Oct 28,2023 21:00

పబ్లిక్‌టాక్‌.

ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి : 'దేశమంటే మట్టి కాదోయి.. దేశమంటే మనుజులోరు' అన్నాడు మహాకవి గురజాడ. కానీ, దేశమంటే మనుషులు కాదోరు, దేశమంటే మట్టోరు.. అంటోంది కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం. నాదేశం - నామట్టి అంటూ ఇటీవల చేపట్టిన కార్యక్రమం ఇందుకు తార్కాణం. మట్టికి ప్రణామాలు.. వీరులకు వందనాలు.. అనే నినాదంతో కేంద్రం తలపెట్టిన 'నా మట్టి - నా దేశం' కార్యక్రమాన్ని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ రెండు రోజుల క్రితం ప్రారంభించారు. ఇందులో భాగంగా బయలుదేరిన బస్సులో 33 మండలాలకు చెందిన యువకులు మట్టి కలశాలను ఢిల్లీకి తీసుకెళ్లడం పట్ల అభినందించారు. ఈ కార్యక్రమాన్ని, సందర్భాన్ని చూసిన జిల్లా వాసులు నివ్వెరబోతున్నారు. దేశం ఎటుపోతోందో? అంటూ కొందరు, పాలకులు ఎటువైపు తీసుకెళ్తున్నారో.. అంటూ మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు. మహాకవి గురజాడ చెప్పినట్టు దేశం అంటే మట్టికాదు.. దేశమంటే ముమ్మాటికీ మనుషులే. ఇది ఎంతో దూరదృష్టితో చెప్పిన మాట. దేశమంటే మట్టి అనుకుంటే మానవాళికి ఉన్న విలువ, మనుగడ ప్రశ్నార్థకమౌతుంది. కాబట్టి ఆ మానవాళి మనుగడ కోసం మట్టిని ఉపయోగించాలి తప్ప, మట్టినే దేశం అనుకుంటే సమాజ గమనానికి, పురోగతికి ముప్పువాటిల్లినట్టే. కానీ, నాదేశం - నామట్టి అనే కార్యక్రమం ద్వారా దేశమంటే మట్టి అనే భావన కలిగే విధంగా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం చెప్పకనే చెబుతోంది. వాస్తవానికి వివిధ ప్రాంతాల మట్టికలిపితే దేశం సుభిక్షంగా, సురక్షితంగా ఉంటుందనుకుంటే ఈపాటికే మన రాష్ట్రానికి గానీ, మన జిల్లాకు గానీ ఎంతో మేలు జరగాలి. రాష్ట్ర రాజధాని నిర్మాణ సమస్య ఉండేదే కాదు. అమరావతి నిర్మాణంలో భాగంగా అప్పట్లో ప్రధాని మోడీ పట్టెడు మట్టి, దోసెడ గంగ తీసుకుని వచ్చారు. ఆ తరువాత రాజధాని నిర్మాణం ఏమైనా దూసుకుపోయిందా?. అమరావతి మొత్తం ఊహా చిత్రాలకు పరిమితమైంది. వాస్తవానికి నాడు ప్రధాని తెచ్చిన మట్టి, నీరుకు బదులు కాస్త ఆర్థిక సాయం చేసి ఉంటే ఈపాటికి మూడు రాజధానులనే సమస్యే ఉండేది కాదు. ఈ మాటకొస్తే మట్టి కలశాల సంగమం ఏమైనా కేంద్ర ప్రభుత్వం పెంచిన నిత్యావసర సరుకులు, గ్యాస్‌ ధరలు తగ్గిస్తుందా? లేక విద్యుత్తు సంస్కరణల నుంచి ప్రభుత్వం వెనక్కి వెళ్లే విధంగా ప్రభావితం చేస్తుందా? అని జనం చర్చించుకుంటున్నారు. వెనుకబడిన విజయనగరం జిల్లాకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వలేదు. ఉత్తరాంధ్రకు తలమానికంగా ఉన్న విశాఖ రైల్వేజోను ఊసే లేదు. విభజన జరిగిన తొమ్మిదేళ్లు పూర్తయినా గిరిజన యూనివర్సిటీ నిర్మాణ పనులు ప్రారంభానికి నోచుకోలేదు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదు. పెరిగిన ధరలు, కేంద్ర హామీలు, కార్మిక, కర్షక, ఉద్యోగ, మహిళా వ్యతిరేక విధానాలపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తున్న నేపథ్యంలో సెంటిమెంట్‌తో జనాన్ని పక్కదారి పట్టించేందుకు నాదేశం - నామట్టి అనే కార్యక్రమాన్ని కేంద్రం తీసుకొచ్చిందని పబ్లిక్‌టాక్‌.