* కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్
శ్రీకాకుళం : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా చిన్నారులు చేసిన నృత్యాలు రంజింపజేశాయని కలెక్టర్ శ్రీకేష్ లాఠకర్ పేర్కొన్నారు. ఇటువంటి తృత్యాలతో, గీతాలతో మనలో దేశభక్తి ప్రజ్వలిస్తుందని అన్నారు. మన దేశ ఔన్నత్యాన్ని చాటి చెప్పేందుకు మనమంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు. తృత్యాలు చేసిన విద్యార్థులను, తృత్య దర్శకులను ఈ సందర్భంగా అభినందించారు. స్థానిక బాపూజీ కళామందిర్‌లో 77వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు విద్యాశాఖ ఆధ్వర్యాన మంగళవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ సాంస్కృతిక ప్రదర్శనలను ఆద్యంతం తిలకించారు. తొలుత శ్రీచైతన్య టెక్నో స్కూల్ విద్యార్థులు స్వాగతం.. సుస్వాగతం గీతానికి చేసిన నృత్యాలు ఆహుతులను అలరించాయి. జయతు జయతు భారతం గీతానికి ఆర్‌సిఎం లయోలా పాఠశాల విద్యార్థులు చేసిన నృత్యాలు, అలాగే ఆక్స్‌ఫర్డ్ స్కూల్ విద్యార్థులు, శ్రీచైతన్య టెక్నో స్కూల్ విద్యార్థులు నృత్యంచిన భరత ఖండమే నాదేశం గీతాలు ప్రేక్షకులను మంత్ర ముగ్దులను చేశాయి. శ్రీసాయి విద్యామందిర్ విద్యా ర్థులు వందేమాతరం.. మనదే ఈతరం గీతానికి చేసిన నృత్యం, జిల్లా ఖజానాశాఖ ఉప సంచాలకులు సిహెచ్. రవికుమార్ ఆలపించిన తేనెల తేటల మాటలతో దేశభక్తి గీతం, విశాఖ నేవీ స్కూల్ విద్యార్థిని సంఘటనం ఒక యజ్ఞం గీతానికి అపర్ణ చేసిన నృత్యం ప్రేక్షకులను అబ్బురపరచాయి. టిపిఎంహెచ్ స్కూల్ విద్యార్థులు శివానీ...భవానీ గీతానికి చేసిన నృత్యం, 4వ తరగతి విద్యార్థిని వెన్య ఆలపించిన భగవద్గీతలోని 16వ శ్లోకం, తేనెల తేటల మాటలతో దేశభక్తి గీతం, టిపిఎంహెచ్ స్కూల్ విద్యార్థుల శ్రీకాకుళం వైభవం, ఆర్‌సిఎం లయోలా స్కూల్ విద్యార్థుల భో.శంభో.. శివ శంభో నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్బంగా నృత్యాలు చేసిన వివిధ పాఠశాలల విద్యార్థులకు, నృత్య దర్శకులకు సంయుక్త కలెక్టర్ ఎం.నవీన్, ట్రైనీ కలెక్టర్ రాఘవేంద్ర మీనా కలిసి జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి వెంకటేశ్వరరావు, మెప్మా, గృహ నిర్మాణశాఖ, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకులు ఎం.కిరణ్‌కుమార్, ఎన్.గణపతి, డాక్టర్ డి.వి.విద్యాసాగర్, ముఖ్య ప్రణాళిక అధికారి వి.ఎస్.ఎస్.లక్ష్మీప్రసన్న, సెట్‌శ్రీ ముఖ్య కార్యనిర్వహణాధికారి బి.వి.ప్రసాదరావు, జిల్లా పర్యాటక అధికారి ఎన్.నారాయణరావు, జిల్లా పౌర సంబంధాల అధికారి కె.బి.ఎం.సింగ్ పాల్గొన్నారు.










