
ప్రజాశక్తి - భీమవరం
మతోన్మాద శక్తుల నుంచి దేశాన్ని రక్షించుకునేందుకు ప్రజలందరూ ఐక్యమవ్వాలని దళిత, ప్రజా సంఘాల జిల్లా నాయకులు పిలుపునిచ్చారు. బుధవారం అంబేద్కర్ చౌక్ వద్ద కెవిపిఎస్, వ్యవసాయ కార్మిక సంఘం, ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ, దళిత ప్రజా సంఘాల ఆధ్వర్యంలో క్విట్ ఇండియా స్ఫూర్తితో క్విట్ కులోన్మాదం, క్విట్ మతోన్మాదం నినాదంతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.క్రాంతిబాబు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలోకొచ్చిన మోడీ ప్రభుత్వం దళితులు, గిరిజనులపై మనువాద, మతోన్మాద విధానాలను శరవేగంగా అమలుచేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. క్విట్ ఇండియా స్ఫూర్తితో మతోన్మాద శక్తులను గద్దె దించేలా ప్రజలందరూ ఐక్యం కావాలన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జక్కం శెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ ఎనిమిదేళ్లుగా అధికారంలో ఉన్న మోడీషా వ్యూహం దేశానికే ప్రమాదకరంగా మారుతోందన్నారు. దళిత ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు గంటా సుందర్ కుమార్, సిఐటియు జిల్లా కార్యదర్శి డి.కళ్యాణి మాట్లాడుతూ మహిళలను మనుషులుగా చూడని మనువాద సిద్ధాంతాన్ని అమలు చేస్తున్నారని విమర్శించారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి డి.పెద్దిరాజు, డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి జి.ధనుష్ మాట్లాడుతూ మోడీ పాలనలో నిరుద్యోగ సమస్య మరింత అధికమైందన్నారు. విశ్వ విద్యాలయాల్లో సైతం కులం, మతం పేరుతో విద్యార్థులను రెచ్చగొడుతూ ఘర్షణలు సృష్టిస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బాతిరెడ్డి జార్జి, మహిళా కన్వీనర్ జక్కంశెట్టి వెంకటలక్ష్మి, జిల్లా నాయకులు శేషపు అశ్రియ్య, కెవిపిఎస్ నాయకులు బాతు రామస్వామి, ఎపి బహుజన జెఎసి రాష్ట్ర కో ఛైర్మన్ దుండి అశోక్, ఖండవల్లి వెంకన్న, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకులు ప్రసాద్, గణేష్, డివైఎఫ్‌ఐ జిల్లా నాయకులు రాపాక రమేష్, సిఐటియు నాయకులు కోదండం పాల్గొన్నారు.
ఉండి : క్విట్ ఇండియా స్ఫూర్తితో మతోన్మాదంపై యువత పోరాడాలని కెవిపిఎస్ మండల కార్యదర్శి మాదాసి గోపి పిలుపునిచ్చారు. పాందువ్వలో అంబేద్కర్ విగ్రహం వద్ద మణిపూర్‌లో జరుగుతున్న అత్యాచారాలకు నిరసనగా మతోన్మాదం దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం మతోన్మాద ఎజెండాను శరవేగంగా అమలు చేస్తూ ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ మత ఘర్షణలు ప్రేరేపిస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో కెవిపిఎస్ సభ్యులు ఎం.ప్రశాంత్, ఎస్.రాజేష్, మోహన్, ఎస్.బాలాజీ, ఇజ్రాయిల్, పి.రామారావు, ఒ.నాగేశ్వరరావు పాల్గొన్నారు.
గణపవరం :క్విట్ ఇండియా దినోత్సవం సందర్భంగా కెవిపిఎస్ మండల కమిటీ ఆధ్వర్యంలో పిప్పర అంబేద్కర్ విగ్రహం వద్ద కుల మతోన్మాద దిష్టిబొమ్మను నాయకులు బుధవారం దహనం చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభకు నత్తా సుబ్బారావు అధ్యక్షత వహించారు. అనంతరం కెవిపిఎస్ మండల కార్యదర్శి చిన్నం చిన నాగేశ్వరరావు మాట్లాడుతూ క్విట్ ఇండియా స్ఫూర్తితో ప్రజలందరూ మతోన్మాదాన్ని వ్యతిరేకించాలన్నారు. సిఐటియు మండల అధ్యక్షులు మేడిశెట్టి పెంటారావు మాట్లాడుతూ మత విధ్వేషాలను ప్రజలు తిప్పికొట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో కట్టూరి ప్రసాద్, ఎ.చినబాబు, ఎరిచర్ల సతీష్ పాల్గొన్నారు.