దేశ అభివవృద్ధిలో మహిళల పాత్ర కీలకం
- మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు
- ఐపిఎస్ ఉమెన్ వెల్ఫేర్ అసోసియేషన్
- ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్
దేశ అభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని, ప్రతి ఒక్కరూ మహిళలను గౌరవించాలని ఐపిఎస్ ఉమెన్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి విజయ రాణి సెంథీల్ కుమార్, సభ్యులు కె.కళ్యాణి రఘువీర్ రెడ్డి తెలిపారు. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఐపిఎస్ ఉమెన్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు కె.గీతిక రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం నంద్యాల జిల్లా కేంద్రంలోని సౌజన్య ఫంక్షన్ హాల్లో వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథులుగా ఉమెన్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి విజయ రాణి సెంథీల్ కుమార్, సభ్యులు కె.కళ్యాణి రఘువీర్ రెడ్డి హాజరై మాట్లాడారు. అమెరికాలో 1908లో కార్మిక ఉద్యమం ప్రారంభమైందని, ఆ ఉద్యమంలో దాదాపు 15 వేల మంది మహిళలు పాల్గొన్నారన్నారు. వారంతా తమ హక్కులను డిమాండ్ చేస్తూ న్యూయార్క్ వీధుల్లోకి ఒక్క సారిగా వచ్చారని, పని గంటలు తగ్గించి వేతనాలు పెంచాలన్నది శ్రామిక మహిళల డిమాండ్‌గా ఆనాడు పోరాడి సాధించుకున్నారని తెలిపారు. ఈ ఉద్యమంలో మహిళలకు ఓటు హక్కు కల్పించాలనే డిమాండ్లు కూడా చేశారని చెప్పారు. దీంతో అప్పటి ప్రభుత్వం వారి కష్టాలను దృష్టిలో పెట్టుకుని పరిష్కారం దిశగా మార్పులు చేసిందని, 1909లో సోషలిస్ట్ పార్టీ ఆఫ్ అమెరికా మహిళా దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రకటించిందని తెలిపారు. దేశ అభివృద్ధిలో పురుషులతో పాటు సమానంగా మహిళలు రాణిస్తున్నారన్నారు. అయినప్పటికీ చాలా దేశాల్లో మగవారితో సమానమైన గౌరవం, అవకాశాలు స్త్రీలకు లభించడం లేదని, కొన్ని దేశాల్లో మహిళలు కటుంబమనే నాలుగు గోడల మధ్యే నలిగిపోతున్నారని ఆవేదన చెందారు. చాలా దేశాలు మహిళలను క్రీడా, రాజకీయాల, రక్షణ మంత్రిత్వ శాఖ, సైనిక రంగాలంలో ప్రోత్సహించడానికి సహాయ సహాకారాలు అందిస్తున్నారన్నారు. మహిళల రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేకంగా రూపొందించిన దిశ యాప్‌ను ప్రతి ఒక్కరూ డౌన్లోడ్ చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. దిశ యాప్ వల్ల ఆపద సమయంలో మన వద్ద ఒక పోలీస్ రక్షణగా ఉన్నాడన్న భావన కలిగించే విధంగా ఎపి ప్రభుత్వం కృషి చేసిందన్నారు. శాంతిరాం హాస్పిటల్ వైద్యులు హర్షిత, లికిత, జిఎస్‌ఆర్ హాస్పిటల్ నుండి మానసిక వైద్యురాలు హరీఫా భాను మాట్లాడుతూ మహిళలు ప్రతి విషయంలో ముందుండి ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకునేలా కృషి చేయాలన్నారు. అనంతరం నంద్యాల జిల్లాలోని సుమారు 300 మంది మహిళా కానిస్టేబుళ్లకు, పోలీసు కుటుంబ సభ్యులకు శాంతిరాం హాస్పిటల్ వారి సహకారంతో ఉచితంగా మెడికల్ చెకప్ నిర్వహించారు. దాదాపు ఒక లక్ష 50 వేల రూపాయల విలువ చేసే పలు పరీక్షలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని మహిళా పోలీస్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.










