Nov 07,2023 19:51

నివాళి అర్పిస్తున్న నాయకులు

ప్రజాశక్తి-నెల్లూరు :దేశం గర్వించదగ్గ శాస్త్రవేత్తల్లో ఒకరు సర్‌ సి.వి.రామన్‌ అని డాక్టరు రామ చంద్రారెడ్డి ప్రజా వైద్యశాల మెడికల్‌ సూపరింటిండెంట్‌ డాక్టరు బి.రాజేశ్వరరావు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక అపోలో సెంటర్‌ సమీపంలోని డాక్టరు జెట్టి దశరథరామిరెడ్డి ఎడ్యుకేషనల్‌ ట్రస్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సి.వి.రామన్‌ సైన్స్‌ సెంటర్‌లో ప్రముఖ శాస్త్రవేత్త సి.వి. రామన్‌ జయంతి కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా పిపిసి మెడికల్‌ సూపరింటిండెంట్‌ డాక్టరు బి.రాజేశ్వరరావు, జెట్టి శేషారెడ్డి విజ్ఞాన కేంద్రం మేనేజర్‌ జయరామిరెడ్డి, శ్రీరాంమూర్తి హాజరైయ్యారు. ముందుగా సి.వి రామన్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం డాక్టరు బి.రాజేశ్వరరావు మాట్లాడుతూ సి.వి.రామన్‌ ' రామన్‌ ఎఫెక్ట్‌ను కనుగొన్నారని, 1928 ఫిబ్రవరి 28న ఆయన పరిశోధన ఫలితాన్ని ధ్రువీకరించారని, ఆరోజు జ్ఞాపకార్ధంగా 1987 నుంచి ప్రతి ఏడాది ఫిబ్రవరి 28వ తేదిన జాతీయ విజ్ఞాన దినోత్సవంగా మన దేశంలో జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు.విద్యార్థులకు భౌతిక, రసాయన శాస్త్రాలపట్ల ప్రాథమిక అవగాహన కల్పించి భవిష్యత్తులో శాస్త్రవేత్తలుగా తయారు కావాలన్న సంకల్పంతో ఈ సైన్స్‌ సెంటర్‌ను ప్రారంభించామన్నారు. ఈ కార్యక్రమంలో జెడిఆర్‌ ట్రస్ట్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ కె.రామూర్తి, కన్వీనర్‌ జి.కామయ్య, ట్రస్టు కార్యదర్శి ఎం.సూర్యప్రకాశరావు, ప్రజాశక్తి మేనేజర్‌ కె కోటేశ్వరరావు, జెవివి నాయకులు ఆనందరాంసింగ్‌, సంఘమిత్ర హైస్కూల్‌ విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.