May 16,2023 01:06
తహశీల్దారుకు వినతిపత్రం అందిస్తున్న రైతు సంఘం నాయకులు

ప్రజాశక్తి-భట్టిప్రోలు: వర్షాలకు దెబ్బతిని, రంగుమారిన, మొలకెత్తిన మొక్కజొన్న, పసుపు పంటను తక్షణమే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరకు కొనుగోలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం మండల తహశీల్దారు ఎంఎల్‌ శ్రావణ్‌ కుమార్‌కు రైతు సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. పసుపునకు ప్రభుత్వం ప్రకటించిన విధంగా రూ.6,850 మద్దతు ధరకు బదులుగా క్వింటా 4 నుంచి 5 వేలకు కూడా కొనటం లేదని, వర్షాలకు రంగు మారితే మరో వెయ్యి రూపాయలు తక్కువకు కొనుగోలు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. అతి ఖరీదైన పసుపు పండించటానికి ఎకరాకు రూ.1.70 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఖర్చు అవుతుందని, దిగుబడులు 20 నుంచి 25 క్వింటాళ్లకు మించి రాకపోవటంతో రైతులు లక్ష వరకు నష్టపోతున్నారని వాపోయారు. అలాగే దెబ్బతిన్న పంటలను నమోదు చేసి నష్టపరిహారం అందించాలని, పసుపును రూ.10 వేలుకు కొనుగోలు చేయాలని వినతిపత్రంలో కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం బాపట్ల జిల్లా అధ్యక్షులు వేములపల్లి వెంకట్రామయ్య, మండల అధ్యక్షులు కె రామస్వామి నాయకులు జి సుధాకర్‌, ఎం సత్యనారాయణ, పి మనోజ్‌, వి భగవాన్‌ దాస్‌ తదితరులు ఉన్నారు.