Apr 29,2023 00:36

అచ్యుతాపురంలో మాట్లాడుతున్న ప్రభావతి

ప్రజాశక్తి-అచ్యుతాపురం:రాబోయే ఎన్నికల్లో కేంద్రంలోని బిజెపి, మోడీ ప్రభుత్వాన్ని ఓడిస్తేనే ప్రజలకు, దేశానికి రక్షణ అని సిపిఎం, సిపిఐ నాయకులు అన్నారు. మోడీ ప్రభుత్వ ప్రజా, కార్మిక, కర్షక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సిపిఎం, సిసిఐ కేంద్ర కమిటీల పిలుపు మేరకు నిర్వహించిన ప్రచార భేరి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం అచ్యుతాపురం తహశీల్దారు కార్యాలయం మీదుగా సంతబయలు వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కెఎస్‌ఆర్‌ ఫంక్షన్‌ హాల్లో సిపిఎం మండల కార్యదర్శి ఆర్‌.రాము అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బి.ప్రభావతి మాట్లాడుతూ దేశంలో బిజెపి మోడీ విధానాలతో పేద అట్టడుగు వర్గాల ప్రజల జీవితాలు నాశనమయ్యాయన్నారు. అంబానీ, అదాని వంటి కార్పొరేట్‌ శక్తులకు దేశ సహజ వనరులను ధారాదత్తం చేసి భవిష్యత్‌ తరాలకు లేకుండా చేస్తున్నారని విమర్శించారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి, ఈ తొమ్మిదేళ్లలో ఉన్న ఉపాధికే ఎసరు పెట్టారన్నారు. కుల మతాల పేరుతో ప్రజల మధ్య చిచ్చిన రేపుతూ, బిజెపి విధానాలు వ్యతిరేకించే వారిపై భౌతిక దాడులు, హత్యలు, హత్యాచారాలు, నిర్బంధ చర్యలకు పూనుకుంటుందని విమర్శించారు. సిపిఐ అనకాపల్లి జిల్లా కార్యదర్శి బాలేపల్లి వెంకటరమణ మాట్లాడుతూ దేశంలో మోడీని తరిమికొట్టాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. రాష్ట్రంలోని వైసీపీ మోడీ విధానాలకు పార్లమెంటులో చేతులెత్తి సమర్ధిస్తుందని, ఇందులో భాగంగానే గంగవరం పోర్టు అమ్మకం, రైల్వే స్టేషన్‌ నమ్మకం, రైతులకు స్మార్ట్‌ మీటర్ల బిగింపు వంటి చర్లన్నీ అమలవుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు రుత్తల శంకర్రావు, వివి.శ్రీనివాసరావు, ఆళ్ల మహేశ్వరరావు, ఎస్‌.బ్రహ్మాజీ, జి.దేముడునాయుడు, కె.సోమునాయుడు, సిపిఐ నాయకులు రాజాన దొరబాబు, మాధవరావు, సన్యాసిరావు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
కేంద్రంలో బిజెపి నిరంకుశ పాలన
నర్సీపట్నంటౌన్‌: ప్రచార భేరి ముగింపు సభ సందర్భంగా సిపిఐ సిపిఎం ఆధ్వర్యంలో స్థానిక ఎన్జీవో హౌంలో బహిరంగ సభను ఏర్పాటు చేశారు. సిపిఎం జిల్లా సభ్యులు డి.సత్తిబాబు అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సభలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జె.వి సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ, బిజెపి ప్రభుత్వం పేదలపై పన్నుల భారం వేసి కార్పొరేట్‌ సంస్థలను పోషిస్తుందన్నారు. ప్రతీ ఒక్కరూ గొంతెత్తి కేంద్ర ప్రభుత్వ దుర్మార్గాలను నిలదీయాల్సిన సమయమిదేనని పిలుపునిచ్చారు. ప్రశ్నించే ప్రతీ ఒక్కరినీ నిరంకుశంగా అణచి వేసేందుకు కుట్రలు చేస్తున్నారన్నారు. కార్పొరేట్‌ సంస్థల బ్యాంకు రుణాలను మాఫీ చేసిన బిజెపి రైతులకు వ్యవసాయ రుణాలను మాత్రం మాఫీ చేయలేదన్నారు.
సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం.జగ్గు నాయుడు మాట్లాడుతూ, గంగవరం, కృష్ణపట్నం వంటి కీలకమైన ఓడరేవులను, హైడ్రో విద్యుత్తు ప్రాజెక్టుల కోసం విలువైన భూములను సైతం అదానికి మోడీ సమర్పిస్తున్నారన్నారు. మైనారిటీలు, దళితులు, గిరిజనులు, మహిళలు, అణగారిన వర్గాల రక్షణ కోసం ఐక్య ఉద్యమాన్ని నిర్మించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. మతోన్మాద మోడీ ప్రభుత్వాన్ని సాగనంపు దామని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి బాలేపల్లి వెంకట రమణ, సిపిఎం జిల్లా కార్యదర్శివర్గసభ్యులు ఎం. అప్పలరాజు, నాయుకులు సాపిరెడ్డి నారాయణముర్తి, కెవి సూర్యప్రభ, అడిగర్ల రాజు, ఎల్‌.గౌరీ, ఎవైఎఎప్‌ నాయుకులు రాధాకష్ణ, సిపిఐ జిల్లా సహయ కార్యదర్శి రాజాన దొరబాబు, నాయుకులు శివలంక కొండలరావు, తదిరులు పాల్గొన్నారు.
బిజెపిని ఓడించాలి: లోకనాథం
పాయకరావుపేట:పట్టణంలోని స్థానిక పంచాయతీ కార్యాలయం ఎదురుగా సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో ప్రచార బేరి సభను గురువారం రాత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కే.లోకనాథ్‌ మాట్లాడుతూ, 2024లో జరిగే ఎన్నికల్లో బిజెపిని ఓడిస్తేనే దేశానికి పట్టిన మోడీ, అదానీ పీడ వదులుతుందన్నారు.రాష్ట్రంలోని వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు మోడీని భుజాలపై మోస్తున్నాయని, ఆ పల్లకీని దించి రాష్ట్ర భవిష్యత్‌ కోసం రాజకీయ పోరాటంలో కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్యం, మత సామరస్యం, సమాఖ్య స్ఫూర్తి, రాష్ట్రాల హక్కులకు బిజెపి తూట్లు పొడుస్తుందని దుయ్యబట్టారు.
సిపిఐ జాతీయ సమితి కార్యదర్శి రావు జగ్గారావు మాట్లాడుతూ, రాష్ట్రంలో బిజెపి, వైసిపి కలిసి ముందుకు సాగుతున్నాయని విమర్శించారు. విశాఖ ఉక్కుకు ప్రజలు ప్రాణాలు అర్పించారని గుర్తు చేశారు. దేశంలో మోడీకి 30 మంది దత్తపుత్రులుండగా, వారిలో 29 మంది దేశం వదిలి విదేశాలకెళ్లి పోయారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.అప్పలరాజు, కోటేశ్వరరావు, సిపిఐ నేతలు జగ్గారావు, అర్జున్‌ రావు, సుబ్బలక్ష్మి, శివ ప్రకాష్‌ పాల్గొన్నారు.