'హిందువులు సహజంగానే దేశభక్తి కలిగి వుంటారు, వారు జాతి వ్యతిరేకులుగా వుండర'నేది ఇప్పుడు సూత్రీకరణ చేస్తుంటే... ఇతర మతాలకు చెందిన వారి జాతీయత, దేశభక్తి అనుమానాస్పదమైంది. ఇది ఆధునిక భారతదేశ నిర్మాణంలో ముస్లింలు, క్రైస్తవులు అందించిన గొప్ప సేవలను నిర్లక్ష్యం చేస్తుంది. వారంతా దేశభక్తి కలిగిన పౌరులు, జాతీయ భావాలు కలిగిన వారు కాదా ?
కొన్ని సంవత్సరాలుగా 'జాతి-వ్యతిరేకి' అనే పదం వ్యవహారిక పదంగా వుంటోంది. నేడు ఆర్‌ఎస్‌ఎస్ ను, దాని సంతానాన్ని విమర్శించే వారిని జాతి వ్యతిరేకులుగా ముద్ర వేస్తున్నారు. హిందూ జాతీయవాదానికి నెలవుగా ఉన్న ఈ దేశభక్తిని మతంతో ముడి పెట్టడంలో ఆర్‌ఎస్‌ఎస్ మరింత శక్తివంతంగా తయారవుతోంది. ఈ జాతికి విధేయులుగా వున్న హిందువులను అభినందించే క్రమంలో, ముస్లింల గురించి ముఖ్యంగా 'వారు పాకిస్తాన్‌కు విధేయులుగా వుంటారు' లాంటి సున్నితమైన, నేర్పయిన మాటలను ప్రచారంలో పెడుతున్నారు.
ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్, తన తెలివైన మాటలతో... మతం కారణంగా, హిందువులు స్వభావ రీత్యానే దేశభక్తియుతంగా వుంటారని పేర్కొన్నాడు. అదేవిధంగా గాంధీజీ దేశభక్తి మూలం హిందూ మతంలోనే వుందని చెప్పేందుకు, ఆయన గాంధీజీ మాట్లాడిన వాక్యం అర్థాన్నే మార్చాడు.
''భారతీయులందరూ మాతృభూమిని ఆరాధిస్తారు. కానీ, నా దేశభక్తి నా మతం నుండే వచ్చిందని గాంధీజీ అన్నాడు. కాబట్టి, నీవు హిందువు అయితే నీవు స్వయంచాలిత దేశభక్తుడివి అవుతావు. నీవు చైతన్యరహిత హిందువువు కావచ్చు. నీకు ఒక మేల్కొలుపు అవసరం వుండొచ్చు. కానీ హిందువు ఎప్పటికీ భారతదేశానికి వ్యతిరేకిగా వుండడు.'' అంటాడు.
ఈ సమాచారంలో దాగి ఉన్న నేర్పయిన మాటలను విశ్లేషించే ముందు మనం, ఆర్‌ఎస్‌ఎస్ ప్రారంభ దశలో దాని సిద్ధాంతకర్త, యం.ఎస్.గోల్వాల్కర్ బాగా ఆలోచించి నాజీలను ప్రశంసిస్తూ, యూదుల పట్ల నాజీలు వ్యవహరించిన విధంగానే, మనం ఈ దేశంలోని ముస్లింలు, క్రైస్తవుల పట్ల (ఆర్‌ఎస్‌ఎస్ ప్రకారం వారు విదేశీ మతస్తులు) వ్యవహరించాలని సిఫార్సు చేశాడన్న విషయాన్ని అర్ధం చేసుకోవాలి.
బిజెపి, విహెచ్‌పి, ఎబివిపి, వనవాసి కళ్యాణ్ ఆశ్రమ్‌ల లాంటి తన అనుబంధ సంస్థల ద్వారా, వివిధ ప్రభుత్వ సంస్థలు, మీడియా, విద్యా వ్యవస్థలలో చొరబాటు ద్వారా ఇప్పుడు ఆర్‌ఎస్‌ఎస్ బలోపేతం అవుతోంది. హిందూ జాతీయ వాద భావజాలాన్ని అందించే క్రమంలో అది ఉపయోగించే భాష చాలా నేర్పుగా వుంటుంది. గోల్వాల్కర్ ''ఔవ శీతీ ఉబతీ చీa్‌ఱశీఅష్ట్రశీశీస ణవళఅవస''లో నొక్కి చెప్పిన విధంగానే దాని అర్ధం, భావం వుంటుంది. కానీ దానిని తెలియజేసే విధానంలో అలంకరించబడిన, సున్నితమైన భాషను (సమాజంలో అనేక మంది గందరగోళ పడే విధంగా) ఉపయోగిస్తారు.
గాంధీజీకి సంబంధించినంత వరకు మతం అనేది వ్యక్తిగతమైన విషయంగా భావించి, తనను తాను సనాతన హిందువుగా చెప్పుకున్నాడు. కానీ తన హిందూ మతం ఉదారంగానూ, అందరినీ కలుపుకొనిపోయేదిగా వుంటుంది. ఆయన మతం అనేక నైతిక విలువలతో కూడి ఉంటుంది. తన ఆధ్యాత్మిక శక్తిని అన్ని మతాల నుండి సాధించాడు. నన్ను నేను మంచి వానిగా పరిగణిస్తాను, ఒక ముస్లింను నా లాంటి ఒక హిందువుగా పరిగణిస్తాను. ఆ మాటకొస్తే 'నన్ను నేను ఒక క్రైస్తవుడు, ఒక ఫార్శీతో సమానమైన మంచి మనిషిగా పరిగణిస్తాను' అంటాడు. తన హిందూ మతాచారాలలో ఇతర మతాలకు చెందిన ప్రజలను గౌరవించడం, వారిని కలుపుకొనిపోయే విధానం వుంటాయి. ఇది ఆర్‌ఎస్‌ఎస్ ఆచరించే (మిగిలిన మతాల ప్రజలను మినహాయించే, సంకుచితమైన అవగాహనకు) హిందూ మతాచారాలకు పూర్తి భిన్నంగా వుంటుంది. వారి ఆచరణ నిరంతరం, ప్రజలు మర్చిపోయిన సమస్యలను మళ్ళీ తెర పైకి తీసుకొచ్చి, ఇతర మతాలకు చెందిన వారిని భయభ్రాంతులకు గురి చేస్తుంది. గాంధీజీ తన మతాచార, సాంప్రదాయాలు ఉదారంగా, అందరినీ కలుపుకొని పోయే విధంగా ఉంటాయి కాబట్టే, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో భిన్న మతాలకు చెందిన ప్రజలకు నాయకత్వం వహించగలిగాడు.
గాంధీజీ కూడా మతాన్ని, జాతీయతతో, దేశభక్తితో కలిపి చూడలేదు. అంటే దానర్థం దేశం పట్ల, దేశ ప్రజల పట్ల వుండే ప్రేమ-'దేశభక్తి' మూలాలు మతంలో లేవు. కానీ మతం మూలం లేని 'జాతీయత'లో వున్నాయి. ఆయన ఉపయోగించిన పదం 'మతం' రెండు స్థాయిలలో వుంటుంది. మొదటిది-ప్రముఖ ఆచారాలు, గుర్తింపు, విశ్వాసం మొదలైన వాటి భావన. రెండవది-మత బోధనల లోని స్వాభావిక నైతికత. మతాలకు నైతికతే ప్రధానమైనదనే విషయంపై ఆయనకు స్పష్టత వున్నప్పటికీ...బిజెపి, ముస్లిం (ముస్లిం లీగ్ మొదలైన) మతతత్వవాదుల ఇష్టాలు ఆయన ఉపయోగించిన పదాన్ని కేవలం ఆచారాలు, పవిత్ర స్థలాల స్థాయి లోనే తీసుకున్నాయి.
హిందూ జాతీయవాద భావజాలంలో భాగంగా వుంటూ, ఆర్‌ఎస్‌ఎస్ కు దగ్గరగా వుండే సిద్ధాంతకర్తలు...'భారత దేశాన్ని ఒక జాతిగా నిర్మించిన' గాంధీజీతో పాటు ఇతర జాతీయ నాయకుల మాటలు కూడా ఆర్‌ఎస్‌ఎస్ భావజాలానికి దగ్గరగా, వాటినే పోలి వుంటాయని చెప్పేందుకు చాలా కష్టపడుతున్నారు. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న ప్రముఖులకు, 'భారత దేశం ఒక జాతిగా ఏర్పడిన విధానాలకు', వారి భావజాలానికి పోలిక వుందని చూపించడం ద్వారా తమ సిద్ధాంతానికి చట్టబద్ధతను పొందే ప్రయత్నంలో వారు ఆర్‌ఎస్‌ఎస్ సిద్ధాంతాన్ని నిలుపుకుంటున్నారు.
కాబట్టి, 'హిందువులు సహజంగానే దేశభక్తి కలిగి వుంటారు, వారు జాతి వ్యతిరేకులుగా వుండర'నేది ఇప్పుడు సూత్రీకరణ చేస్తుంటే... ఇతర మతాలకు చెందిన వారి జాతీయత, దేశభక్తి అనుమానాస్పదమైంది.
ఇది ఆధునిక భారతదేశ నిర్మాణంలో ముస్లింలు, క్రైస్తవులు అందించిన గొప్ప సేవలను నిర్లక్ష్యం చేస్తుంది. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా నిలవడమే కాకుండా భారతదేశ విభజనను వ్యతిరేకించిన ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్, మౌలానా అబుల్ కలాం ఆజాద్ లను అనుసరించిన లక్షలాది మంది ముస్లింలను ఎక్కడ పెడతారు ? షిబ్లీ నొమాని, హస్రత్ మొహాని, అస్ఫఖుల్లా ఖాన్ లను ఎక్కడ ఎలా చూడాలి? మహ్మదాలీ జిన్నా పాకిస్తాన్‌ను విభజించాలని చేసిన తీర్మానాన్ని వ్యతిరేకించేందుకు ముస్లింల మహాసభను నిర్వహించేందుకు సాధనంగా ఉపయోగించిన అల్లాబక్ష్ సేవలకు ఏం విలువ కట్టాలి? స్వాతంత్య్రోద్యమ పోరాటంలో పాల్గొనేందుకు ముస్లింలు అసంఖ్యాకమైన సంస్థలను ఏర్పాటు చేశారు.
ఆధునిక భారతదేశ నిర్మాణంలో, పారిశ్రామిక, విద్యా, క్రీడా, సాంస్కృతిక రంగాలలో దేశాన్ని ముందుంచేందుకు స్వాతంత్య్ర భారతదేశంలో అన్ని ప్రాంతాలకు చెందిన ప్రజలు సమానమైన ఉత్సాహంతో సేవలు అందించారు. వారంతా దేశభక్తి కలిగిన పౌరులు, జాతీయ భావాలు కలిగిన వారు కాదా ?
మరోవైపు, మోహన్ భగవత్ సూత్రీకరణ...మహాత్మా గాంధీని హత్య చేసిన, తమ శాఖలో శిక్షణ పొందిన నాథూరాం గాడ్సేను సమర్ధిస్తుంది. సుప్రీంకోర్టు బాబ్రీ మసీదు కూల్చివేతను నేరంగా పరిగణించింది. అప్పుడు ఈ కూల్చివేతకు నాయకత్వం వహించిన వారిని, దానిలో భాగస్వాములైన వారిని ఏమనాలి? భగవత్ చెప్పిన ప్రకారం, గాంధీజీ, కల్బుర్గీ, నరేంద్ర దబోల్కర్, గౌరీ లంకేష్, గోవింద పన్సారే లాంటి వారిని హత్య గావించిన చర్యలను, దేశభక్తి యుతమైన చర్యల జాబితాలో చేర్చాలా? రహస్య సమాచారాన్ని చేరవేసే వారు, స్మగ్లింగ్, బ్లాక్ మార్కెటింగ్ చేసే అనేక మంది హిందువులను ఏ స్థానంలో వుంచాలి?
ఆసక్తికరంగా, ఆర్‌ఎస్‌ఎస్ గాంధీని గౌరవిస్తుంది. ఆర్‌ఎస్‌ఎస్ శిక్షణ పొందిన ప్రచారక్‌లు, సిద్ధాంతకర్తలు, ఇతర అనుబంధ సంస్థలు మాత్రం బహిరంగంగా నాథూరాం గాడ్సేను గౌరవిస్తారు.
గాడ్సేను కీర్తిస్తూ పెద్ద సంఖ్యలో ట్వీట్లు మనం చూస్తున్నాం. అది కూడా హిందువుల నుండే ఎక్కువ. ఇది ఆర్‌ఎస్‌ఎస్ భావజాలాన్ని వ్యాప్తి చేసే సామర్థ్యాన్ని తెలుపుతుంది. అటువంటి సంస్థ మాత్రమే ఏకకాలంలో గాంధీజీ పట్ల విధేయతను ప్రదర్శిస్తూ, గుట్టుచప్పుడు కాకుండా ఆయన హత్యకు దారి తీసిన భావజాలాన్ని వ్యాప్తి చేసుకోగలుగుతుంది.
('ఇండియన్ కరెంట్స్' సౌజన్యంతో)
రామ్ పునియాని











