Feb 28,2021 06:33

తొంభై సంవత్సరాల క్రితం ఒక విద్యార్థిని ఒక స్కూలు యాజమాన్యం ఆ స్కూలు నుండి వెళ్ళగొట్టింది. దేశభక్తితో స్పందించి, బ్రిటిష్‌వాళ్ళు ఈ దేశం నుండి వెళ్ళిపోవాలని కోరుతూ రాజకీయ కార్యక్రమంలో పాల్గొనడమే ఆ విద్యార్థి చేసిన నేరం. ఇన్నేళ్ళ తర్వాత ఆ స్కూలుకి ఆ విద్యార్థి పేరే పెడుతూ పంజాబ్‌ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జలంధర్‌ జిల్లాలోని ఫిల్లావుర్‌ తాలూకాలో 'బుందాలా' అనే గ్రామం ఉంది. అక్కడి హైస్కూలుకు ''కామ్రేడ్‌ హరికిషన్‌సింగ్‌ సూర్జిత్‌ సీనియర్‌ సెకండరీ స్కూల్‌'' అని పేరు పెడుతూ ముఖ్యమంత్రి అమరిందర్‌ సింగ్‌ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.


ఇరవయ్యవ శతాబ్దం ప్రారంభ సంవత్సరాల్లో సిఖ్‌ లహర్‌ (సిక్కు తరంగం) పేర అక్కడి ప్రజల విద్యావికాసం కోసం ఉద్యమం నడిచింది. ఆ ఉద్యమంలో భాగంగా బుందాలా లో ఖల్సా మిడిల్‌ స్కూల్‌ పేర ఒక స్కూలు స్థాపించబడింది. తర్వాత అది హైస్కూలుగా పెరిగింది. 1920 దశకం చివరిభాగంలో సూర్జిత్‌ ఆ స్కూలులో విద్యాభ్యాసం చేశారు. ఆ కాలంలోనే అదే స్కూలులో పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి దర్బారా సింగ్‌, మాజీ కేంద్ర మంత్రి స్వరణ్‌ సింగ్‌ కూడా చదివారు.


సూర్జిత్‌ తండ్రి హర్నామ్‌ సింగ్‌ కూడా స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్న ఉద్యమకారుడే. ఆయన ఇంటికి తరచూ ఉద్యమ నాయకులు వస్తూండేవారు. 1931లో గదర్‌ ఉద్యమనేతలు గద్రీ బాబా, కరమ్‌ సింగ్‌ చీమా, బాబా భాగ్‌సింగ్‌ కెనడియన్‌, ఉప్పల్‌ భూపా ఆ ఇంటికి వచ్చారు. అప్పటికి సూర్జిత్‌కు 15 ఏళ్ళు. ఈ నాయకులు ఆ బాలుడిని గురుద్వారాలో సమావేశం ఏర్పాట్లు చేయమని చెప్పారు. అప్పుడు సూర్జిత్‌ గురుద్వారాకు పోయి... అక్కడి పెద్ద గంటను మోగించి, మీటింగు జరగనుందని ప్రకటించి, బల్లలు, కుర్చీలు, పట్టాలు ఏర్పాటు చేశాడు. సభకు జనం బాగా హాజరయ్యారు.


ఆ మర్నాడు స్కూలుకి పోలీసులు వచ్చారు. రాజకీయ సమావేశం ఏర్పాటు చేసినందుకు క్షమాపణలు కోరాలని సూర్జిత్‌పై ఒత్తిడి తెచ్చారు. అందుకా కామ్రేడ్‌ సుతరామూ అంగీకరించలేదు. చివరకు సూర్జిత్‌ను ఆ స్కూలు నుండి తొలగించారు. దూరంగా జలంధర్‌ లోని వేరే ఒక స్కూలులో సూర్జిత్‌ చేరవలసి వచ్చింది. 


1967 ఎన్నికలలో కామ్రేడ్‌ సూర్జిత్‌ ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఆ స్కూలులో ఒక కార్యక్రమం నిర్వహించి దానికి రాష్ట్ర విద్యామంత్రి లక్ష్మణ్‌ సింగ్‌ గిల్‌ ను ఆహ్వానించారు. ఆ సమావేశంలో విద్యామంత్రి ఆ స్కూలును ప్రభుత్వ స్కూలుగా నిర్వహిస్తామని ప్రకటించారు. కాలక్రమంలో అది సీనియర్‌ సెకండరీ స్కూలుగా ఎదిగింది.


హరికిషన్‌సింగ్‌ సూర్జిత్‌ మరణానంతరం, రెండవ వర్ధంతి సందర్భంగా ఆ స్కూలుకు ఆయన పేరు పెట్టడానికి ప్రభుత్వం అంగీకరించింది. అయితే అది అమలుకు నోచుకోలేదు. ఇటీవల మళ్ళీ ఆ విషయాన్ని పంజాబ్‌ రాష్ట్ర సిపిఎం కార్యదర్శి సుఖ్విందర్‌సింగ్‌ సెఖన్‌ ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చారు. మొత్తానికి ప్రభుత్వం కదిలింది. నిజమైన దేశభక్తి అంటే సామ్రాజ్యవాదులకు మోకరిల్లడం కాదని, స్వాతంత్య్రాన్ని కాపాడుకోవడమే అసలైన ఆత్మనిర్భరత అని ఆచరణలో చూపించిన సూర్జిత్‌ నేటి యువతరానికి ఆదర్శం.
                                                               (ఫీచర్స్‌ అండ్‌ పాలిటిక్స్‌)