Sep 23,2022 23:36

ప్రచార కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎం.రాంబాబు

ప్రజాశక్తి-యంత్రాంగం
కేంద్రలోని బిజెపి ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 27 చేపట్టే సిపిఎం దేశ రక్షణ భేరి బహిరంగసభను జయప్రదంచేయాలని కోరుతూ శుక్రవారం పలుచోట్ల పార్టీ నాయకులు ప్రచారం, పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు.
పెందుర్తి : పెందుర్తి ఉప్పరకాలనీలో పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు జగన్‌ మాట్లాడుతూ, మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వంటగ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌, నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. స్టీల్‌ప్లాంట్‌, రక్షణ రంగం, ఒఎన్‌జిసి, హెచ్‌పిసిఎల్‌, ఐఒసి, బిఎస్‌ఎన్‌ఎల్‌, విద్యుత్‌, బిపిసిఎల్‌, ఎల్‌ఐసి, బ్యాంకులు, పోర్టులు తదితరాలన్నింటినీ ప్రయివేటీకరణ చేసే పనిలో ఉన్నారని విమర్శించారు. అగ్నిపథ్‌ పేరుతో సైన్యాన్ని సైతం ధ్వంసం చేస్తున్నారన్నారు. కార్మిక చట్టాలను లేబర్‌ కోడ్స్‌గా మార్చి కార్మికులను యజమానులకు కట్టు బానిసలుగా చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జోన్‌ కార్యదర్శి బి.రమణి, నాయకులు సూర్యప్రకాష్‌, అప్పలనాయుడు, కాలనీవాసులు పాల్గొన్నారు.
గాజువాక : 71వ వార్డు పరిధి విశ్వేశ్వరాయనగర్‌, శ్రీనగర్‌ ప్రాంతాల్లో సిపిఎం గాజువాక జోన్‌ కార్యదర్శి ఎం.రాంబాబు ఆధ్వర్యాన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ, దేశ రక్షణకు ఈ నెల 27న చేపట్టే మహాప్రదర్శనను జయప్రదం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కార్మికులు, పేద ప్రజలు, రైతులపై భారాలే వేసిందన్నారు. ప్రభుత్వ రంగ పరిశ్రమలను కార్పొరేట్‌ సంస్థలకు అమ్మాలని కంకణం కట్టుకుందని విమర్శించారు. దీనిపై కార్మికులు, రైతులు, ప్రజలు, మేధావులు పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో కె.తాతారావు, సత్తిబాబు, లక్ష్మణరావు, చిన్నంనాయుడు పాల్గొన్నారు.