Sep 19,2022 23:48

దీక్షలో కూర్చున్న స్టీల్‌ప్లాంట్‌ ఎస్‌ఎంఎస్‌-1 విభాగ కార్మికులు

   ప్రజాశక్తి-ఉక్కునగరం : దేశంలో ఇద్దరు ముగ్గురు కార్పొరేట్‌ వ్యాపారుల కోసం బిజెపి ప్రభుత్వ పెద్దలు దేశ సంపదను దోచిపెడుతున్నారని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రతినిధులు విమర్శించారు. విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రయివేటీకరణను వ్యతిరేకిస్తూ విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యాన కూర్మన్నపాలెంలోని స్టీల్‌ప్లాంట్‌ ఆర్చి వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు సోమవారం నాటికి 585వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షలో స్టీల్‌ప్లాంట్‌ ఎస్‌ఎంఎస్‌-1 విభాగ కార్మికులు కూర్చున్నారు. ఈ దీక్షలనుద్దేశించి సిఐటియు నాయకులు బి.అప్పారావు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఉత్తరాంధ్ర ప్రాంతంపై చూపుతున్న వివక్షతను విడనాడాలన్నారు. అక్టోబర్‌ 2 గాంధీ జయంతి రోజున విశాఖ సాగరతీరంలో వేలాది మందితో ఉక్కు సత్యాగ్రహ పాదయాత్ర నిర్వహిస్తున్నామని, దీనికి నగరంలో ఉన్న కార్మిక, ప్రజా, విద్యార్థి, యువజన, మహిళా సంఘాలు, కవులు, కళాకారులు, పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 21న గురజాడ అప్పారావు జయంతి సందర్భంగా దీక్షా శిబిరం వద్ద కవి సమ్మేళనం జరుగుతుందని, దీనికి ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి కవులు కళాకారులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సభ్యులు కెఎస్‌ఎన్‌.రావు, ఎంవి.రమణ, డి.కృష్ణమూర్తి, నీరుకొండ రామచంద్రరావు, గుమ్మడి నరేంద్ర, సుబ్బయ్య, వి.సత్యనారాయణ, రంగ ప్రసాద్‌, సాహూ, ఎమ్మెస్సార్‌, కటారి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
స్టీల్‌ప్లాంట్‌తో ఉపాధి...
కలెక్టరేట్‌ : విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రభుత్వ రంగంలో ఉన్నందునే అన్ని తరగతుల వారికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందని సిఐటియు గోపాలపట్నం జోన్‌ కార్యదర్శి బి.వెంకటరావు అన్నారు. స్టీల్‌ ప్లాంట్‌ ఇతర ప్రభుత్వ రంగ సంస్థల ప్రవేటీకరణను వ్యతిరేకిస్తూ జివిఎంసి గాంధీ విగ్రహం వద్ద కార్మిక, ప్రజా సంఘాల జెఎసి చేపట్టిన దీక్షలు సోమవారం నాటికి 536వ రోజుకు చేరాయి. దీక్షల్లో గోపాలపట్నం జోన్‌ తోపుడుబండ్ల సంఘం కార్మికులు కూర్చున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, స్టీల్‌ప్లాంట్‌ను ప్రయివేటు వ్యక్తులకు ధారాదత్తం చేస్తే ఉపాధి అవకాశాలు పూర్తిగా దెబ్బతింటాయని చెప్పారు. ఎన్ని పోరాటాలు చేసైనా స్టీల్‌ ప్లాంట్‌ ప్రభుత్వ రంగంలోనే ఉండేలా కాపాడుకుంటామని చెప్పారు. ఈ దీక్షల్లో తోపుడు బళ్ళ కార్మికులు బి.వాసు, బి.అప్పలనాయుడు, ఎస్‌.చిన్నారావు, కె.శంకరరావు, జె.త్రినాథ్‌ తదితరులు పాల్గొన్నారు.