Sep 21,2023 20:37

పాచిపెంట మండలం కర్రివలసలో ఎదుగుదల లేని మొక్కజొన్న

ప్రజాశక్తి - విజయనగరం ప్రతినిధి :  పార్వతీపురం మన్యం జిల్లాలో మొక్కజొన్న వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో దెబ్బతింది. విజయనగరం జిల్లాలో సాగు విస్తీర్ణం తగ్గిపోయింది. అదును తప్పిన వర్షాలే ఇందుకు కారణమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి లేదని మన్యం జిల్లాలోని మొక్కజన్న రైతులు వాపోతుండగా, అసలు పూర్తిస్థాయిలో విత్తనాలు నాటేందుకు కూడా అవకాశం లేకపోయిందని విజయనగరం జిల్లాకు చెందిన వారు చెబుతున్నారు. విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాల్లో వరి తరువాత అంతటి ప్రాధాన్యత గల పంట మొక్కజొన్న. ఈ రెండు జిల్లాల్లో కలిపి దాదాపు 76వేల ఎకరాల్లో సాగవుతుంది. వరుణడు అదును తప్పించడంతో ఈ రెండు జిల్లాల్లో భిన్నమైన రీతిలో రైతులు నష్టాలు చవిచూడాల్సి వస్తుంది.
పార్వతీపురం మన్యం జిల్లాలో ఈ ఏడాది మొక్కజొన్న సాధారణ సాగు విస్తీర్ణం సుమారు 36వేల ఎకరాలు కాగా, జూన్‌లో కురిసిన కొద్దిపాటి వర్షాలకు 34,682 ఎకరాల్లో రైతులు వేశారు. అత్యధికంగా పాచిపెంట మండలంలో 15,430 ఎకరాలు, సాలూరులో 13,612 ఎకరాలు, మక్కువలో 1917ఎకరాల్లో మొక్కజొన్నసాగు నమోదైంది. మిగిలిన మండలాల్లో దాదాపు 500 నుంచి 1500 ఎకరాల వరకు నాటారు. ఆగస్టులో పొట్టవచ్చే సమయం నుంచి కంకికట్టే సమయం వరకు చుక్కనీరు లేకపోవడంతో మోడుబారిపోయాయి. పాచిపెంట మండలం పాచిపెంట, కర్రివలస, కోనవలస, మోసూరు తదితర గ్రామాల్లో ప్రజాశక్తి పరిశీలించగా ఏపుగా పెరిగిన మొక్కజొన్న కంకులు మోడువారుతూ కనిపించాయి. తరువాత వర్షాలు పడినా మొక్కలు తేరుకునే పరిస్థితి కనిపించలేదు. పంట వెన్నుపొడిచే సమయంలో వర్షాలు లేకపోవడంతో తీవ్రంగా నష్టపోయామని కర్రివలసకు చెందిన రౌతు సూర్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. సాలూరు, మక్కువ మండలాల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది.
విజయనగరం జిల్లాలో 40వేల ఎకరాలు సాధారణ విస్తీర్ణం కాగా, 24,055 ఎకరాల్లో మాత్రమే రైతులు నాటారు. తగిన వర్షాలు లేకపోవడంతో చాలా మంది రైతులు అరకొరగాను, కొంతమంది రైతులు పూర్తిగాను మొక్కజొన్న వేయడం మానుకున్నారు. దీంతో, కొన్ని మండలాల్లో విస్తీర్ణం తగ్గిపోగా, మరికొన్ని మండలాల్లో ఒక్క ఎకరాలో కూడా నాటని పరిస్థితి. పూసపాటిరేగ మండలంలో 820 ఎకరాల్లో సాగు కావాల్సివుండగా కేవలం 15ఎకరాల్లో నలుగురు రైతులు మాత్రమే సాగుచేశారు. భోగాపురం మండలంలో 110 ఎకరాల్లో సాగు కావాల్సివుండగా ఒక్క సెంటులో కూడా సాగు కాలేదు. డెంకాడలో 415 ఎకరాలకు గాను 37 ఎకరాల్లో మాత్రమే సాగైంది. దాదాపు అన్ని మండలాల్లోనూ ఇదే పరిస్థితి. మరోవైపు తోటపల్లి నీరు అందకపోవడం, వర్షాభావ పరిస్థితుల వల్ల జిల్లాలో వరినాట్లు కూడా పూర్తికాలేదు. ఇటు మొక్కజొన్న విస్తీర్ణం ఘననీయంగా తగ్గిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
ప్రభుత్వం ఆదుకోకపోతే అప్పులపాలే
ప్రభుత్వం ఆదుకోకపోతే అప్పులపాలైపోతాము. వర్షాలు అదును తప్పడం వల్ల పంట దిగుబడి మూడో వంతు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. జూన్‌లో కురిసిన వర్షాలకు 2.50 ఎకరాల్లో మొక్కజొన్న నాటాను. దుక్కి, విత్తనాలు, డిఎపి, యురియా తదితర ఎరువులు తదితరాల మదుపు ఎకరాకు సుమారు రూ.30వేల చొప్పున మొత్తంగా రూ.75వేలకుపైగా ఖర్చు అయ్యింది. పంటలో ఎదుగుదల లేకపోవడంతో దిక్కుతోచడం లేదు.
సామురోతు సుదర్శనరావు,
మొక్కజొన్న రైతు, కర్రివలస,  పాచిపెంట మండలం


ఒక్క ఎకరాలోనూ నాటలేదు
నాకున్న భూమిలో మూడు ఎకరాల వరకు మొక్కజొన్న నాటేవాడ్ని. ఈ ఏడాది వర్షాభావం వల్ల ఒక్క ఎకరాలోనూ వేయలేదు. స్థానికంగా వర్షాలు కురవకపోయినా తోటపల్లి నీరు వస్తుందన్న ఆశ కూడా లేకపోవడంతో మొక్కజొన్న నాటేందుకు సాహశించలేకపోయాం. ఇటీవల వర్షాలు కురుస్తున్నప్పటికీ సీజన్‌ దాటుతుండడంతో సాగు ఆలోచన విరమించుకున్నాను.
కె.గోవింద, మొక్కజొన రైతు, కనిమెట్ట గ్రామం
పూసపాటిరేగ మండలం