పుట్టపర్తి అర్బన్ : దేశ ఆర్థిక అభివద్ధి, వ్యవసాయ రంగం వెన్నెముక లాంటిదని రాష్ట్ర ప్రెస్ అకాడమీ ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాస్ రావు పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లో సిఆర్ మీడియా అకాడమీ జిల్లా వ్యవసాయ అనుబంధ శాఖల ఆధ్వర్యంలో వ్యవసాయ రంగం సంస్కరణలు అనే అంశంపై రైతులతో చర్చాగోష్టి సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కొమ్మినేని తో పాటు జిల్లా వ్యవసాయ సలహా మండలి ఛైర్మన్ అవుతల రమణారెడ్డి, పుడా ఛైర్‌పర్సన్ లక్ష్మీనరసమ్మ, వ్యవసాయ అధికారి సుబ్బారావు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొమ్మినేని మాట్లాడుతూ దేశంలో 62 శాతం ప్రజల జీవనధారం వ్యవసాయ రంగం అన్నారు. ఆర్థిక వ్యవస్థకు రైతులు, కౌలు రైతులు ఆయువు పట్టు లాంటి వారన్నారు. గడిచిన నాలుగేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం 52.38 లక్షల కుటుంబాలకు 27 వేల కోట్లు ప్రభుత్వం వివిధ పథకాల కింద రైతులకు అందించిందన్నారు. రాష్ట్ర సిరికల్చర్ రీఛార్జ్ డైరెక్టర్ డాక్టర్ సీతారాములు, వ్యవసాయ శాస్త్ర నిపుణులు డాక్టర్ కృష్ణ, డాక్టర్ శ్రీనాథ్ వ్యవసాయ రంగ ప్రాధాన్యత గురించి వివరించారు. తరువాత రైతులతో ఇష్టా గోష్టి చర్చలు జరిపారు. జిల్లా వ్యవసాయ అధికారి సుబ్బారావు మాట్లాడుతూ జిల్లాలో ప్రస్తుతం సాధారణ విస్తీర్ణం 2.84 లక్షల హెక్టార్లు ఉండగా, ఇప్పటివరకు 65 వేల హెక్టార్లలో రైతులు వివిధ పంటల సాగు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో పట్టు పరిశ్రమ జేడీ పద్మమ్మ, ఏపీ ఎంఐపి పీడీ సుదర్శన్, ఉద్యానవన శాఖ అధికారి చంద్రశేఖర్ సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
జర్నలిస్టులపై కొమ్మినేని అసహనం
రాష్ట్ర ప్రెస్ అకాడమీ ఛైర్మన్ కొమ్మినేని శ్రీనివాసరావు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా పలువురు విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా అసహనం వ్యక్తం చేశారు. అర్హులైన జర్నలిస్టులకు అక్రిడేషన్‌లు ఎందుకు మంజూరు చేయడం లేదని జర్నలిస్టులు ప్రశ్నించారు. 30 ఏళ్లుగా పనిచేస్తున్న జర్నలిస్టులకు అన్యాయం జరిగిందన్నారు. ఒక పత్రికకు మాత్రమే అడిగినన్ని మంజూరు చేస్తున్న ప్రభుత్వ అధికారులు మిగతా పత్రికల పట్ల ఎందుకు వివక్ష చూపుతున్నారని నిలదీశారు. ఈ ప్రశ్నలతో కొమ్మినేని విలేకరులపై అసహనం వ్యక్తం చేశారు. సమస్యలను ప్రభుత్వానికి సిఫార్సు చేస్తామని, ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాలని తాను నిస్సహాయున్ని అని చెప్పి విలేకరుల సమావేశం ముగించారు.










