Jun 08,2021 06:50

    మ్మడి జాబితా లోని అంశాలపై తుది అధికారం కేంద్రానిదే అని రాజ్యాంగం పేర్కొంది. ఆర్థిక అధికారాలు కూడా కేంద్రానికే అధికంగా ఉన్నాయి. అందుచేత రాజ్యాంగానికి కట్టుబడి వ్యవహరించాలని విజ్ఞప్తి చేస్తే చాలదు. రాజకీయ శక్తుల సమీకరణలు ప్రాంతీయ శక్తులపై ఆధారపడిన సంకీర్ణ ప్రభుత్వాల ఏర్పాటు కు దారితీసినప్పుడు, ప్రాంతీయ సంస్కృతులు తమ ప్రత్యేకతలను, వైవిధ్యాన్ని నిలుపుకునే విధంగా బలంగా నిలబడినప్పుడు మాత్రమే ఫెడరల్‌ సూత్రాలు అమలు జరిగాయి. అందుకే ఈ చట్టపరమైన, రాజ్యాంగపరమైన పరిధికే పరిమితం కాకుండా ప్రాంతీయ శక్తులు దేశంలో బహుళత్వాన్ని-అటు రాజకీయాలలోను, ఇటు సంస్కృతి లోను-పరిరక్షించే విధంగా ముందడుగులు వేయాలి.
    ఇటీవల నీతి ఆయోగ్‌ లో వైద్య రంగం బాధ్యత చూసే సభ్యుడిగా ఉన్న డా|| వి.కె.పాల్‌ ఒక ప్రకటన చేశారు. కేంద్రం చేతుల్లో తగినంతగా అధికారాలు లేకపోయినందువల్లనే ప్రస్తుతం కోవిడ్‌-19 వ్యాక్సినేషన్‌ కార్యక్రమం సక్రమంగా సాగడం లేదని ఆ ప్రకటనలో అభిప్రాయపడ్డారు. పలు రాష్ట్రాలు ఈ ప్రకటనపై తమ అభ్యంతరాలను వెలిబుచ్చుతున్నాయి. కేంద్రం ప్రకటన నిరాధారంగా ఉన్నట్టు రాష్ట్రాల ప్రతిస్పందనలను బట్టి తేలుతోంది. వి.కె.పాల్‌ ప్రకటన మరిన్ని అధికారాలను కేంద్రం గుప్పెట్లో చిక్కించుకోడానికే అని చాలామంది అర్ధం చేసుకుంటున్నారు. అంతకంతకూ మరిన్ని అధికారాలను కేంద్రీకరించుకునే ప్రయత్నాలు ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఇదివరకటి నుంచీ జోరుగా సాగుతూనే వున్నాయి. అందులో భాగంగానే వి.కె.పాల్‌ ప్రకటనను చూడాలి. రాష్ట్ర ప్రభుత్వాల ప్రధాన బాధ్యతగా ఉన్న ఆరోగ్యం, విద్య, వ్యవసాయం వంటి రంగాలలోకి కేంద్రం చొరబడుతున్న దిశకు అనుగుణంగా వి.కె. పాల్‌ ప్రకటన ఉంది. ''ఒకే దేశం-ఒకే పన్ను'', ''ఒకే మార్కెట్‌'', ''ఒకే రేషన్‌'' వంటి పిలుపులు కూడా ఒకే, కేంద్రీకృత రాజ్యం ఉండాలన్న వాదనను బలపరిచే దిశగా ముందుకు తెస్తున్నారు. అధికారాల కేంద్రీకరణ పరిష్కారంగా చూపుతూ, పరిపాలన సమర్ధవంతంగా ఉండడానికి వీలుగా అధికారాల పంపిణీ ఉండాలన్న మౌలిక అంశాన్ని మరుగుపరుస్తున్నారు.
 

                                                                       కేంద్రం చొరబాటు

   రాష్ట్రాల అధికారాల మీద దాడి ఇదివరలో కూడా జరిగింది. గవర్నరును అడ్డం పెట్టుకుని ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను బర్తరఫ్‌ చేయడం పలు సందర్భాలలో చూశాం. రాష్ట్రాల పరిధిలోనే ఉంటూ వచ్చిన విద్య ను ఎమర్జెన్సీ రోజుల్లో ఉమ్మడి జాబితాలో చేర్చారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న మార్పులు ఒకటి, రెండు అంశాలకే పరిమితంగా గాక, మొత్తం ఫెడరల్‌ వ్యవస్థ పైనే దాడిలో భాగంగా జరుగుతున్నాయి. ఆర్థిక వనరుల కేటాయింపులో కేంద్రం అంతకంతకూ ఎక్కువ వాటా తీసుకోవడం, సంక్షేమ కార్యక్రమాలలో నేరుగా కేంద్రం జోక్యం చేసుకోవడం జరుగుతోంది. రాష్ట్రాలకు వచ్చే ఆదాయాలకు, అవి చేయవలసిన ఖర్చులకు మధ్య అంతరం పెరిగిపోతోంది. ముఖ్యంగా జిఎస్‌టి ప్రవేశ పెట్టాక ఈ అంతరం మరీ పెరిగింది. జిఎస్‌టిలో రాష్ట్రాలకు ఈ ఏడాది వచ్చిన ఆదాయం తగ్గిపోయింది. దానిని కేంద్రం భర్తీ చేయాలన్న డిమాండ్‌ రాష్ట్రాల నుండి వచ్చినా, కేంద్రం స్పందించలేదు.
   ఇంకోవైపు విద్య, వైద్యం తదితర రంగాలలో 85 నుండి 82 శాతం వరకూ ఖర్చును రాష్ట్రాలు భరించాల్సి వుండగా ఆ రంగాలమీద కేంద్రం నేరుగా సాగించే పెత్తనం మాత్రం నానాటికీ పెరుగుతోంది.
 

                                            రాష్ట్ర ప్రభుత్వాలు - పెట్టుబడిదారుల నడుమ సంబంధాలు

   కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాలు నడిచిన కాలంలో ప్రాంతీయ పెట్టుబడులు పుంజుకున్నాయి. ఇప్పుడు కేంద్రంలో బిజెపి అధికారంలోకి వచ్చాక బిజెపితో సత్సంబంధాలను పెంచుకోవడం తమ వ్యాపారాలకు కీలకం అని పెట్టుబడిదారులు గుర్తించారు. అటువంటి సంబంధాలను పెట్టుకోగలిగిన బాబా రాందేవ్‌ లాంటివారి వ్యాపార సామ్రాజ్యాలు ఈ కాలంలో ఏ విధంగా విస్తరించాయో చూస్తే ఈ విషయం స్పష్టం అవుతుంది. అదే సమయంలో దక్షిణ భారత దేశంలో పెట్టుబడిదారుల గ్రూపుల వ్యాపార కార్యక్రమాలు తగ్గుతూ వస్తున్నాయి.
   బిజెపికి బాగా సన్నిహితంగా ఉంటున్న కొద్దిమంది బడా పెట్టుబడిదారుల గ్రూపులు ఈ కాలంలో ఏవిధంగా బలపడి విస్తరిస్తున్నాయో మనం చూస్తున్నాం. ఈ క్రమంలో చిన్న పెట్టుబడిదారులు దెబ్బ తింటున్నారు. ఆర్‌సిఇపి వంటి అంతర్జాతీయ ఒప్పందాలలో మన దేశం గనుక భాగస్వామి అయితే విదేశీ బహుళజాతి సంస్థలతో మన బడా పెట్టుబడిదారులు పోటీ పడవలసి వస్తుంది. అందుకే బిజెపి ప్రభుత్వం ఆర్‌సిఇపి లో చేరేందుకు నిరాకరించింది. బడా పెట్టుబడిదారుల ప్రయోజనాలను కాపాడేందుకే ఆ విధంగా చేసింది. అదే చిన్న పెట్టుబడిదారుల విషయంలో భిన్నంగా వ్యవహరించింది. ఒకే జాతీయ మార్కెట్‌ ఉండాలన్న పేరుతో జిఎస్‌టి ని అమలు చేసింది. దీనివలన బడా పెట్టుబడిదారులకే ఎక్కువ ప్రయోజనం కలిగింది. చిన్న పెట్టుబడిదారులు, ప్రాంతీయ పెట్టుబడిదారులు నష్టపోయారు. రాష్ట్రాలకు పెట్టుబడిదారులకు నడుమ ఉన్న సంబంధాలను కేంద్ర ప్రభుత్వం బలహీన పరిచింది. చిన్న పెట్టుబడిదారులకు, చొరవగా ముందుకు రాదలచిన కొత్తవారికి ఇది అవరోధంగా మారింది.
   గనుల కాంట్రాక్టులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు వంటి కొన్ని తరగతుల వారు ఇంతవరకూ రాష్ట్రాలలో అధికార పార్టీలకు విరాళాలు ఇచ్చే ఆదాయ వనరుగా ఉండేవారు. అటువంటి వారిపై కేంద్ర ఏజన్సీలను (ఐ.టి, ఇ.డి వగైరా) ప్రయోగించి అవినీతి ఆరోపణలను ముందుకు తెచ్చి బిజెపి వారందరినీ అదుపు చేసింది. దీనివలన ప్రాంతీయ పార్టీల ఆదాయ వనరులు తగ్గిపోయాయి. కేంద్ర బిజెపి తో ఎన్నికలలో పోటీపడి ఖర్చు చేయగల సామర్ధ్యం తగ్గిపోయింది.
 

                                                           వ్యవస్థలను అతిక్రమించడం

   కేంద్రం చేతుల్లో ఉన్న అధికారాలను, శాసనాధికారాలను ఉపయోగించుకుని కీలక పదవులలో తమ అనుయాయులను నియమించుకుంటోంది బిజెపి. ప్రతిపక్షాలను ఇరుకున పెట్టడం కోసం ఇన్‌కంటాక్స్‌ డిపార్టుమెంట్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌, నేషనల్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజన్సీ వంటి సంస్థలను వాడుకుంటోంది.
    ఉదాహరణకు రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో నడిచే యూనివర్సిటీలకు వైస్‌ ఛాన్స్‌లర్లుగా తమ అనుయాయులే నియమితులయ్యేలా ఒత్తిడి తెస్తోంది కేంద్రం. ఇంకో పక్క సంక్షేమ పథకాల లబ్ధిదారులకు కేంద్రమే నేరుగా సహాయం అందించే ప్రయత్నాలు చేస్తోంది. ఆయా విభాగాల రాష్ట్ర కార్యదర్శులతో, జిల్లాల కలెక్టర్లతో నేరుగా కేంద్రం సమావేశాలు జరుపుతోంది. వాస్తవానికి వారంతా రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో వ్యవహరించవలసిన అధికారులు. ఇటీవల కేంద్ర విద్యామంత్రి రమేష్‌ పోఖ్రియాల్‌ నేరుగా రాష్ట్రాల విద్యాశాఖల కార్యదర్శులతో నూతన విద్యా విధానం అమలు గురించి సమావేశం నిర్వహించడం ఇందుకొక ఉదాహరణ.
    రాష్ట్రాల పరిధుల్లోకి కేంద్రం చొరబడడానికి ఆ రాష్ట్రాల గవర్నర్ల సహకారం కూడా లభిస్తోంది. రాజ్యాంగం గవర్నర్లకు నిర్దేశించిన నామమాత్రపు పాత్ర పరిధులను దాటి పాలనా వ్యవహారాల్లో నేరుగా జోక్యం చేసుకుంటున్నారు.
రాష్ట్రాలు తమ తమ ప్రత్యేక పరిస్థితులకు అనుగుణంగా నిర్వహించుకునే పోటీ పరీక్షల విషయంలో కూడా కేంద్రం జోక్యం చేసుకుంటోంది. రాష్ట్రాల మధ్య అంతరాలు ఎక్కువగానే ఉన్నా అందరికీ ఒకే ప్రమాణాలు వుండాలన్న వాదనతో బలవంతంగా రుద్దిన 'నీట్‌' పరీక్ష దీనికొక ఉదాహరణ.
మొదటి విడత కరోనా విజృంభించినప్పుడు ఏ రాష్ట్రాన్నీ సంప్రదించకుండానే ఏకపక్షంగా నాలుగు గంటల వ్యవధిలో జాతీయ లాక్‌డౌన్‌ విధించడం కూడా రాష్ట్రాల హక్కుల అతిక్రమణే. వైద్య, ఆరోగ్య రంగం ప్రధానంగా రాష్ట్రాల బాధ్యత. ఇప్పుడు వ్యాక్సిన్‌ వినియోగం విషయంలో కూడా ఏకపక్షంగా కేంద్రం రాష్ట్రాల అభిప్రాయాలతో నిమిత్తం లేకుండా వ్యవహరిస్తోంది. వేరువేరు ధరలను నిర్ణయించింది.
 

                                                             సామాజిక-సాంస్కృతిక పునాది

   వివిధ ప్రాంతాల్లో ఉన్న సాంస్కృతిక వైవిధ్యం మన ఫెడరలిజానికి ఒక పునాదిగా ఉంది. ప్రాంతీయ అస్థిత్వాలు, భిన్నత్వాలు, భిన్న సంస్కృతీ సాంప్రదాయాలు బిజెపి తలపెట్టిన ''ఒకే దేశం-ఒకే సంస్కృతి-ఒకే భాష'' వంటి వ్యూహానికి అడ్డంగా ఉన్నాయి. అందుకే బిజెపి ఇప్పుడు ఈ ప్రాంతీయ సంస్కృతులను, వైవిధ్యాన్ని దెబ్బతీసే కొత్త వ్యూహాన్ని ముందుకు తెస్తున్నది. దేశవ్యాప్తంగా ఒకే సంస్కృతి ఉన్నదని, అదే హిందూ సంస్కృతి అని ప్రచారం చేస్తున్నది. తమిళ సంస్కృతి మొదటి నుండీ వైదిక సంస్కృతికి భిన్నంగా, విలక్షణంగా ఉంది. ఆ గత వారసత్వాన్ని తిరస్కరిస్తూ తమిళ హిందువులు వైదిక సంస్కృతికి ప్రతినిధులని...తమిళ ముస్లింలు, తమిళ క్రైస్తవులు పరాయివారని వాదన ముందుకు తెస్తోంది. అంటే తమిళనాడు లోని ముస్లింల, క్రైస్తవుల తమిళ సంస్కృతి వారసత్వాన్ని వారికి లేకుండా నిరాకరిస్తోంది. ఇంకోవైపు తమిళ హిందువులను కూడా వారి సహజ, తమిళ సంస్కృతి నుండి దూరం చేసి ప్రత్యేక తమిళ అస్థిత్వాన్ని దెబ్బ తీస్తోంది. ఇదే విధంగా మలయాళీలలో ముస్లింల, క్రైస్తవుల మలయాళ సంస్కృతి వారికి కాకుండా పోతుంది. బెంగాల్‌ లోని ముస్లిం, క్రైస్తవ ప్రజలు బెంగాలీయులు కాకుండా పోతారు. అస్సాం లోనూ ఇతర రాష్ట్రాలలోనూ అదే పరిస్థితి. 'సోనార్‌ బంగ్లా' నినాదం ప్రాచీన హిందూ సంస్కృతిలో భాగమని, దానికి ముస్లింలకు, క్రైస్తవులకు సంబంధం లేదని ఇటీవల జరిగిన ఎన్నికలలో బిజెపి ప్రచారం చేసింది.
 

                                                                       కీలకాంశాలు

     ఈ విధంగా ఫెడరల్‌ సాంప్రదాయాలను కాలరాయడం రాజ్యాంగ విరుద్ధం అంటూ విజ్ఞప్తులు చేస్తే సరిపోదు. ప్రాంతీయ రాజకీయ శక్తులు తమ సత్తా చాటాలి. వాస్తవానికి మన రాజ్యాంగంలోనే ఫెడరలిజాన్ని నీరుగార్చేందుకు అవకాశాలు కల్పించబడ్డాయి. రాజ్యాంగంలో స్పష్టంగా నిర్వచించబడని అంశాలన్నింటిలోనూ కేంద్రానిదే అధికారం అని చెప్పారు (రెసిడ్యుయరీ పవర్స్‌). ఉమ్మడి జాబితా లోని అంశాలపై తుది అధికారం కేంద్రానిదే అని రాజ్యాంగం పేర్కొంది. ఆర్థిక అధికారాలు కూడా కేంద్రానికే అధికంగా ఉన్నాయి. అందుచేత రాజ్యాంగానికి కట్టుబడి వ్యవహరించాలని విజ్ఞప్తి చేస్తే చాలదు. రాజకీయ శక్తుల సమీకరణలు ప్రాంతీయ శక్తులపై ఆధారపడిన సంకీర్ణ ప్రభుత్వాల ఏర్పాటుకు దారితీసినప్పుడు, ప్రాంతీయ సంస్కృతులు తమ ప్రత్యేకతలను, వైవిధ్యాన్ని నిలుపుకునే విధంగా బలంగా నిలబడినప్పుడు మాత్రమే ఫెడరల్‌ సూత్రాలు అమలు జరిగాయి. అందుకే ఈ చట్టపరమైన, రాజ్యాంగపరమైన పరిధికే పరిమితం కాకుండా ప్రాంతీయ శక్తులు దేశంలో బహుళత్వాన్ని-అటు రాజకీయాలలోను, ఇటు సంస్కృతి లోను-పరిరక్షించే విధంగా ముందడుగులు వేయాలి.
 

(వ్యాసకర్తలు మద్రాసు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డెవలప్‌మెంట్‌ స్టడీస్‌ ప్రొఫెసర్లు)
ఎ. కలైరాసన్‌

ఎ. కలైరాసన్‌
 

ఎం. విజయభాస్కర్‌

ఎం. విజయభాస్కర్‌