Apr 15,2023 21:03

బహిరంగ సభలో మాట్లాడుతున్న నారా లోకేష్‌

దేన్నీ వదలని ఫ్యామిలీ మాఫియా
- యువగళం యాత్రలో నారా లోకేష్‌
- తుగ్గలి మండలంలో ఘన స్వాగతం
ప్రజాశక్తి - కర్నూలు ప్రతినిధి/తుగ్గలి

      పత్తికొండ ఎమ్మెల్యే ఫ్యామిలీ మాఫియా దేన్నీ వదలడం లేదని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ పేర్కొన్నారు. యువగళం యాత్ర శనివారం ప్యాపిలి మండలం పొలిమేర మెట్ట నుంచి ప్రారంభమై తుగ్గలి మండలం రాంపల్లి క్రాస్‌ వరకు సాగింది. పత్తికొండ టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి కేఈ శ్యాంబాబు, కేఈ ప్రభాకర్‌, బత్తిన వెంకటరాముడు, మండల కమిటీ అధ్యక్షులు తిరుపాల్‌ నాయుడులు లోకేష్‌కు స్వాగతం పలికారు. రాంపల్లి క్రాస్‌ వద్ద బహిరంగ సభలో లోకేష్‌ మాట్లాడుతూ మద్దికెర రైల్వేస్టేషన్‌లో కప్పం కట్టలేదని రైల్వే కాంట్రాక్టర్‌పై దాడి చేసి వాహనాలు ఎత్తుకెళ్లింది ఫ్యామిలీ మాఫియా సభ్యులని తెలిపారు. బంగారు గనుల యజమానులను బెదిరించి పనులు జరగకుండా ఆపేశారని, టమాటో మార్కెట్‌లో వ్యాపారస్తులను బెదిరించి కమీషన్లు వసూలు చేస్తున్నారని అన్నారు. ఆఖరికి రేషన్‌ బియ్యాన్ని కూడా అక్రమ రవాణా చేస్తుంది ఈ ఫ్యామిలీ మాఫియా అని విమర్శించారు. పత్తికొండ చెరువుని కూడా కబ్జా చేస్తున్నారన్నారు. టమోటా జ్యూస్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తాం అన్నారని, శ్రీదేవి గారు ఆ హామీ ఏం అయ్యిందని ప్రశ్నించారు.
దళితుల భూమిని ఆక్రమించిన వైసిపి నేతలు
- లోకేష్‌ను కలిసి గోడు వెళ్లబోసుకున్న బాధితులు
మూడున్నర దశాబ్ధాలుగా సాగు చేసుకుంటున్న మా భూమిని వైసిపి నేతలు ఆక్రమించి, భూమిలోకి వస్తే చంపేస్తామని బెదిరిస్తున్నారని పత్తికొండ నియోజకవర్గం చెర్లకొత్తూరు గ్రామానికి చెందిన దళితులు యువనేత నారా లోకేష్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. పెద్దకొండలో బాధిత దళితులు లోకేష్‌ను కలిసి వైసిపి నేతల అరాచకాన్ని వివరించారు. భూమిని కబ్జా చేసి తమను అడ్డుకుంటున్నా రని, ఈ విషయమై ఎమ్మార్వో దగ్గర నుంచి కలెక్టర్‌ వరకు అధికారులందరికీ మొరపెట్టుకున్నా న్యాయం జరగలేదని తెలిపారు. నాలుగేళ్లుగా మమ్మల్ని పొలంలోకి రానీయకపోవడంతో బీడుగా మారిపోయిందని, న్యాయం చేయాలని ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి దగ్గరకు వెళితే భూమి మాది కాదని అంటోందన్నారు. టిడిపి అధికారంలోకి వచ్చాక తమకు న్యాయం చేయలని కోరారు. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే వైసిపి నేతలు కబ్జా చేసిన భూమిని దళితులకు అప్పగిస్తామని, న్యాయం కోసం పోరాడుతున్న దళితులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేస్తామని లోకేష్‌ హామీ ఇచ్చారు.
లోకేష్‌ ను కలిసిన కలచట్ల గ్రామస్తులు
కలచట్ల గ్రామస్తులు యువనేత లోకేష్‌ను కలిసి పలు సమస్యలు విన్నవించారు. గ్రామంలో అంతర్గత రోడ్లను తవ్వేసి వదిలేయడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, వేసవిలో తాగు, సాగు నీటికి ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. గ్రామ చెరువును హంద్రీనీవా జలాలతో నింపాలని కోరారు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కలచట్ల చెరువుకు హంద్రీనీవా నీళ్లిస్తామని లోకేష్‌ హామీ ఇచ్చారు.
ఆ ఇళ్లకు ప్రభుత్వం బిల్లులు ఇవ్వడం లేదు
- లోకేష్‌ను కలిసిన ఎన్‌టిఆర్‌ హౌసింగ్‌ లబ్ధిదారులు
టిడిపి హయాంలో ఎన్‌టిఆర్‌ హౌసింగ్‌ పథకం కింద గ్రామంలో నిర్మించుకున్న ఇళ్లకు ప్రస్తుత ప్రభుత్వం బిల్లులు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతోందని ఎస్‌.రంగాపురం ఎన్‌టిఆర్‌ హౌసింగ్‌ లబ్ధిదారులు యువనేత లోకేష్‌ను కలిసి విన్నవించారు. సిసి రోడ్లు, మౌలిక సదుపాయాలు కల్పించకుండా వైసిపి ప్రభుత్వం వేధిస్తుందన్నారు. అప్పలు చేసి ఇళ్లు పూర్తి చేసుకున్న తాము తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఎన్టీఆర్‌ గృహ నిర్మాణ పథకం కింద లబ్ధిదారులకు పెండింగ్‌ బిల్లులు అందజేస్తామని, మౌలిక సదుపాయాలు కల్పిస్తామని లోకేష్‌ హామీ ఇచ్చారు.
లోకేష్‌ను కలిసిన శభాష్‌పురం గ్రామస్తులు
తుగ్గలి మండలం శభాష్‌పురం గ్రామస్తులు లోకేష్‌ను కలిసి సమస్యలను విన్నవించారు. గ్రామంలో సాగు, తాగునీటి సమస్య అధికంగా ఉందని, పొలాల బోర్ల వద్దకు వెళ్లి తాగునీరు తెచ్చుకోవాల్సి వస్తోందని తెలిపారు.

నిరసన... పోలీసుల రంగ ప్రవేశం..
దళితులను కించపరిచే విధంగా మాట్లాడిన లోకేష్‌ ఎస్సీలకు క్షమాపణ చెప్పాలంటూ నియోజకవర్గంలోని కొంతమంది దళిత సంఘం నాయకులు, దళితులు శభాష్‌పురంలో పాదయాత్ర చేస్తున్న లోకేష్‌కు సమీపంలో నిరసన వ్యక్తం చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు. లోకేష్‌ క్షమాపణ చెప్పేంతవరకు నిరసనను విరమించబోమని వారు చెప్పడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని చెదరగొట్టారు. లోకేష్‌ పాదయాత్ర సజావుగా సాగింది.
లోకేష్‌పై ఫేక్‌ మీడియా విష ప్రచారం
- టిడిపి ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎంఎస్‌.రాజు
అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా జగన్‌ ఫేక్‌ మీడియాను అడ్డంపెట్టుకొని, ఫేక్‌ ప్రచారాన్నే నమ్ముకుంటున్నాడని టిడిపి ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎం.ఎస్‌.రాజు అన్నారు. క్యాంప్‌ సైట్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దళితులతో జరిగిన ముఖాముఖి కార్యక్రమంలో లోకేశ్‌ మాట్లాడింది చూస్తే, ఆయన దళితజాతి అభ్యున్నతి కోసం ఎంతగా ఆలోచిస్తున్నాడో అర్థమవుతుందన్నారు. అధికార దాహంతో జగన్‌ అతని ఫేక్‌ మీడియా చేసే విషప్రచారాన్ని నమ్మవద్దని దళితులకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. తప్పుడు ప్రచారం చేయడం జగన్‌, అతని దిక్కు మాలిన మీడియాకి, అతని చిల్లరకు కక్కుర్తిపడే పేటీఎం బ్యాచ్‌కే చెల్లిందన్నారు.
ముందు నుంచి లోకేష్‌ వెంటే...
ఆయన వికలాంగుడు.. అయినా అనుకుంటే సాధ్యం కానిది ఏది లేదని నిరూపిస్తున్నాడు. అనంతపురం జిల్లా అమడగూరు మండలానికి చెందిన టిఎన్‌ఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు కే.రామంజులు నాయుడు తన మూడు చక్రాల బండితో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర వెంటే సాగుతున్నాడు. యాత్ర ప్రారంభం నుండి ఇప్పటి వరకు 900 కిలో మీటర్లు ఆయన కూడా తన యాత్ర సాగిస్తున్నాడు. తనతో పాటు శ్రీ సత్యసాయి జిల్లా రైతు సంఘం అధికార ప్రతినిధి కె.రెడ్డెప్ప కూడా ఉన్నారు.