- ఆర్మీలో చేరి దేశానికి సేవ చేయాలి
- ఎఎస్‌పి టి.పి విఠలేశ్వరరావు పిలుపు
ప్రజాశక్తి - శ్రీకాకుళం అర్బన్: యువత ఆర్మీలో చేరి దేశానికి సేవ చేయాలని ఎఎస్‌పి టి.పి విఠలేశ్వరరావు పిలుపునిచ్చారు. నగరంలోని ఇండియన్ ఆర్మీ కాలింగ్ క్యాంపస్‌లో కార్గిల్ విజరు దివస్ కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ముందుగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం న్యూ బ్లడ్ బ్యాంకు ఆధ్వర్యాన ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1999 ఏప్రిల్‌లో కార్గిల్ యుద్ధంలో సైనికులు తమ ప్రాణాలను పణంగా పెట్టి పోరాడారని గుర్తుచేశారు. పాకిస్థాన్ దళాలు, తీవ్రవాదులు ఆక్రమించిన కార్గిల్‌లోని అన్ని సైనిక పోస్టులను తిరిగి స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. అప్పట్నుంచీ ప్రతి ఏడాది జూలై 26న కార్గిల్ విజరు దివస్ నిర్వహించుకుంటున్నట్లు వివరించారు. మన దేశాన్ని రక్షిస్తూ కార్గిల్‌లో అమరులైన వీర జవాన్లకు శ్రద్ధాంజలి ఘటించారు. ప్రముఖ గైనిక్ వైద్య నిపుణులు దానేటి శ్రీధర్ లైబ్రరీని ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సైనికుల సేవలను దేశం ఎప్పటికీ మరిచిపోదన్నారు. దేశం కోసం ప్రాణాలర్పిస్తున్న సైనికులే నిజమైన హీరోలని అన్నారు. అనంతరం ఎఎస్‌పితో పాటు పలురంగాల్లో సేవలందిస్తున్న వారిని సత్కరించారు. కార్యక్రమంలో హారికా కన్‌స్ట్రక్షన్స్ అధినేత హారికా ప్రసాద్, ఇంటాక్ ప్రతినిధి వి.జగన్నాథం నాయుడు, ప్రెస్‌క్లబ్ అధ్యక్షులు కొంక్యాన వేణుగోపాల్, స్టార్ వాకర్స్ క్లబ్ అధ్యక్షులు ఎస్.జోగినాయుడు, సంఘ సేవకులు మంత్రి వెంకటస్వామి, ఇండియన్ ఆర్మీ మేజర్ సుబేదార్ డి.విష్ణుమూర్తి, సబార్డినేటర్ రవికుమార్, ఎస్‌ఐ ప్రవళ్లిక, కొల్లి విశ్వనాథం, వాసుదేవరావు తదితరులు పాల్గొన్నారు.










