ప్రజాశక్తి-భవానీపురం: దేశ సేవలో స్కౌట్స్ అండ్ గైడ్స్ ముందుండాలని నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి అన్నారు. బుధవారం భవానీపురంలోని నేతాజీ హైస్కూల్లో 'వరల్డ్ స్కౌట్స్ అండ్ గైడ్స్ థింకింగ్ డే' సెలబ్రేషన్స్ నిర్వహించారు. మేయర్ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం స్కౌట్స్ అండ్ గైడ్స్ ఫౌండర్ రాబర్ట్ స్టీవెన్ సన్ స్మిత్ బెడెన్ పవెల్, ఆయన సతీమణి రీటా స్మిత్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మేయర్‌కు స్కూల్ ప్రిన్సిపల్ కె.అరుణకుమారి పూలమొక్కను బహుకరించారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ స్కౌట్స్, గైడ్స్, ఎన్‌సిసి, ఎన్‌ఎస్‌ఎస్ వంటి విభాగాల్లో విద్యార్థులు చేరి సోషల్ సర్వీస్ కార్యక్రమాల్లో పాల్గొని దేశానికి, రాష్ట్రానికి మంచి సేవలందించాలని కోరారు. ఎపి స్టేట్ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అసిస్టెంట్ స్టేట్ కమిషనర్ డి.ప్రసాద్ మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారిని, తోటి వారిని ఆదుకోవడమే స్కౌట్స్, గైడ్స్ లక్ష్యమని ఆయన అన్నారు. ఈ కార్యక్రమాన్నిఘనంగా నిర్వహించిన నేతాజీ హైస్కూల్ చైర్మన్ కె..తిరుపతిరెడ్డిని ఆయన అభినందించారు. నేతాజీ హైస్కూల్ స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు ప్రతిష్టాత్మకమైన రాజ పురస్కారం అవార్డుకు ఎంపిక అయ్యారని, త్వరలోనే రాష్ట్రపతి చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకుంటారని ఆయన వివరించారు. ప్రముఖ న్యాయవాది బాయన హేరంబకుమార్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో నేతాజీ హైస్కూల్ చైర్మన్ కె.తిరుపతిరెడ్డి, ఏపీబిఎస్‌జి ప్రముఖులు కెపిఆర్‌బి శర్మ, డిఎల్ నారాయణ, ఇండియన్ నేవీ అవార్డు గ్రహీత షేక్ మస్తాన్, రిటైర్డ్ ఆర్మీ అధికారి కే.కే.నరసింహారావు, వరల్డ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ నాయకులు ఎస్కే అబ్దుల్ కరీం, నేతాజీ హైస్కూల్ డైరెక్టర్లు కే.రాజేష్, కే.దినేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్కౌట్స్ అండ్ గైడ్స్‌కు సంబంధించిన ఎగ్జిబిషన్ ఎంతో ఆకర్షణగా నిలిచింది.










