ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : తమ సమస్యల పరిష్కారానికి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పెర్స్ యూనియన్ (సిఐటియు) చేపట్టిన 36 గంటల మహాధర్నా విజయవంతమైంది. పగలు ఎండ, ఉక్కపోత.. రాత్రి వర్షం, చలి గాలులున్నా అంగన్వాడీలు ఉక్కు సంకల్పంతో మహా ధర్నాను కొనసాగించి తమ ఐక్యతను చాటారు. ధర్నాకు సిపిఎం, టిడిపి, ప్రజా సంఘాలు మద్దతు తెలిపాయి. మంగళవారం మధ్యాహ్నం ధర్నా చౌక్ నుండి వేలాది మంది అంగన్వాడీలు భారీ ర్యాలీగా కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. వారి నినాదాలతో కలెక్టరేట్ మారుమోగింది. అంగన్వాడీలతో జాయింట్ కలెక్టర్ ఎ.శ్యాంప్రసాద్ మాట్లాడి వినతిపత్రాన్ని స్వీకరించారు. జిల్లా స్థాయిలో పరిష్కరించదగ్గ సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని, మిగతా అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా ధర్నాకు హాజరైన అంగన్వాడీలకు టిడిపి రాష్ట్ర కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్ భోజనాన్ని సమకూర్చగా ఆయనకు నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.
పోరాట స్ఫూర్తి కొనసాగించాలి
ధర్నా సందర్భంగా వేదిక వద్ద బహిరంగ సభకు యూనియన్ పల్నాడు జిల్లా అధ్యక్షులు కెపి మెటిల్దాదేవి అధ్యక్షత వహించా సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ముజఫర్ అహ్మద్ మాట్లాడారు. ఐక్యంగా ఉద్యమిస్తే ఎంతటి ప్రభుత్వాలనైనా మెడలువంచి హక్కులు సాధించుకోవచ్చని అన్నారు. మాతా శిశు మరణాల నివారణలో కీలకమైన అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ కోతలతో నిర్వీర్యం చేసేందుకు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. అంగన్వాడీల పోరాటానికి వైసిపి మినహా అన్ని రాజకీయ పార్టీలు ప్రత్యక్షంగా మద్దతివ్వడం సంతోషకరమని, వైసిపి నేతలూ మద్దతు తెలుపుతున్నారని అన్నారు. యూనియన్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కెపి మెటిల్డాదేవి, జి.మల్లీశ్వరి మాట్లాడుతూ అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంగన్వాడీలకు 12 ఏళ్లుగా ఒక్క రూపాయి కూడా వేతనం పెంచలేదని ఆవేదన వెలిబుచ్చారు. యూనియన్ పోరాటాల ఫలితంగా 2018లో అంగన్వాడీ వర్కర్లకు రూ.1500, హెల్పర్‌కు రూ.750, మినీ వర్కర్లకు రూ.1200 పెంచుతామని ప్రకటించినా అమలు చేయలేదని, 2017 నుండి టిఎ బిల్లులు ఇవ్వడం లేదని అన్నారు. సమస్యల పరిష్కారానికి దశల వారీగా పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అంగన్వాడీలపై రాజకీయ వేధింపులు ఆపాలని, వారి పనిని వారు సక్రమంగా చేసుకునే వెసులుబాటు కల్పించాలని సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె.హనుమంతరెడ్డి, ఎస్.ఆంజనేయనాయక్ అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న ఐసిడిఎస్‌కు కేంద్ర బడ్జెట్‌లో రూ. 95 వేల కోట్లు కోత విధించారని మండిపడ్డారు.
రాజకీయాలకతీతంగా మద్దతు
ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ చిష్టి
అంగన్వాడీల ఉద్యమానికి రాజకీయాలకు అతీతంగా మద్దతు తెలపాలని ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ చిష్టి అన్నారు. అంగన్వాడీలు ఏదైనా ఇబ్బంది వల్ల ఒక్కరోజు సెలవు పెట్టాలన్నా నలుగురు వద్ద నుండి అనుమతులు తీసుకోవాల్సిన దుస్థితి ఎందుకని ప్రశ్నించారు. అంగన్వాడీల సమస్యలను పరిష్కరించకుంటే రానున్న ఎన్నికల్లో వైసిపికి బుద్ధి చెబుతారని హెచ్చరించారు. అంగన్వాడీల అంశాన్ని ఒక వ్యవస్థకు సంబంధించిన సమస్యగా భవించి పరిష్కారం చూపాలని కోరారు.
పోరాటం స్ఫూర్తిదాయకం
టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి డాక్టర్ చదలవాడ అరవిందబాబు
అంగన్వాడీల సమస్యల పరిష్కారంలో వైసిపి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, వాలంటీర్లు కూడా అంగన్వాడీలపై పెత్తనం చేస్తున్నారని విమర్శించారు. గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారం అందిస్తూ ప్రభుత్వ పథకాలను జనాలకు చేరుస్తున్న అంగన్వాడీలకు కనీస వేతనం పెంచాలన్నారు. సమస్యలపై వారు చేస్తున్న పోరాటం స్ఫూర్తిదాయకమని, వారికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ప్రకటించారు.
నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వాల నిర్ణయాలు
వై.రాధాకృష్ణ, కౌలురైతు సంఘం జిల్లా కార్యదర్శి
జిల్లాలో అనేక ప్రాజెక్టులు ప్రస్తుతం నిబంధనలకు విరుద్ధంగా ప్రమోషన్లు అంగన్వాడీ పోస్టులు భర్తీ చేస్తున్నారని, దీన్ని మానుకోవాలని కౌలురైతు సంఘం జిల్లా కార్యదర్శి వై.రాధాకృష్ణ డిమాండ్ చేశారు. ఐసిడిఎస్ పరిరక్షణ, అంగన్వాడీలకు ఉద్యోగ భద్రత, కనీస వేతనం, పెన్షన్, పిఎఫ్, ఇఎస్‌ఐ అమలు చేయాలని కోరారు. ఐసిడిఎస్ లక్ష్యానికి విరుద్ధంగా సెంటర్లు కుదించడానికి కేంద్రంలోని బిజెపి పభుత్వం యత్నిస్తోందని, ఇందుకు సంబంధించిన అంశాలు నూతన విద్యా విధానంలో ఉన్నాయని తెలిపారు. ఈ కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
యాప్ వేధింపులు మానుకోవాలి
ఉషా, మాచర్ల ప్రాజెక్టు.
ఒకవైపు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన పోషణ యాప్ మరోవైపు రాష్ట్రానికి సంబంధించిన వైఎస్సార్ పోషణ యాప్‌ల వల్ల పనిభారం పెరిగింది. సరిహద్దు ప్రాంతాల్లో నెట్‌వర్క్ సరిగా రావడం లేదు. మాచర్ల, వెల్దుర్తి, దుర్గి మండలం తదితర ప్రాంతాల్లో నెట్‌వర్క్ సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. అప్లోడ్ చేయకపోతే చర్యలు తీసుకుంటున్నారు. బాలింతలకు కిట్లు సక్రమంగా ఇవ్వడం లేదు. రాజకీయ నాయకులు వేధింపులు అధికంగా ఉన్నాయి.
గౌరవంగా బతకనివ్వండి
లుదియా, నరసరావుపేట.
ఉద్యోగ విరమణ పొందిన అంగన్వాడీలు గౌరవ ప్రదంగా జీవించేందుకు రూ.5 లక్షలు, వేతనంలో సగం పెన్షన్ ఇవ్వాలి. 2012 నుండి అంగన్వాడీలకు జీతాలు పెంచలేదు. 2017 నుండి డీఎలు పెండింగ్‌లో ఉన్నాయి. కేంద్రం తెచ్చిన జీవో ఇంతవరకు అమలులో నేర్చుకోలేదు. మినీ వర్కర్లకు వర్కర్లతో సమానంగా వేతనాలు ఇవ్వాలి. వైఎస్‌ఆర్ సంపూర్ణ పోషణ మెనూ ఛార్జీలు అసలు చాలడం లేదు.
కూలీల కంటే దారుణంగా వేతనాలు
రజిని, నాదెండ్ల ప్రాజెక్టు.
మాకిచ్చే వేతనాలు ఉపాధి హామీ కూలీల కంటే దారుణంగా ఉంటున్నాయి. అయినా ప్రభుత్వ ఉద్యోగం పేరుతో మాకు సంక్షేమ పథకాలను నిలిపివేయడం అన్యాయం. ఇతర రాష్ట్రాల్లో అంగన్వాడీల సమస్యలపై ప్రభుత్వాలు స్పందిస్తున్నాయి. వైసిపి ప్రభుత్వం మాత్రం అంగన్వాడీల పట్ల నిర్లక్ష్యంగా ఉంటోంది. ఇప్పటికైనా ప్రభుత్వ స్పందించాలి. అంగన్వాడీ కేంద్రాల బలోపేతానికి కేంద్ర బడ్జెట్లో నిధులు పెంచాలి.
నూతన విద్యావిధానం వద్దు
ఉమాదేవి, సత్తెనపల్లి ప్రాజెక్టు.
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన విద్యా విధానాన్ని తక్షణమే రద్దు చేయాలి. ఇది భవిష్యత్ తరాలకు ముపు. పిల్లలకు కనీసం సరిపడా పోషకాహార పదార్థాలు పంపిణీ చేయాలి. పెరిగిన ధరలకు అనుగుణంగా మెనూ ఛార్జీలు ఇవ్వాలి. రాయితీపై గ్యాస్ సిలిండర్ ప్రభుత్వం పంపిణీ చేయాలి. గ్రాట్యుటీ అమలు చేసి ఆదుకోవాలి. ఉద్యోగ భద్రత కల్పించాలి. కక్ష సాదింపులు పాల్పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
అమ్మఒడి, జెవికె కిట్లు ఇవ్వాలి
కోటేశ్వరమ్మ, నాదెండ్ల ప్రాజెక్టు.
అంగన్వాడీ కేంద్రాల పిల్లలకు కూడా అమ్మఒడి వర్తింపజేయడంతోపాటు జగనన్న విద్యా కానుక (జెవికె) కిట్లను ఇవ్వాలి. అంగన్వాడీలు మృతి చెందితే ఆ పోస్టు భర్తీకి మృతురాలి కుటుంబంలో ఒకరికి ప్రాధాన్యమివ్వాలి. కనీసం తెలంగాణ కంటే అదనంగా ఇస్తానన్న రూ.వెయ్యి ఇవ్వాలి.










