ప్రజాశక్తి-కూనవరం
కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఎంత ప్రయత్నించినా దేశ సంపదను ప్రైవేటుపరం కానివ్వమని సిపిఎం రాష్ట్ర నాయకులు ప్రసన్నకుమార్ అన్నారు. కేంద్ర బిజెపి ప్రభుత్వ కార్మిక, కర్షక, ప్రజా వ్యతిరేక విధానాలపై సిపిఎం, సిపిఐ కేంద్ర కమిటీల పిలుపు మేరకు నిర్వహిస్తున్న ప్రచార భేరి కార్యక్రమం మండలంలోని రేపాక గ్రామంలో గురువారం జరిగింది. ఇందులో పాల్గొన్న ప్రసన్న కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ సంస్థలను ప్రైవేటుపరం చేస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని అధికారం నుండి దింపి బుద్ధి చెప్పాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. పోలవరం పరిహారం ఇవ్వకుండా ప్రజలను మోసం చేస్తూ ఇంకెన్నాళ్లు పబ్బం గడుపుతుందని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ కొమరం పెంటయ్య, సిపిఎం జిల్లా నాయకులు మేకల నాగేశ్వరరావు, మండల కార్యాదర్శి పాయం సీతారామయ్య, నాయకులు మడకం జ్యోతి, బాబు బొర్రయ్య, మడకం నాగమణి తదితరులు పాల్గొన్నారు.
ఎటపాక : సిపిఎం ఆధ్వర్యాన ప్రచార భేరి కార్యక్రమం గురువారం మండలంలోని గోమ్ముకొత్త గూడెంలో జరిగింది. సిపిఎం నాయకులు వ్యవసాయ కూలీలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రచారభేరి గోడ పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా సిపిఎం నాయకులు మాట్లాడుతూ రోజురోజుకు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయని, పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయని విమర్శించారు. రైతులకు రుణ మాఫీ చేయని ప్రభుత్వాలు, కార్పొరేట్లకు లక్ష కోట్ల రూపాయలు మాఫీ చేస్తున్నాయని తెలిపారు. బిజెపి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మే 4న చింతూరులో జరిగే బహిరంగ సభకు తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు డేగల మాధవరావు, ఆకిశెట్టి రాము, కాపవరం శాఖ కార్యదర్శి తోటకూరి రాంబాబు, గంజి చిన్న పాల్గొన్నారు.
విఆర్.పురం : మండలంలోని ములకలపల్లి పంచాయతీ పరిధి కొత్తపేటలో ప్రచార భేరి కార్యక్రమంలో భాగంలో సిపిఎం నాయకులు ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలు పంచారు. ఉపాధి హామీ ప్రదేశాలను సందర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిపిఎం మండల మండల కార్యదర్శి సోయం చిన్నబాబు, నాయకులు కుంజ నాగిరెడ్డి, వడ్లాది రమేష్ మాట్లాడుతూ ఉపాధి కూలీలకు రోజు వేతనం రూ.600 ఇవ్వాలని, ఏడాదికి 200 రోజులు పని దినాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు శీలం శేఖర్, శీలం నారాయణ, ప్రజలు పాల్గొన్నారు.
డుంబ్రిగూడ : గిరిజన, ప్రజా, కార్మిక వ్యతిరేక మతోన్మాద బిజెపి ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు పోరాడాలని సీపీఎం మండల ప్రధాన కార్యదర్శి ఎస్‌బి పోతురాజు పిలుపునిచ్చారు. మండలంలోని ఆరమ పంచాయతీ బడిమెల, గుంటగన్నెల పంచాయతీ కూనపుట్టు గ్రామాల్లో గురువారం ప్రచార బేరి జీపు జాతా నిర్వహించారు. సిపిఎం నాయకులకు ఆ గ్రామంలో గిరిజనులు సంప్రదాయ బద్ధంగా బొట్టులు పెట్టి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, గిరిజన చట్టాలను ఉల్లంఘిస్తూ హైడ్రోఫవర్ ప్రాజెక్టు నిర్మాణానికి బిజెపి పూనుకుంటుందని తెలిపారు. పాడేరులో జరిగే బహిరంగ సభకు అధిక సంఖ్యలో గిరిజనులు తరలివచ్చి విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు టి.సూర్యనారాయణ, పి.సత్యనారాయణ, పి.దొంబు, వి మహేశ్వరావు, జగన్నాథం, కే,అర్జున్, పి.మోహన్‌దాస్, పి.డోయితరి, గిరిజనులు పాల్గొన్నారు.
అరకులోయ రూరల్ : సీపీఎం, సిపిఐ ఆధ్వర్యంలో ప్రచార బేరిలో భాగంగా ఈనెల 25న అరకులోయలో నిర్వహించే భారి బహిరంగ సభను విజయవంతం చేయాలని మాడగడ పంచాయతీ నందిగుడ, చొంపి గ్రామంలో నాయకులు ప్రచారం చేశారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్ కూలీలు పని చేస్తున్న ప్రాంతంలో సిపిఎం మండల కార్యదర్శి కిండంగి రామారావు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ, మతోన్మాద బిజెపిని అధికారం నుండి గద్దె దించి దేశాన్ని కాపాడుకోవాలని చెప్పారు. స్టీల్ ప్లాంట్, ఎల్‌ఐసి, బిఎస్‌ఎన్‌ఎల్, రైల్వే వంటి ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా బడా పెట్టుబడిదారులకు కట్టబెట్టేందుకు కేంద్రం పూనుకుంటోందని విమర్శించారు. గ్రామ సభ, పిసా కమిటీ తీర్మానం లేకుండా హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణం ఎలా చేస్తారని, తక్షణం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.










