బ్రిటీష్ కాలం నాటి దుర్మార్గమైన రాజద్రోహం చట్టాన్ని అడ్డు పెట్టుకొని పౌరుల ప్రాథమిక హక్కులను కాలరాస్తూ కేంద్రం, అనేక రాష్ట్ర ప్రభుత్వాలు కొనసాగిస్తున్న నిర్బంధ చర్యలను సర్వోన్నత న్యాయస్థానం సూటిగా నిలదీయడం మంచి పరిణామం. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న నిరంకుశ ధోరణిని ధర్మాసనం నేరుగానే ఆక్షేపించింది. హద్దుమీరి నిరంకుశ చట్టాలతో బరితెగిస్తున్న కేంద్రానికి, బి.జె.పి పాలిత రాష్ట్రాలకు ఇది చెంప పెట్టు.
విద్యార్థులు ఉపకార వేతనాలు పెంచాలని కోరితే దేశద్రోహం. విశ్వవిద్యాలయాల్లో భిన్నాభిప్రాయాలను చర్చిస్తూ భావ ప్రకటన స్వేచ్ఛ కోసం నినదిస్తే దేశద్రోహం. దేశానికి అన్నంపెట్టే రైతన్న తన హక్కులను భక్షించే చట్టాలను నిరసిస్తే అది కూడా దేశద్రోహమే. నోరులేని నిరుపేదల పక్షాన, సామాజికంగా ఎనలేని వివక్ష ఎదుర్కొంటూ అణిచివేతకు గురౌతున్న దళిత, గిరిజనుల హక్కుల రక్షణ కోసం సామాజిక కార్యకర్తలు గళం విప్పినా దేశద్రోహమే. దేశంలోని వనరులను కార్పొరేట్ కంపెనీలకు దోచిపెడుతున్న వైనాన్ని ప్రశ్నిస్తూ పాత్రికేయులు కథనాలు రాస్తే అది కూడా దేశద్రోహమే. వీటన్నిటికీ బ్రిటీష్ కాలం నాటి రాజద్రోహం చట్టమే సాకు. ఈ నిరంకుశ చట్టాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం విచారణకు స్వీకరించిన రోజు కూడా హర్యానా ప్రభుత్వం ఇదే చట్టం కింద వంద మందికి పైగా అన్నదాతలపై కేసులు నమోదు చేయడం బిజెపి నిరంకుశ ధోరణికి నిదర్శనం.
భారత శిక్షాస్మృతి లోని సెక్షన్ 124 (ఏ) రాజ్యాంగ అర్హతను సవాలు చేస్తూ ఇద్దరు పాత్రికేయులు, ఒక సైనిక మేజర్ జనరల్ దాఖలు చేసిన పిటిషన్లలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి రమణ ప్రభుత్వాల తీరును ప్రశ్నిస్తూ తీవ్ర వ్యాఖ్యలే చేశారు. స్వతంత్ర సంగ్రామ పోరాట యోధులపై నాడు ఆంగ్లేయులు ప్రయోగించిన ఈ నిరంకుశ చట్టాన్ని 75 ఏళ్ల స్వతంత్ర భారతావనిలో ఇంకా కొనసాగించాల్సిన అవసరమేమిటని ప్రశ్నించారు. 'పిచ్చోడి చేతిలో రాయి'లా ఈ నిరంకుశ చట్టాన్ని ఎడాపెడా దుర్వినియోగపరుస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎంతటి నిరంకుశత్వంతో పౌరుల ప్రాథమిక హక్కులను హరిస్తూన్నాయో సోదాహరణంగా వివరిస్తూ కడిగిపారేశారు. దేశద్రోహం, చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (ఉపా) వంటి నిరంకుశ చట్టాల రాజ్యాంగ అర్హతపై ఆందోళనల వెల్లువ నేపథ్యంలో సర్వోన్నత ధర్మాసనం చేసిన ఈ కఠిన వ్యాఖ్యలు సముచితం. సందర్భోచితం.
కేంద్ర ప్రభుత్వం తరపున హాజరైన అటార్నీ జనరల్ కె.కె వేణుగోపాల్ ప్రధాన న్యాయమూర్తి ఆందోళనతో ఏకీభవించినట్లే తలూపి దేశద్రోహ చట్ట సక్రమ వినియోగానికి తాజాగా నూతన మార్గదర్శకాలను తీసుకొస్తామన్నారు. కానీ ఆరు దశాబ్దాల కిందట కేదార్‌నాథ్ సింగ్ కేసు తీర్పు సందర్భంగా తీసుకొచ్చిన మార్గదర్శకాలకే దిక్కు లేదు. ఇక నూతన మార్గదర్శకాలను ఎవరు పట్టించుకుంటారన్నదే ప్రశ్న. దేశానికి వ్యతిరేకంగా హింసను రెచ్చగొట్టి శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలను మాత్రమే దేశద్రోహంగా పరిగణించాలని నాటి తీర్పులో స్పష్టంగా చెప్పారు. కానీ జరుగుతున్నదేమిటి? ప్రభుత్వాలను, ప్రజా ప్రతినిధులను విమర్శిస్తూ శాంతియుత నిరసన ప్రదర్శనలు నిర్వహించినా, అందులో పాల్గొన్న సాధారణ పౌరులపైనా పాలకులు 'దేశద్రోహ' ముద్ర వేస్తున్నారు. అందువల్ల కొత్త మార్గదర్శకాలు తీసుకొచ్చినా అమలు అనుమానాస్పదమే !
దేశద్రోహం, ఉపా వంటి నిరంకుశ చట్టాల పట్ల న్యాయవ్యవస్థ పదేపదే విమర్శలు గుప్పిస్తూనే వున్నా...పాలకుల్లో ఏమాత్రం చలనం ఉండటం లేదు. పౌరుల భావ ప్రకటనా స్వేచ్ఛను, నిరసన తెలియజేసే హక్కును కాలరాస్తూ వేధింపులకు తెగబడుతున్న రాజ్యం యొక్క నిరంకుశ ధోరణి పట్ల సుప్రీంకోర్టు ఒక్కటే కాదు. .కింది కోర్టులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తూనే వున్నాయి. జుడిషియల్ కస్టడీలో వున్న ఆదివాసీ హక్కుల కార్యకర్త ఫాదర్ స్టాన్‌స్వామి విషాదంత మరణం పౌరస్వేచ్ఛను కాలరాసిన వైనానికి నిలువెత్తు నిదర్శనం. సర్వోన్నత న్యాయస్థానం చీవాట్లతో పాలకులు ఇప్పటికైనా నిరంకుశ చట్టాలను అక్రమంగా బనాయించడం మాని ప్రజా సమస్యలు ఆలకించడం అలవర్చుకోవాలి.










