ప్రజాశక్తి - కోసిగి రూరల్
రాబోయే ఎన్నికల్లో మోడీని గద్దె దించి దేశాన్ని కాపాడుకుందామని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు కె.వెంకటేశులు కోరారు. బిజెపి ప్రజా వ్యతిరేక, నియంతృత, మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా వామపక్షాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రచార భేరి ముగింపు సభ సోమవారం కోసిగిలో నిర్వహించారు. ముందుగా వైఎస్‌ఆర్ సర్కిల్ నుంచి ర్యాలీగా బయల్దేరి సిపిఐ కార్యాలయం ముందు సిపిఎం, సిపిఐ నాయకులు వీరేష్, రాజు అధ్యక్షతన సభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్యఅతిథులుగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వెంకటేశులు హాజరయి మాట్లాడారు. మోడీ ప్రభుత్వం రైతులకు, కూలీలకు, కార్మికులకు, ప్రజలకు వ్యతిరేకంగా పరిపాలన సాగిస్తోందని విమర్శించారు. పెట్రోలు, డీజిల్, గ్యాస్, నిత్యావసర వస్తువుల ధరలు పెంచి ప్రజలపై భారాలు మోపిందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశాన్ని, రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి రాబోయే కాలంలో మోడీని గద్దె దించాలని కోరారు. సిపిఎం మండల కన్వీనర్ రాముడు, సిపిఐ మండల నాయకులు గోపాల్, సిపిఎం కార్యకర్తలు పెద్దబొంపల్లి హనుమంతు, కడదొడ్డి నాగేంద్ర, చిన్న బొంపల్లి ముక్కరన్న, జంపాపురం ప్రకాష్, శాతనూరు నజీర్, మహాదేవ, ఈరన్న, చింతకుంట ఈరన్న, హనుమంతు, పూజారి శ్రీనివాసులు, మల్లికార్జున, రంగ, హనుమంతు, సిపిఐ నాయకులు నేలకోసిగి రమేష్, నరసింహులు, జుమ్మాలదిన్నె రాజు, జంపాపురం థామస్, ఉలిగయ్య పాల్గొన్నారు.
ప్రచార భేరి సభలో మాట్లాడుతున్న వెంకటేశులు










