Nov 02,2023 22:48

మాట్లాడుతున్న తహశీల్దారు మంజునాథరెడ్డి


ప్రజాశక్తి-మార్కాపురం
దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలంటే స్వచ్ఛమైన మనస్సు గల యువతరమే ఓటరుగా బాధ్యతను నిస్పక్షపాతంగా నిర్వహించాలని, ప్రలోభాలకు లోనుకాకుండా అభివృద్ధి కాముకులైన వారిని నాయకులుగా ఎంచుకోవాలని మార్కాపురం తహశీల్దారు డిఎన్‌ మంజునాథరెడ్డి సూచించారు. స్థానిక శ్రీసాధన డిగ్రీ కళాశాలలో గురువారం ఉదయం ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కప్పగంతుల మధుసూదన్‌ అధ్యక్షతన ఏర్పాటు చేసిన 'క్రమబద్దమైన ఓటర్ల విద్యా మరియు ఎన్నికల భాగస్వామ్యం' (స్వీప్‌) కార్యక్రమంలో తహశీల్దారు మంజునాథరెడ్డి, మున్సిపల్‌ కమిషనర్‌ బత్తుల శ్రీనివాస గిరికుమార్‌లు ముఖ్య అతిథులుగా పాల్గొని దేశాభివృద్ధిలో ఓటరుగా విద్యార్థులు యొక్క ముఖ్యమైన భాగస్వామ్యం గురించి సమగ్రమైన అవగాహన కల్పించారు. మంజునాథరెడ్డి మాట్లాడుతూ ఎవరైతే ఓటుహక్కు లేదో వారు డిసెంబర్‌ 9వ తేదీలోగా ఫారం-6ను సమీప బిఎల్‌ఒకు అందజేయాలన్నారు. ఓటరు కార్డులో మార్పులు చేసుకోవాలనుకుంటే ఫారం-8ని సమర్పించాలన్నారు. మున్సిపల్‌ కమిషనర్‌ గిరికుమార్‌ మాట్లాడుతూ విద్యార్థులు మీ యొక్క చదువులను ఎంతగా ఇష్టంగా చదువుతారో అంతే ఇష్టంగా సమాజంలోని పరిస్థితులను కూడా అధ్యయనం చేయాలన్నారు. కళాశాల డైరెక్టర్‌ విఆర్‌కె ప్రసాద్‌ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రిన్సిపల్‌ డాక్టర్‌ మధుసూదన్‌ మాట్లాడుతూ ఎన్నికల పోలింగ్‌ శాతం పెరగాలంటే యువత పాత్ర కీలకం అన్నారు. దేశ పౌరులుగా బాధ్యలను మర్చిపోవద్దని హితవు పలికారు. కార్యక్రమంలో వైస్‌ ప్రిన్సిపల్‌ పి.శ్రీధర్‌కుమార్‌, పరిశోధన విభాగం సమన్వయకర్త డాక్టర్‌ ఎం.శేషుకుమార్‌, కళాశాల ఇన్‌చార్జి డాక్టర్‌ పిఆర్‌కె ప్రసాద్‌, కంప్యూటర్‌ సైన్స్‌ విభాగాధిపతి కె.పవన్‌కుమార్‌, అధ్యాపకులు ఎంవి.రాఘవేంద్ర, ఓ.ఏడుకొండలు, డి.వినోద్‌లు పాల్గొన్నారు.