శాంతి కోసం తపించి,
విసిగి, వేసారి, అలసిన కపోతాల
రెక్కలు విరగ్గొట్టి
గూడు చెదరగొట్టి
నింగిపై సర్వహక్కులు మావే
ఇకపై ఎగరడానికి వీల్లేదని
వేటగాళ్ల ఆంక్షలు
రెక్క విరిగిన పక్షులన్నీ
లోహ విహంగాలనెక్కి
తమదైన చోటు నుండి
తమది కాని చోటుకు
శరణార్ధులై పయనమవుతూ
బానిసలై బతకబోతున్నాయి
ప్రపంచ పటం
ఓ దేశాన్ని చెరిపేసుకుంది
భూగోళం నుండి
ఓ రాజ్యం కనుమరుగయ్యింది
అగ్రరాజ్యాల కుటిల నీతికి
కళ్ళెదుటే ఓ ప్రాంతం సమాధయ్యింది
ప్రజలు లేని దేశంలో
పీడకులే పాలకులై ఎవరిని
పాలించబోతున్నారు?
''దేశం లేని ప్రజలు'' మాత్రం
నోరు మెదపని రాజ్యాల వంక చూస్తూ
దీనంగా విలపిస్తున్నారు..!!
కాబూల్ గుండె బద్ధలై
లావా ప్రజల కళ్ల నుండి ప్రవహిస్తుంది
ఆఫ్ఘన్ ఇప్పుడొక విస్ఫోటించిన అగ్నిపర్వతం
ఒక రోజొస్తుంది
పుట్టను ఆక్రమించిన పామును
చీమలు చంపే రోజు
జపం పసిగట్టిన చేపలు
కొంగను తరిమే రోజు
ఎలుకలన్నీ కలిసి
పిల్లి మెడలు వంచే రోజు
''దేశం లేని ప్రజలారా''
మీకూ ఒక రోజొస్తుంది..!
దేశం గాయాలకు
లేపనాన్ని అద్దే రోజు
దేశం నుదుటిపై
వీర తిలకం దిద్దేరోజు..!!
జాబేర్ పాషా
00968 97663604