ప్రజాశక్తి-నక్కపల్లి:మండలంలోని గొడిచెర్లలో తుఫాన్ కారణంగా దెబ్బతిన్న వరి పొలాలను గురువారం జిల్లా వ్యవసాయ అధికారి మోహన్‌రావు స్థానిక వ్యవసాయ అధికారులతో కలిసి పరిశీలించారు. రైతులు వర్షానికి తడిచిన వరి పనలను ఆయనకు చూపించారు. పొలాల్లో తడిచిన వరి పనలపై 5శాతం ఉప్పు ద్రావణం పిచికారి చేయాలని సూచించారు. ప్రభుత్వ మార్గదర్శకాలు ప్రకారం వాటికి నష్టపరిహారం వర్తించదన్నారు. కోత కోయకుండా ఉన్న వరి పొలాలు 33 శాతం కంటే అధికంగా నష్టం వాటిల్లితే నష్టం పరిహారం నమోదు చేయుటకు ఆస్కారం ఉంటుందన్నారు. అనంతరం ధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నక్కపల్లి మండలంలోని గొడిచెర్ల, వేంపాడు రైతు భరోసా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ సహాయ సంచాలకులు (ఏ డీ)టి ఎస్ రాజ్ కమల్, మండల వ్యవసాయధికారి ఉమాప్రసాద్ , వ్యవసాయ సహాయకులు సురేంద్ర, రాకేష్ పాల్గొన్నారు.










