్‌ చేస్తామంటూ పాక్‌ ప్రభుత్వం హెచ్చరించింది. ఆఫీసులు, రెస్టారెంట్లు, షాపింగ్‌మాల్స్‌లోకి అనుమతించకపోవడంతో పాటు భారీగా జరిమానాలు విధిస్తామంటూ ప్రకటించింది. దీంతో రోజుకి సుమారు పదివేల మంది వ్యాక్సినేషన్‌ కోసం వస్తున్నారంటూ అక్కడి అధికారులు ప్రకటించారు. పలు ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర క్యూలైన్లలో వేచి చూస్తున్నారని తెలిపారు. ప్రపంచంలోనే పోలియో కేసులు నమోదవుతున్న దేశాల్లో పాకిస్తాన్‌, ఆప్ఘనిస్తాన్‌లు ఉన్నాయి. మరోవైపు కరోనా కూడా వ్యాప్తి చెందుతుండటంతో వ్యాక్సినేషన్‌ ప్రక్రియను అక్కడి ప్రభుత్వం వేగవంతం చేసింది. 220 మిలియన్‌ జనభాలో కేవలం 6.7 మిలియన్‌ మంది మాత్రమే వ్యాక్సిన్‌ రెండు డోసులను తీసుకున్నట్లు నేషనల్‌ కమాండ్‌ అండ్‌ ఆపరేషన్స్‌ సెంటర్‌ (ఎన్‌సిఒసి) తెలిపింది. గత నెల చివరలో వ్యాక్సిన్‌ సర్టిఫికేట్‌ లేకపోతే ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, రెస్టారెంట్లు, రవాణా, షాపింగ్‌మాల్స్‌లోకి అనుమతించమని, విమాన ప్రయాణాలపై కూడా నిషేధం విధిస్తున్నట్లు పాక్‌ ప్రభుత్వం ప్రకటించింది. ప్రకటన వెలువడిన వారం రోజుల వ్యవధిలోనే వ్యాక్సినేషన్‌ రేటు గణనీయంగా పెరిగిందని, గతవారంలో రోజుకి పది లక్షల మంది వ్యాక్సిన్‌లు పొందారని తెలిపింది. పాకిస్తాన్‌లో డెల్టా వేరియంట్‌ విజృంభిస్తోంది. పాకిస్తాన్‌లో గడిచిన 24 గంటల్లో 5,561 కేసులు నమోదు కాగా, గడిచిన మూడు నెలల్లో ఒక్కరోజులో అత్యధిక కేసులు నమోదైనట్లు తెలిపింది. మరోవైపు 60 మంది కరోనా తో మరణించారు. కొత్త కేసులలో 70 శాతం డెల్టా వేరియంట్‌వి కాగా, 4వేల మంది పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు. డెల్టా వేరియంట్‌ వ్యాప్తి అధికం కావడంతో.. పాక్‌ ఆరోగ్య మౌలిక సదుపాయాలపై అధిక ఒత్తిడి పెరిగిందని అన్నారు.