దీపాల వెలుగులో కాంతులీనిన పద్మనాభుని కొండ
వేకువజాము నుంచే భారీగా తరలివచ్చిన భక్తులు
వాహన రాకపోకలపై అంక్షలతో పలువురి అవస్థలు
ప్రజాశక్తి-పద్మనాభం: ఏటా కార్తీక అమావాస్య రోజున నిర్వహించే పద్మనాభంలోని స్వయంభూ అనంత పద్మనాభస్వామి దీపోత్సవాన్ని బుధవారం వైభవోపేతంగా నిర్వహించారు. వేకువజామున నాలుగు గంటలకే కొండపై ఉన్న దేవాలయంలో అనంతుని శంకు. చక్ర నామాల వద్ద, అలాగే కొండ దిగువనున్న కుంతీమాధవస్వామి ఆలయంలోనూ, అలాగే మాధవస్వామికి ఎడమ భాగంలో ఉన్న లక్ష్మిదేవి అలయాల్లోనూ ఆలయ పురోహితులు ప్రత్యేక పూజలు చేశారు. పెద్దఎత్తున అక్కడికి చేరుకున్న భక్తులు గోత్రనామాలతో పూజలు నిర్వహించారు మధ్యాహ్నం మూడున్నర గంటలకు కుంతీమాధవస్వామి అలయంలో శ్రీదేవి,భూదేవి సమేతుడైన అనంతుని ఉత్సవ విగ్రహలకు ప్రత్యేక పూజలు నిర్వహించి, గాలిగోపురం నుంచి కొండ తొలిమెట్టు వరకు పలు సాంస్కృతిక కార్యక్రమాల నడుమ గరుడ వాహనంపై ఊరేగింపుగా తీసుకెళ్లి,అక్కడ కొబ్బరి మట్టలతో సిద్ధం చేసిన పందిళ్లలో ప్రతిష్టించారు. ఆలయ వంశపార్యపర్య ధర్మకర్త అశోక్‌గజపతి పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించారు.
శుభముహూర్తం ప్రకారం సాయంత్రం ఐదున్నర గంటలకు కొండపైన జేగంట మోగిన వెంటనే అప్పటికే కొండమెట్లపై ఇరువైపులా కూర్చున్న భక్తులంతా ఒకేసారి దీపాలను వెలిగించారు. దీంతో అమావాస్య చిమ్మచీకట్లలోనూ అనంతపద్మనాభుని కొండ, దీపోత్సవాల వెలుగులో దేదీప్యమానంగా వెలిగిపోయింది. అదే సమయంలో కొండపైకెళ్లే మెట్ల మార్గానికి ఇరువైపులా ఏర్పాటుచేసిన బాణాసంచా పేలుళ్లు ఈ వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి
అనంత పద్మనాభుని దీపోత్సవాన్ని పురస్కరించుకుని వేలసంఖ్యలో వచ్చే భక్తుల తాకిడి దృష్ట్యా ఉదయం ఎనిమిది గంటల నుంచే ఘాట్‌రోడ్డు మార్గంలో కొండపైకి వాహనరాకపోకలపై పోలీసులు ఆంక్షలు విధించారు..వృద్ధులు, చిన్నపిల్లలకు దాతల సాయంతో మంచినీరు, ప్రసాద వితరణ చేపట్టారు. రేవిడి పిహెచ్‌సి ఆధ్వర్యంలో వైద్యశిబిరాలను నిర్వహించారు. మీసేవ కేంద్రాలు, ఇటుక బట్టీల యజమానులు, ఎంపిపి కె.రాంబాబు ఆధ్వర్యంలో భక్తులకు తాగునీరు, ప్రసాదాలు పంపిణీ చేశారు. ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు, విఎంఆర్‌డిఎ చైర్‌పర్సన్ అక్కరమాని విజయనిర్మల దంపతులుఅనంతపద్మనాభుని దర్శించుకున్నారు. మద్ది జంక్షన్‌లో త్రిలోక్ ల్యాబ్ ఆధ్వర్యాన ఉచిత వైద్యశిబిరం నిర్వహించారు. వైద్యులు ప్రదీప్, చైతన్య, శివాజీ పాల్గొని, రోగులకు బిపి, సుగర్, ఇతర పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు ఇచ్చారు.
చిరు వ్యాపారుల నిరాశ
దీపోత్సవానికి వచ్చిన భక్తులకు అవసరమైన పూజాసామగ్రి, ఇతర వస్తువులతో రెండు రోజులముందే రోడ్డుకు ఇరువైపులా దుకాణాలు పెట్టిన చిరు వ్యాపారులు ఎసిపి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీసులు వాటిని తెరవనీయకుండా ఆంక్షలు పెట్టడంతో తీవ్ర నిరాశకు గురయ్యారు.
దీపాల వెలుగులో మెరిసిపోతున్న పద్మనాభుని కొండ










