బానిస బతుకుల్లోంచి
బయట పడాలని
మనల్ని మనం ఎన్నిసార్లు చంపుకున్నామో..!
మనలో మనం ఎన్నిసార్లు జన్మలెత్తామో..!
త్యాగాలు కొన్ని.. తెగింపులు కొన్ని
స్వేచ్ఛా గాలుల కోసం
అలుపెరగని పోరాటాలు
ఎన్నో ఎన్నెన్నో..
అన్నిటికీ ముక్తాయింపుగా పంద్రాగస్టు
పంతొమ్మిది వందల నలబై ఏడు...
నేడు కళ్ల ముందు
డెబ్భై ఐదు వసంతాలు..!
ముసి ముసి నవ్వుల
మువ్వన్నెల్ని మూటగట్టుకుని
రంగులు మారుతున్న
లోకాన్ని చూస్తూ ..
నవ్వుతూనే వుంది
మన స్వేచ్ఛా స్వాతంత్య్రం
స్వాతంత్య్రంలో పరతంత్రం
స్వేచ్ఛా గొంతుల హననం
కొనబోతే ధరలకు రెక్కలు
తినబోతే అవి ఆకాశపు చుక్కలు
మార్కెట్ అంతా మాయాజాలం
మనిషి బతుక్కే గాలం
పొంచి వున్న ఉగ్రవాద ముసళ్ళు
కుతకుతలాడే కులమతాల జిల్లేళ్లు
మనిషిని మనిషే మింగే ఆకళ్ళు
కరోనా రక్కసుల సవాళ్లు
రాజకీయ రంగులు ఎన్నో హంగులు
అన్నీ జవాబు లేని దృశ్యాలే..!
అలుపెరగని సమరాలు
కాలం కను కొనల్లో
నిత్యం బాధించే జీవన తిమిరాలు
అన్నీ లెక్కకు మిక్కిలే..!
ఈ స్వతంత్ర సంబరాన
పిప్పరమెంట్లూ.. చాకిలేట్లే కాదు
బాలల బంగరు భవితకు
అక్షర రుచుల్ని వడ్డించాలి..
నీతి నియవరరూల జాడలతో
అభివృద్ధి వాడలతో
ఆకాశాన ఎగిరే త్రివర్ణ పతాకానికి
నిండారా సెల్యూట్ చెయ్యాలి..
మేరా భారత్ మహాన్ అంటూ..
ఆటల్లో పాటల్లో స్వర్ణాలు సాధించుకోవాలి
వెలుగు పూల వసంతాన్ని ఆహ్వానిస్తూ..
మనమంతా భరతమాతకు మానవహారమవ్వాలి..!
డా. కటుకోఝ్వల రమేష్
99490 83327