Sep 22,2022 00:12

పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న జగ్గునాయుడు, గంగరావు, కుమార్‌, కృష్ణారావు

ప్రజాశక్తి- ఎంవిపి కాలనీ : ప్రజలపై బిజెపి ప్రభుత్వ దాడులు ప్రతిఘటించే క్రమంలో సిపిఎం తలపెట్టిన దేశరక్షణ భేరికి సంబంధించిన పోస్టర్‌ను మద్దిలపాలెంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి ఎం.జగ్గునాయుడు మాట్లాడుతూ, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ప్రజలపై ఎడాపెడా భారాలు వేస్తోందని, ప్రభుత్వరంగ సంస్థలను ధ్వంసం చేస్తోందని, నిరుద్యోగాన్ని పెంచుతోందని, నూతన విద్యా విధానంతో పేదలను విద్యను దూరంచేస్తోందని, కార్మిక చట్టాలపై వేటు వేసి ప్రజల సంపదను అదానీ, అంబానీ వంటి బడా కార్పొరేట్లకు దోచిపెడుతోందని విమర్శించారు. రాష్ట్రాల హక్కులను హరిస్తోందన్నారు. భారత రాజ్యాంగంపై దాడిని తీవ్రం చేసిందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ దాడికి తోడు వైసిపి ప్రభుత్వం విద్యుత్‌, ఆర్‌టిసి ఛార్జీలు, ఆస్తి పన్ను పెంపుతోపాటు కొత్తగా చెత్త పన్ను వేసిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. బిజెపి, వైసిపి పాలకులు ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మోడీ నుంచి దేశ ప్రజలను, దేశాన్ని కాపాడుకోవడం కోసం సిపిఎం సెప్టెంబరు 14 నుంచి 27వ తేదీ వరకు దేశ రక్షణ భేరి నిర్వహిస్తోందని తెలిపారు. దీని ముగింపు కార్యక్రమం సెప్టెంబర్‌ 27న మధ్యాహ్నం 3 గంటలకు సరస్వతి పార్కు నుంచి ఆర్‌టిసి కాంప్లెక్స్‌ వరకు మహా ప్రదర్శన, అనంతరం సభ నిర్వహిస్తామని చెప్పారు. ఈ సభకి ముఖ్యవక్తగా సిపిఎం పొలిట్‌ భ్యురో సభ్యులు బివి రాఘవులు హాజరు కానున్నారని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో విశాఖ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని విజ్ఞప్తిచేశారు. ఈ కార్యక్రమంలో ఆర్‌కెఎస్‌వి.కుమార్‌, కృష్ణారావు, కార్పొరేటర్‌ డాక్టర్‌ బి.గంగారావు పాల్గొన్నారు.