దిన పత్రిక తెరిచీ తెరవగానే ఇకపై సముద్రం అలల నుండి విద్యుత్తు, ఫలానా దేశంతో ఒప్పందం. ప్రత్యామ్నాయ ఇంధన వనరులకై వేట సాగుతూనే ఉంటుంది...వగైరా వగైరా...అంటూ వార్త భలే ఆకట్టుకుంది. నిజమే శిలాజ ఇంధనాలు, బొగ్గు వనరులు ఐపోయే కొద్ది ఇతర మార్గాలను అన్వేషించాల్సిందే, తప్పదు. ఈ భూమిపై ఏ ''ఇంధనం'' లేకుండా ఇతర జంతువులు బతకగలవేమో కాని ఈ సో కాల్డ్ మానవుడికి అది చేత కాదు. కావలిస్తే ఇతర గ్రహాల నుండి, ఇంకా కావలిస్తే ఆరుద్ర గారు చెప్పినట్టు ఘనతారలనధికమించి గ్రహతారల పథమునెంచి గగనాంతర రోదసికి పోయైనా సరే ఎటువంటి ఇంధనాన్నైనా తెచ్చి దాన్ని ధనంగా చేయగల నేర్పు, ఓర్పు, శక్తి ఒక్క మానవుడికే ఉంది. అందుకే మహనీయుడైనాడు, కాకుంటే అవుతాడు. కొద్దిగా ఓపిక పట్టాలంతే.
పంచభూతాల నుండి ఎలాగూ ఇప్పటికే విద్యుత్తుని లాగేస్తున్నాడు మానవుడు. అందులో భాగంగానే ఇప్పుడు అలల నుండి విద్యుత్ తీస్తానంటున్నాడు. ఇదేమీ కొత్త కాదు. శాస్త్రవేత్తలు ఎప్పుడో చెప్పారు. కదిలి, ఇతర వస్తువులను కదిలించే దేనినుండైనా విద్యుత్తును తీయవచ్చు. లేదా మండే ఏ పదార్థాన్నుండైనా విద్యుత్ తీయవచ్చు. లేదా కుళ్ళిపోయి వాసనకొట్టే దేన్నుండైనా విద్యుత్తు తీయవచ్చు. ఇన్ని విధాలా విద్యుత్ తీయవచ్చునని తెలుసుకున్నాక మనసు ఇంకొన్ని ఇంధన వనరుల పైకి మళ్ళింది. వెంటనే కుళ్ళి కంపు కొడుతున్నవి ఏవి అన్న లిస్టొకటి తయారు చేద్దామని కూచుంటె... మన సమాజం కంటే కుళ్ళింది ఏదీ లేదని... కాబట్టి దాని నుండే బహు బాగా విద్యుత్ తీయవచ్చని పక్కనే నా తంటాలు చూస్తూ కూచున్న నా మిత్రుడు చెప్పాడు. అన్న రామారావు కురువ్రుద్ధుల వైపు, గురువుల వైపు చూసి ఆచార్యదేవా ఏమంటివేమంటివి అంటూ చెప్పిన డైలాగు స్ఫూర్తితో మావాడు కుళ్ళిపోయిన జాబితా బయటపెట్టాడు. అది చాంతాడంత ఉంది. 'అధ్యక్షా జాబితా పెట్టడానికి నాకు అవకాశమివ్వండి' అని ఒక్కమాట కూడా అడక్కుండా అధికార పార్టీ ఎంపీల వలే టకటకా చెప్పుకుపోతున్నాడు.
ఈలోగా నా కవి హ్రుదయం మహాకవి శ్రీశ్రీ చెప్పినట్టు కాదేదీ విద్యుత్తుకనర్హం అంటూ గోలపెడుతోంది. అసలు గుండె కదలికల నుండి కూడా విద్యుత్ తీయవచ్చునంది తనను తాను ఎక్కువగా ఊహించుకొని. దాని నోరు నొక్కి నేను ఆలోచించసాగాను. బాగా కుళ్ళినవాటి జాబితా తీస్తే అందులో మన మూఢ నమ్మకాలు ముందు వరుసలో నిలబడి మేము సైతం అన్నాయి. పెద్దాయన రేడియోలో, టీవీలో, ఎన్నికల్లో, పార్లమెంటులో ఎప్పుడూ చెప్పే గ్యాసుతో కూడా విద్యుత్తు పుట్టించవచ్చు. ఆయననేమన్నా అంటే నామీద ఈర్ష్యతో ప్రతిపక్షాల కడుపులు గ్యాసుతో నిండిపోయాయి. వాటి నుండి కూడా విద్యుత్తు తీయొచ్చునంటాడు. వెంటనే ఆయన కింది పరివారం యుగాలు వెనక్కుపోయి అక్కడ పుష్పక విమానాలు పెద్దాయన చెప్పే గ్యాసు లాంటి ఇంధనం తోనే నడిచాయని ఉదాహరణలతో సహా చెప్పేస్తారు. వెంటనే వాళ్ళ నెట్‌వర్క్ అన్ని సెల్లులకు వాట్సప్పు, టెలిగ్రాము, ట్విట్టర్, ఫేసుబుక్కు ఇలా ఎన్ని వీలైతే అన్ని మార్గాల్లో ప్రచారం మొదలుపెట్టి తమ అసమాన, అజ్ఞాన విషయాలను తెర పైకి తెస్తారు.
మొదటగా అబద్దాల నుండి విద్యుత్తును ఎలా తీయవచ్చో కనుక్కుంటే ఆవిధంగా తయారుచేసే విద్యుత్ మన దేశానికే కాకుండా ఇతర దేశాలకు కూడా సరిపోయేంత వస్తుంది. ప్రభుత్వ సంస్థలపైనా, ఎమ్మెల్సీ ఎన్నికల్లో, రాష్ట్రాల ఎన్నికల్లో పుంఖాను పుంఖాలుగా ఈ అసత్యాలు అన్ని పేపర్లలో, టీవీల్లో వచ్చేలా చేస్తే చాలు వాటి నుండి సులభంగా విద్యుత్ తీయవచ్చు. దాంతో ఎన్నికల్లో గెలవడమేకాదు ఇతరత్రా లాభాలనూ చూడాలి మనం. బాగా లాభాలు తెస్తున్న ఎల్.ఐ.సి, జి.ఐ.సి., బ్యాంకులు, పోస్టలు, బి.ఎస్.ఎన్.ఎల్ ఇలా సంస్థలన్నింటినీ తమ కార్పొరేట్ల దీపాలు వెలిగించడానికి అమ్మేసి వాటిపై అవాస్తవాలు చెప్పి ప్రపంచ రికార్డు స్థాపించే మన నాయకులు, ఆర్థిక మంత్రులు మన దేశ విద్యుత్ తయారీకి ఇంతగా సహకరిస్తుంటే అది గమనించకుండా గోల పెట్టడం నిజంగా ఎంత తప్పు?
అలాగే కరోనా తన రెండవ ఇన్నింగు మొదలుపెట్టింది. మొదట్లో ఏమి చెప్పారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. మన దేశం ఉష్ణ దేశం, మన ఆహారపుటలవాట్లు ప్రత్యేకం, మన చెక్క, మొగ్గ, పూత, మిరియాలు, పసుపు ఎంతో మేలైనవి అని కషాయాలు తాపించి అల్సర్లు తెప్పించారు కాని... కరోనాను కట్టడి చేయలేక పోయారు. ఇక ఆవు పంచితం కరోనాకు అసలైన వైద్యమని నమ్మబలికారు. ఇంకా నయం దాని నుండి టీకా తయారు చేస్తున్నామనలేదు. ఇలా మన మూఢ విశ్వాసాల నుండి కూడా విద్యుత్ తీయగలిగితే ప్రపంచంలో మనకెవ్వరూ పోటీ ఉండరు. అందుకే చెప్పడం నమ్మకాన్నుండి విద్యుత్ తీద్దాం. ప్రయోగాలు చేద్దాం. దేన్నుండైనా విద్యుత్ తీయవచ్చు. నన్ను నమ్మండి. నా నమ్మకాన్ని నమ్మండి ప్లీజ్..
* జంధ్యాల రఘుబాబు, సెల్ : 98497 53298










