
ప్రజాశక్తి-తాడేపల్లి : ప్రధాని మోడీ మార్చాల్సింది దేశం పేరు కాదని, తమ పార్టీ విధానాలు మార్చుకుంటే ప్రజలకు మేలు జరుగుతుందని పట్టణ పౌర సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ సిహెచ్.బాబూరావు అన్నారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ, 2000 సంవత్సరంలో జరిగిన విద్యుత్ పోరాట అమరుడు సత్తెరపల్లి రామకృష్ణ వర్ధంతి సభ స్థానిక అమరారెడ్డినగర్‌లో నిర్వహించారు. సభకు రజకవృత్తిదార్ల సంఘం నాయకులు ఓలేటి శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. బాబూరావు మాట్లాడుతూ నైజాం నవాబును మించిన పాలన అటు కేంద్రంలో మోడీ, ఇటు రాష్ట్రంలో జగన్ సాగిస్తున్నారని విమర్శించారు. సంపదంతా దేశంలోని ఇద్దరు కుబేరుల దగ్గరే పోగుపడుతోందని అన్నారు. దేశ సంపదను కొల్లగొట్టి కార్పొరేట్ శక్తులను మోడీ ఊడిగం చేస్తున్నారని విమర్శించారు. రూ.400 ఉన్న గ్యాస్ బండ నేడు రూ.1200 చేసి ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రూ.200 తగ్గించడం ప్రజల్ని మోసం చేయడం కాదా? అని ప్రశ్నించారు. ప్రజలపై మోడీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే రూ.400కే గ్యాస్ బండ ఇవ్వాలని డిమాండ్ చేశారు. విద్యుత్ బిల్లులు చూస్తే షాక్ కొట్టేలా ఉన్నాయన్నారు. మోడీ తీసుకొచ్చిన విద్యుత్ సంస్కరణలను రాష్ట్రంలోని జగన్ ప్రభుత్వం వేగంగా అమలు చేస్తోందని దుయ్యబట్టారు. ట్రూఅప్ ఛార్జీల పేరుతో అసలు కంటే కొసరు అన్నట్లు విద్యుత్ బిల్లులు వస్తున్నాయని, దీనికి సర్దుబాటు అనే ముద్దుపేరు పెట్టారని అన్నారు. పెట్రోల్, డీజిల్‌పై కూడా రూ.50 వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పన్నులు వసూలు చేస్తున్నాయని విమర్శించారు. జిఎస్‌టి, సర్దుబాటు ఛార్జీల పేరుతో దోపిడీ పద్ధతి అవలంభిస్తున్నారని పాలక పార్టీలను విమర్శించారు. ఏడాదికి రూ.2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న మోడీ ఏమైందని ప్రశ్నించారు. రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎం.భాస్కరయ్య మాట్లాడుతూ ఇళ్లు వేసుకుని నివాసం ఉంటున్న ఎక్కడికక్కడ పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. కోర్టు వివాదాల్లో ఉన్న రాజధాని భూములను ఇళ్లస్థలాలుగా ఇచ్చి జగన్ ప్రజలను మోసం చేశారని విమర్శించారు. సిఐటియు రాజధాని డివిజన్ కమిటీ నాయకులు ఎం.రవి మాట్లాడుతూ రాజధాని రైతులకు రూ.5 వేలు ఇస్తానన్న సిఎం హామీ ఏమైందని ప్రశ్నించారు. తొలుత ఐలమ్మ, రామకృష్ణ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు వి.వెంకటేశ్వరరావు, పి.సుబ్బారావు పాల్గొన్నారు. పిఎన్‌ఎం కళాకారులు గంట పాటు వివిధ కళారూపాలు ప్రదర్శించారు.
తాడేపల్లి పట్టణంలోని కొత్తూరు చాకలి ఐలమ్మ రజక సొసైటీ కార్యాలయం వద్ద రజక వృత్తిదారుల సంఘం నాయకులు బొజ్జా సుబ్బారావు అధ్యక్షతన సభ నిర్వహించారు. జిల్లా కార్యదర్శి వల్లభాపురం వెంకటేశ్వరరావు మాట్లాడారు. నాయకులు ఇ.రామరావు, కె.వీరాంజనేయులు, సిహెచ్.కోటేశ్వరరావు, పి.సాంబశివరావు, ఎ.వీరాంజనేయులు, కె.శ్యాంప్రసాద్, కె.శ్రీనివాస్, నరసింహారావు, మాణిక్యాలు, శివలీల, బాలమ్మ, శకుంతల పాల్గొన్నారు.
ప్రజాశక్తి-గుంటూరు : తెలంగాణ సాయుధ పోరాటంలో పీడిత ప్రజల కోసం పోరాడిన యోధులు చిట్యాల ఐలమ్మ, విద్యుత్ ఉద్యమ అమరవీరుడు సత్తెనపల్లి రామకృష్ణ ఆశయాలకు పునరంకితం కావాలని ఆంధ్రప్రదేశ్ రజకవృత్తిదారుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు మండూరు వెంకటనరసయ్య అన్నారు. ఐలమ్మ 38వ వర్థంతి, రామకృష్ణ 23వ వర్థంతి స్థానిక కృష్ణనగర్‌లోని రజకవృత్తిదారుల సంఘం కార్యాలయం వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలమ్మ, రామకృష్ణ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అద్దంకి సాంబశివరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వెంకటనరసయ్య మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలనలో బానిసత్వానికి వ్యతిరేకంగా తెలంగాణాలో జరిగిన సాయుధ పోరాటంలో ఐలమ్మ ముందుభాగాన నిలిచారన్నారు. 2000 సంవత్సరంలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్ సంస్కరణల్లో భాగంగా విద్యుత్ ఛార్జీల పెంపుదలకు వ్యతిరేకంగా హైదరాబాద్ బషీర్‌బాబు వద్ద జరిగిన పోరాటంలో ప్రభుత్వ తుపాకీ కాల్పులకు ఆనాటి సంఘం రాష్ట్ర కన్వీనర్ రామకృష్ణ బలయ్యాడన్నారు. వారి చూపిన పోరాట మార్గంలో సంఘ సభ్యులు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు వేంపాటి చిన్నకొండయ్య, సీతయ్య, భాస్కరరావు, కాలేశ్వరరావు, నగరంలోని వివిధ వాచ్‌మెన్ కమ్ ఇస్త్రీదారులు పాల్గొన్నారు.
ప్రజాశక్తి - దాచేపల్లి : దాచేపల్లిలోని పల్నాడు బలహీన వర్గాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో నివాళులర్పించారు. వేదిక జిల్లా అధ్యక్షులు రాజు, ఉపాధ్యక్షుడు షరీఫ్, జిల్లా కార్యదర్శి నాగుల్ మీరా, నియోజకవర్గం అధ్యక్షులు బి.చెన్నయ్య, జి.వెంకటేశ్వర్లు, జె.రమేష్, రహీం, శ్రీకాంత్, పిచ్చయ్య పాల్గొన్నారు.
ప్రజాశక్తి-తెనాలి : రజక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నివాలులర్పించారు. పి.రమణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర రజక సంఘం ఐక్యవేదిక అధ్యక్షులు పి.అంజిబాబు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. తొలుత రజకచెరువు పార్కులోని ఐలమ్మ విగ్రహానికి పూలమాలలేశారు. కౌన్సిలర్ వి.విజయలక్ష్మి, రజక సంఘీయులు కె.చినవెంకటరమణ, ఎం.పార్వతి, హిమాచలరావు, ఎన్.రాంబాబు, పూర్ణ పాల్గొన్నారు.